-
ఇతర రాష్ట్రాల ఐఏఎస్‌లకే ఉన్నత పోస్టులా..?
-
ప్రాధాన్యత లేని పోస్టుల్లో తెలంగాణ కేడర్ ఐఏఎస్‌లు..!
-
అపాయింట్‌మెంట్ ఇవ్వని సిఎస్
-
ఆందోళనలో కన్‌ఫర్డ్, తెలంగాణకు చెందిన ఐఏఎస్‌లు
-
త్వరలోనే సిఎం రేవంత్‌ను కలవాలని నిర్ణయం
కన్‌ఫర్డ్, తెలంగాణకు చెందిన ఐఏఎస్‌లకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రాధాన్యత ఇవ్వడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సిఎస్‌ను కలిసి తమ బాధలను చెప్పుకోవడానికి కన్‌ఫర్డ్, తెలంగాణకు చెందిన ఐఏఎస్‌లు ప్రయత్నించినా వారికి సిఎస్ అపాయింట్‌మెంట్ దొరకడం లేదని వారు వాపోతున్నారు. తమపై ఎందుకీ వివక్ష అంటూ వారు ప్రశ్నిస్తున్నారు. చాలామంది కన్‌ఫర్డ్, తెలంగాణకు చెందిన ఐఏఎస్‌లకు ప్రాధాన్యత లేని పదవుల్లో నియమించారని, దీనిపై తమ గోడును సిఎస్‌కు తెలియచేయాలని నెలల తరబడి ప్రయత్నిస్తున్నా కనీసం తమతో మాట్లాడడానికి సిఎస్ ఆసక్తి చూపడం లేదని వారు ఆరోపిస్తున్నారు. సీనియారిటీ ప్రకారం అవకాశం ఇవ్వాల్సిన ప్రభుత్వం, సర్వీసులో ఉన్నవారిని కాదని, రిటైరైన వారిని, వేరే రాష్ట్రం నుంచి డిప్యూటేషన్‌పై ఇక్కడ పనిచేస్తున్న వారిని కీలక పదవుల్లో నియమిస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బడుగు, బలహీన వర్గాలకు చెందిన కన్‌ఫర్డ్, తెలంగాణకు చెందిన ఐఏఎస్‌లను కావాలనే నాన్ ఫోకల్ పోస్టులకే పరిమితం చేస్తున్నారని ఐఏఎస్‌లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయాన్ని వారు సిఎం దృష్టికి సైతం తీసుకెళ్లాలని నిర్ణయించినట్టుగా సమాచారం. రాష్ట్రంలో 170 మంది ఐఏఎస్‌లు ఉంటే అందులో సుమారు 70 మంది తెలంగాణ కేడర్‌కు చెందిన వారు ఉండగా వారిలో కన్‌ఫర్డ్ ఐఏఎస్‌లే అధికంగా ఉన్నారు.
గతంలోనూ ఓ సిఎస్ ఇలాగే….
గత ప్రభుత్వంలోనూ ఇలాంటి పరిస్థితులే ఎదురయ్యాయని, ప్రస్తుతం ఇప్పుడు కూడా అదే జరుగుతోందని కనీసం తమ మాట వినడానికి సిఎస్ అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తుండడం విశేషం. సిఎస్ ప్రస్తుతం అపాయింట్‌మెంట్ ఇవ్వకపోవడం తమకు ఫోకల్ పాయింట్ దక్కదన్న అసంతృప్తితో కొంతమంది కన్‌ఫర్డ్, తెలంగాణకు చెందిన ఐఏఎస్‌లు సెలవుపై వెళ్లాలని నిర్ణయించుకున్నట్టుగా సమాచారం. ప్రస్తుతం కన్‌ఫర్డ్, తెలంగాణకు చెందిన ఐఏఎస్‌ల్లో చాలామంది సెక్రటరీ కేడర్ అధికారులు, అడిషనల్ సెక్రటరీ వంటి పోస్టులతోనే సరిపెట్టుకోవాల్సి వస్తోందని వారు వాపోతున్నారు. గత ప్రభుత్వలోనూ ఓ సిఎస్ ఇలాగే వ్యవహారించారని, ప్రస్తుతం ఈ సిఎస్ అయినా కనీసం తమను పట్టించుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. తమ కేడర్‌కు తగినట్టుగా పోస్టులు లభించడం లేదని వారు వాపోతున్నారు. రిటైర్ అయిన అధికారుల కంటే తమ పరిస్థితి అధ్వానంగా ఉందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ కేడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారులకు తీరని అన్యాయం జరుగుతోందని సెక్రటేరియట్ వర్గాల్లోనూ చర్చ జరగడం విశేషం. కొన్ని వర్గాల వారికే కీలక పోస్టులు ఇస్తున్నారని వారు ఆరోపిస్తుండడం గమనార్హం.
కారు కూడా లేని ఐఏఎస్‌లు..!
తెలంగాణకు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారులను సైతం నాన్ ఫోకల్ పాయింట్లలో నియమిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. సాధారణ పరిపాలన శాఖ, గిరిజన సంక్షేమశాఖ, ఎస్సీ సంక్షేమ శాఖ, యువజన సర్వీసులు, డైరీ డెవలప్‌మెంట్, పశుసంవర్ధక శాఖ, క్రీడలు, ఆర్కియాలజీ, ఎయిడ్స్ సొసైటీ, ప్లానింగ్ డిపార్ట్‌మెంట్ తదితర శాఖల్లో కొంతమంది కన్ఫర్డ్ ఐఏఎస్ అధికారులను నాన్ ఫోకల్ పాయింట్‌లలో నియమించారని, ఇతర ఉన్నతాధికారుల కింద వారు పని చేయాల్సి వస్తోందని వారు వాపోతున్నారు. కొంతమందిని అప్రాధాన్యమైన అదనపు కార్యదర్శి పోస్టుల్లో నియమించి, వెలుగులోకి రాకుండా చేస్తున్నారన్న అసంతృప్తి సైతం వారు వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో 33 జిల్లాలు ఉంటే తెలంగాణ కేడర్‌కు చెందిన ఐఏఎస్‌లు ఐదరుగురికి మించి లేరని వారు ఆరోపిస్తున్నారు. అందులో డైరెక్ట్ ఐఏఎస్‌లు ఎక్కువగా కన్ఫర్డ్‌లు తక్కువగా ఉండడం విశేషం. అంతేగాక ప్రాధాన్యత లేని డిపార్ట్‌మెంట్ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, అడిషనల్ సెక్రటరీలు, డైరెక్టర్లు, మేనేజింగ్ డైరెక్టర్లుగా నియమించి తమను అవమానిస్తున్నారని వారు వాపోతున్నారు. కొంత మంది పని చేస్తున్న శాఖల్లో ఆ ఐఏఎస్‌లకు కారు, సిబ్బంది కూడా లేని పదవుల్లో నియమించి అవమానిస్తున్నారని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.