ఊహించినట్టే జరిగింది. రాష్ట్రంలో గ్రూపు-1 నియామకాలకు హైకోర్టు బ్రేక్ వేసింది. విచారణ పూర్తయ్యే వరకు అభ్యర్థులకు నియామక పత్రాలు ఇవ్వొద్దని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ)కు ఆదేశాలు జారీ చేసింది. అప్పటివరకు ఎంపిక అయిన అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తిచేసుకోవాలని గురువారం సూచించింది. గ్రూపు-1 పరీక్షలో అవకతవకలు జరిగాయంటూ 20 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ షిటిషన్లను గురువారం విచారణకు స్వీకరించిన కోర్టు.. తుది విచారణ పూర్తయ్యే వరకు అభ్యర్థులకు నియామక పత్రాలు ఇవ్వొద్దని ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలతో ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్ధుల్లో ఆందోళన మొదలైంది.
కాగా గతకొన్ని రోజులుగా గ్రూపు-1పై రాజకీయ రచ్చ నడుస్తోంది. గ్రూపు-1 నియామకాల్లో రూ. కోట్ల అవినీతి జరిగిందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి ఆరోపణలు చేస్తున్నారు. పరీక్ష రాయని 10 మందికి ఫలితాలు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. పరీక్షను వెంటనే రద్దు చేసి సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కౌశిక్‌రెడ్డితో పాటు మరికొందరు విపక్ష నేతలు సైతం గ్రూపు-1పై విమర్శలు గుప్పించారు. ఈ ఆరోపణలను టీజీపీఎస్సీ ఇప్పటికే ఖండించింది. ప్రొటోకాల్ ప్రకారమే నిపుణులతో వాల్యుయేషన్ చేయించినట్లు తెలిపింది.