డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని వినతి
టాలీవుడ్ హీరో రాజశేఖర్ గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పోరేషన్ కమీషనర్ కు ప్రత్యేకంగా ఓ విజ్ఞప్తి చేయడం ఆసక్తికరంగా మారింది. తాను నివాసం ఉండే ప్రాంతంలో డ్రైనేజీ సమస్యను జీహెచ్ఎంసీ కమీషనర్ తో పాటు మేయర్ దృష్టికి తీసుకువచ్చారు రాజశేఖర్. హైదరాబాద్ లో వర్షాలు కురిసినప్పుడల్లా పరిస్థితి దారుణంగా ఉంటుందన్న సంగతి అందరికి తెలిసిందే. చిన్న పాటి వాన పడినా రోడ్లు చెరువులవుతాయి. అదే ఎడతెరపి లేకుండా భారీ వర్షం కురిస్తే డ్రైనేజీలు ఉప్పొంగి పొర్లడం సర్వసాధారణం.
హీరో రాజశేఖర్ సైతం ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నారట. ఈ క్రమంలోనే సదరు సమస్యను జీహెచ్ఎంసీ కమీషనర్ అమ్రపాలి, మేయర్ గద్వాల విజయలక్ష్మి దృష్టికి తెచ్చే ప్రయత్నం చేశారు. తాను నివాసం ఉండే జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 70 లోని అశ్విని హైట్స్లో డ్రైనేజీ లీక్ సమస్య చాలా రోజులుగా ఇబ్బంది పెడుతోందని.. ఈ లీకేజీ సమస్య గురించి పలు మార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ చర్యలు తీసుకోవడం లేదని.. డ్రైనేజీ సమస్యకు వెంటనే పరిష్కారం చూపించాలని.. అని కోరుతూ ట్వీట్ చేశారు హీరో రాజశేఖర్.
జీహెచ్ఎంసీ కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన తరువాత నగరంలో ఆకస్మిక తనిఖీలు చేస్తూ.. పారిశుధ్య నిర్వాహణపై స్పెషల్ ఫోకస్ పెట్టారు అమ్రపాలి. అందుకే తమ ప్రాంతంలోని డ్రైనేజీ సమస్యపై ట్వీట్ చేస్తూ జీహెచ్ఎంసీ కమీషనర్ అమ్రపాలి, మేయర్ గద్వాల విజయలక్ష్మిని ట్యాగ్ చేశారు రాజశేఖర్. మరి రాజశేఖర్ వినతిపై కమీషనర్, మేయర్ తో పాటు అధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి.