- నిధులు సమయానికి విడుదల అయ్యేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు
- సింగిల్ నోడల్ ఏజెన్సీ ద్వారా సిస్టమ్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ క్విక్ ట్రాన్స్‌ఫర్స్ విధానం అమల్లోకి…
- ఒడిషా, రాజస్థాన్ రాష్ట్రాల్లో అధ్యయనం చేసిన ఆర్థిక శాఖ అధికారులు
కేంద్ర పథకాలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకునేలా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా కేంద్ర మార్గదర్శకాల మేరకు సింగిల్ నోడల్ ఏజెన్సీ ద్వారా సిస్టమ్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ క్విక్ ట్రాన్స్‌ఫర్స్ విధానాన్ని వినియోగించాలని నిర్ణయించింది. ఈ సిస్టమ్ వల్ల కేంద్ర ప్రభుత్వ పథకాలను పూర్తిస్థాయిలో సద్వినియోగం కానున్నాయి. దీంతోపాటు నిధులు కూడా సమయానికి విడుదల అయ్యేలా తగిన కార్యాచరణను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే ఒడిషా, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఈ సిస్టం అమలవుతుండగా అక్కడ అమలవుతున్న తీరును తెలంగాణకు చెందిన అధికారుల బృందం ఇప్పటికే అధ్యయనం చేసింది. అక్కడ అమలవుతున్న విధానాల గురించి తెలంగాణ అధికారుల బృందం చర్చించింది. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని రాష్ట్రంలోనూ ఈ తరహా విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వానికి నివేదిక అందచేసింది. ఈ రెండు రాష్ట్రాల్లో చేపట్టిన పలు అంశాల ఆధారంగా మన రాష్ట్రంలోనూ ఈ విధానాన్ని అమలు చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా వీలైనన్ని ఎక్కువ నిధులు రాబట్టుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుండగా అధికారుల నివేదిక ఆధారంగా ఇక్కడి ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది.
ఆర్థిక శాఖలో ప్రత్యేక యూనిట్
ఈ విధానం అమలు కోసం ఆర్థిక శాఖలో ప్రత్యేక యూనిట్‌ను ఏర్పాటు చేశారు. కేంద్ర పథకాల నిధుల పర్యవేక్షణ కోసం ఓ అధికారి నేతృత్వంలో అకౌంట్ రెండరింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేశారు. కేంద్ర పథకాలకు సంబంధించిన బిల్స్, చెల్లింపులు, పరిశీలన, నివేదికల తయారీ, అకౌంటెంట్ జనరల్‌కు నెలవారీ నివేదికల సమర్పణ తదితరాలను ఈ విభాగం పూర్తి స్థాయిలో పర్యవేక్షించనుంది. దాని ఆధారంగా మనకు ఎప్పటికప్పుడు కేంద్రం నుంచి పలు పథకాలకు సంబంధించి నిధులు అందనున్నాయి. ఆయా కేంద్ర పథకాలను అమలు చేసే కేంద్ర ప్రభుత్వ శాఖలు ప్రత్యేక ఖాతాలను తెరిచి వాటి ద్వారా లావాదేవీలు నిర్వహించనున్నాయి. దానికి అనుసంధానంగా రాష్ట్ర ఆర్థిక శాఖ కూడా ఖాతా తెరువనుంది. ఆయా పథకాలకు ప్రత్యేక కోడ్ ఇచ్చి వాటి ద్వారా నిధుల విడుదల కోసం ఉత్తర్వులు జారీ చేయనున్నారు. తద్వారా సకాలంలో నిధులు విడుదలై పథకాల అమలుకు ఎలాంటి ఇబ్బంది ఉండదని ఆర్థిక శాఖ అధికారులు భావిస్తున్నారు.
పలు రాష్ట్రాల ఫిర్యాదుతో కేంద్రం ఈ కొత్త విధానం
మన రాష్ట్రంలో ఈ విధానం అమలుతో తెలంగాణలో అమలు చేయదగ్గ పథకాలను గుర్తించి కేంద్రం నుంచి నిధులు పొందేలా అన్ని శాఖలు చర్యలు చేపట్టవచ్చు. కేంద్ర ప్రభుత్వం నుంచి వీలైనన్ని గ్రాంట్లను రాబట్టవచ్చు. అయితే గతంలో చాలా సందర్భాల్లో రాష్ట్రాలు వాటాగా ఇవ్వాల్సిన నిధులు సకాలంలో విడుదల చేయకపోవడంతో రాష్ట్రంలో అమలవుతున్న పథకాలకు నిధులు సకాలంలో అందలేదు. ఈ నేపథ్యంలోనే పలు రాష్ట్రాలు కేంద్రానికి ఈ విషయమై ఫిర్యాదు చేయడంతో ఈ సమస్యను అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం సింగిల్ నోడల్ ఏజెన్సీ ద్వారా సిస్టమ్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ క్విక్ ట్రాన్స్ ఫర్స్ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఈ విధానంలో కేంద్ర ఆర్థిక శాఖ, రాష్ట్ర ఆర్థిక శాఖ, రిజర్వ్ బ్యాంకు ఆధ్వర్యంలోని ఈ- కుబేర్ వ్యవస్థలు కలిసి పనిచేయనున్నాయి.