తెలంగాణ హైకోర్టు సీజేగా జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్ నియమితులయ్యారు. ఆయన పేరును సిఫార్సు చేస్తూ సుప్రీం కోర్టు కొలీజియం నిర్ణయం తీసుకుంది. అపరేశ్ కుమార్ సింగ్ ప్రస్తుతం త్రిపుర హైకోర్టు సీజేగా విధులు నిర్వర్తిస్తున్నారు. కాగా తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి.వినోద్ కుమార్‌ను మద్రాస్ హైకోర్టుకు బదిలీ చేస్తూ కొలీజియం నిర్ణయం తీసుకుంది. మరోవైపు.. సుప్రీం కోర్టు కొలీజియంతో పాటు చీఫ్ జస్టీస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తులను తెలంగాణ హైకోర్టుకు తిరిగి పంపాలని సిఫారసు చేశారు. ఆ న్యాయమూర్తులు గతంలో ఇతర రాష్ట్రాల హైకోర్టులకు బదిలీ అయ్యారు. ఇక తెలంగాణ హైకోర్టు యాక్టింగ్ చీఫ్ జస్టిస్ జోయ్‌పాల్‌ను కలకత్తా హైకోర్టుకు న్యాయమూర్తిగా బదిలీ చేయాలని ప్రతిపాదించారు. దేశ వ్యాప్తంగా 21 హైకోర్టు న్యాయమూర్తుల బదిలీ, తిరిగి వెనక్కి పంపాలని సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. ఇందులో కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సి.సుమలత, జస్టిస్ కన్నెగంటి లలితను తెలంగాణ హైకోర్టుకు తిరిగి పంపాలని భావిస్తున్నది. ప్రస్తుతం పాట్నా హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ అన్నిరెడ్డి అభిషేక్ రెడ్డిని తెలంగాణ హైకోర్టుకు తిరిగి బదిలీ చేయాలని ఆ కొలీజియం సిఫార్సు చేసింది.