భారీ వర్షాలు తెలంగాణను అతలాకుతం చేస్తున్నాయి. రెండు రోజులుగా రాష్ట్రంలో దాదాపు అన్ని జిల్లాల్లో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఎక్కడికక్కడ జన జీవనం అస్తవ్యస్తం అయ్యింది. ఇటువంటి సమయంలో తెలంగాణకు మరోసారి రెయిన్ అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. మరో రెండు రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఓ మోస్తారు నుంచి భారీ, అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ స్పష్టం చేసింది. రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు బలంగా ఉండటంతో పాటు ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది.
తెలంగాణలో పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, రంగారెడ్డి, నారాయణపేట, జోగులాంబ గద్వాల, వనపర్తి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, సిద్దిపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ మేరకు ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు కూడా వీస్తాయని ఐఎండి తెలిపింది. భారీ వర్షాలు, బలమైన ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్ ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. అత్యవనసరం ఐతే తప్ప బయటకు రావద్దని హెచ్చరించారు.