హైకోర్టులో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పిటిషన్
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై వేటు వేయాలని డిమాండ్
10 మంది బీఆర్ఎస్ ఎమ్మల్యేలకు హైకోర్టు నోటీసులు
తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. రోజుకో పరిణామంతో.. ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఇప్పటికే.. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేయాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వేసిన పిటిషన్‌పై హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే.. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కూడా పార్టీ ఫిరాయించిన నేతలపై అనర్హత వేటు వేయాలంటూ పిటిషన్ వేయగా.. ఆ పది మంది ఎమ్మల్యేలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ వేసిన పిటిషన్.. 10 మంది తెలంగాణ ఎమ్మెల్యేలకు ఏకంగా హైకోర్టే నోటీసులు జారీ చేసేలా చేసింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున గెలిచి.. అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కేఏ పాల్.. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు.. 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జరీ చేసిన ధర్మాసనం.. విచారణను 4 వారాలకు వాయిదా వేసింది.
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ కేఏ పాల్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఒక పార్టీ నుంచి పోటీ చేసి గెలిచిన తర్వాత.. మరో పార్టీలోకి మారటమనేది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని కేఏ పాల్ అభిప్రాయపడ్డారు. తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాంటూ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో కేఏ పాల్ కోరారు.
ఖైరతాబాద్ నుంచి బీఆర్ఎస్ టికెట్ మీద విజయం సాధించిన ఎమ్మెల్యే దానం నాగేందర్.. ఆరు నెలల తిరగకముందే పార్టీ మారటమే కాకుండా.. ఆ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేసినట్టుగా పిటిషన్‌లో కేఏ పాల్ పేర్కొన్నారు. తాను పోటీ చేసి గెలిచిన పార్టీకి రాజీనామా చేయకుండానే.. వేరే పార్టీలో చేరి అధికారాలను అనుభవిస్తున్నారని.. అది తప్పు అని అభిప్రాయపడ్డారు. ఇది చట్టాన్ని, రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్లే అవుతుందని పిటిషన్‌లో కేఏ పాల్ పేర్కొన్నారు. ఈ పిటిషన్ మీద విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం.. పార్టీ మారిన 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసింది.
ఇదిలా ఉంటే.. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేల విషయంలో.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, వివేకానంద గౌడ్.. దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు కీలక తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అసెంబ్లీ స్పీకర్‌కు కీలక ఆదేశాలిచ్చింది. పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలంటూ స్పీకర్ కార్యాలయానికి ఆదేశాలు జారీ చేసింది. అప్పటికీ కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోతే.. సుమోటోగా కేసు విచారిస్తామని తెలిపింది.
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌తో పాటు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై అనర్హత వేటు వేయాలంటూ పిటిషన్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హైకోర్టును కోరారు. ఈ మేరకు హైకోర్టు కీలక ఆదేశాలివ్వటంతో.. ఎలాంటి పరిణామాలు చోటుచేసుకోనున్నాయన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. కాగా.. ఇప్పుడు కేఏ పాల్ కూడా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో జంప్ అయిన 10 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలంటూ పిటిషన్ వేయటం.. వారికి హైకోర్టు నోటీసులు జారీ చేయడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.