అసెంబ్లీ హాల్ లో నిర్వహించిన కేబినెట్ లో ఆరు గ్యారంటీల అమలుకయ్యే ఖర్చుపై మంత్రివర్గం లెక్కలేయగా.. ప్రస్తుత బడ్జెట్ కంటే మూడింతల బడ్జెట్ అవసరమని తేలింది. దీంతో, పథకాల అమలులో కొర్రీలు పెట్టాలన్న సీఎం రేవంత్ సూచించారని సమాచారం. రైతుబంధు 5 ఎకరాల లోపు వారికే ఇవ్వాలని, మహాలక్ష్మి పథకంలోనూ కోతలు, బస్సుల సంఖ్య తగ్గించి నష్టాన్ని నివారించాలని సీఎం సూచించారని తెలిసింది. ఇందుకు అంగీకరించని తుమ్మల నాగేశ్వర్రావు.. అందరికి ఇస్తామని చెప్పి, అన్ని ఫ్రీ అని చెప్పి ఇప్పుడు కొర్రీలు పెట్టడం కరెక్ట్ కాదని వాదించారని.. అందుకు తుమ్మల వంతపాడారని సమాచారం. అయితే, ఎలా అమలు చేయాలో సీనియర్ మంత్రిగా మీరే చెప్పండంటూ తుమ్మలను రేవంత్ అడిగారని తెలిసింది. దీంతో తుమ్మల మాట్లాడుతూ.. లెక్కలు వేసుకోకుండా ఎన్నికల్లో హామీలు ఎందుకు ఇచ్చారని ఎదురు ప్రశ్నించారని సమాచారం. మధ్యలో కలుగజేసుకున్న పొంగులేటి శాంతింపజేశారని తెలిసింది. మొత్తానికి, కేబినెట్ సమావేశంలో ఆరు గ్యారెంటీల చర్యను పక్కన పెట్టేసి.. గవర్నర్ ప్రసంగానికి ఆమోదం తెలిపి.. అర్థాంతరంగా మంత్రివర్గ సమావేశాన్ని ముగించారని తెలిసింది.
సీఎంపై గుర్రుగా ఉన్న తుమ్మల?
వ్యవసాయ మంత్రి లేకుండా ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులతో సమావేశమై.. రైతుబంధుపై నిర్ణయం తీసుకోవడంతో తుమ్మల ఆగ్రహంగా ఉన్నారని సమాచారం. ఆతర్వాత ఆయన ఖమ్మం నుంచి నగరానికి విచ్చేసి తన శాఖకు సంబంధించిన అధికారులతో సమావేశమై పలు నివేదికలను అడిగారని.. అయితే సీఎంకు వాటిని అందజేశామని వారు చెప్పడంతో.. తుమ్మల ఆగ్రహం వ్యక్తం చేశారని తెలిసింది.