తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వరద మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియాను పెంచింది. వరద మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియాను రూ. 4లక్షల నుంచి రూ.5లక్షలకు పెంచాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. వరద ప్రభావిత జిల్లాలు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, సూర్యాపేట కలెక్టర్లలకు తక్షణ సాయం కోసం రూ. 5 కోట్లు విడుదల చేశారు.
అలాగే వరద ప్రాంతాల్లో అధికారులు పర్యటించి వెంటనే పంట, ఆస్థి నష్టం పై సమాచారం అందించాలని.. ఎప్పటికప్పుడు అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. జాతీయ విపత్తుగా పరిగణనలోకి తీసుకోవాలని తక్షణమే కేంద్రం ఆర్థిక సాయం చేయాలని, వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలని మోడీని కోరుతూ సీఎం రేవంత్ లేఖ రాశారు.
మరోవైపు సీఎం రేవంత్‌రెడ్డి రోడ్డు మార్గం ద్వారా ఖమ్మం బయలుదేరారు. ఖమ్మంలోని వరద ప్రభావిత ప్రాంతాలను ఆయన పరిశీలిస్తారు. భారీ వర్షాలతో ఆ జిల్లాలోని పలు ప్రాంతాలు అతలాకుతలమైన సంగతి తెలిసిందే. నిన్న మంత్రులు భట్టి, పొంగులేటి, తుమ్మల ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు.