Monday, January 27, 2025

గజం ధ‌ర‌ రూ.1.85 లక్షలు..!

  • కూకట్‌పల్లి ప్లాట్ల వేలంలో భారీగా ధర
  • ప్లాట్ల వేలం అడ్డుకుటామన్న ఎమ్మెల్యే గృహ నిర్బంధం
కూకట్‌పల్లి హౌసింగ్‌ ‌బోర్టు స్థలాలకు భారీ ధర పలికింది. సర్కార్‌కు భారీగా ఆదాయం సమకూరింది. కూకట్‌పల్లి హౌసింగ్‌ ‌బోర్డు పశ్చిమ డివిజన్‌ ‌పరిధిలోని ఖాలీ ప్లాట్ల వేలం పాట శుక్రవారం సాయంత్రం ముగిసింది. చదరపు గజం ధర అత్యధికంగా రూ.1.85 లక్షలు.. అత్యల్పంగా రూ.1.50 లక్షలు పలికింది. కేపీహెచ్‌బీ పరిధిలోని 24 స్థలాల్లో 23 స్థలాలకు వేలంపాట ప్ర‌క్రియ పూర్తయినట్టు అధికారులు తెలిపారు. ఇదిలావుంటే కేపీహెచ్‌బీ పరిధిలోని ఖాలీ ప్లాట్ల వేలం వ్యవహారంపై తెలంగాణ హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది.
కేపీహెచ్‌బీ ఫేజ్‌-15 ‌కాలనీ వాసులు దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్‌ ‌టి.వినోద్‌ ‌కుమార్‌ ‌విచారణ చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏజీ సుదర్శన్‌ ‌రెడ్డి వాదనలు వినిపించారు. 54.29 ఎకరాల స్థలంలో లేఅవుట్‌ ఉం‌దని.. అందులో 10శాతం గ్రీనరీ కోసం వదిలేయాలి కదా అని వాదనల సందర్భంగా కోర్టు ప్రశ్నించింది. గ్రీనరీ కోసం కేటాయించిన స్థలాన్ని కూడా ప్లాట్లుగా విక్రయిస్తున్నారా? అని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. 10 శాతం ఖాలీ స్థలాన్ని ఇప్పటికే జీహెచ్‌ఎం‌సీకి అప్పగించామని ఏజీ కోర్టుకు తెలిపారు. కేపీహెచ్‌బీ.. ఆసియాలోనే అతిపెద్దది, పాత లేఅవుట్‌ ‌కదా అని న్యాయమూర్తి ప్రశ్నించారు.
లేఅవుట్‌లో అక్కడక్కడా మిగిలిన ప్లాట్లను మాత్రమే వేలం వేస్తున్నట్లు ఏజీ తెలిపారు. అయితే, కేవలం 30 గజాల స్థలాన్ని ఎందుకు వేలం వేస్తున్నారని.. అది వ్యాపార అవసరాలకే ఉపయోగపడుతుంది కదా అని ఏజీని ప్రశ్నించింది. లేఅవుట్‌లో గ్రీనరీ కోసం కేటాయించిన 10శాతం భూమి వివరాలు ఇవ్వాలని ఏజీని ఆదేశించింది. తుది కేటాయింపులు చేయకూడదనే షరతుతో వేలంపాట కొనసాగించవచ్చని కోర్టు తెలిపింది. పిటిషన్‌పై తదుపరి విచారణను ధర్మాసనం వొచ్చే గురువారానికి వాయిదా వేసింది.
కాగా కూకట్‌పల్లి హౌసింగ్‌ ‌బోర్డ్ ‌భూముల వేలం  వివాదాస్పదంగా మారింది. భారీ పోలీసు బందోబస్తు మధ్య కేపీహెచ్‌బీ భూమలు వేలం కొనసాగుతోంది. రోడ్డు విస్తరణలో కోల్పోయే ప్లాట్లను ప్రజలకు అమ్మి మోసం చేస్తున్నారంటూ బీఆర్‌ఎస్‌ ‌నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాస్టర్‌ ‌ప్లాన్లు పరిగణలోకి తీసుకోకుండా ప్లాట్లను అమ్మతుండ‌డంతో ప్రజలు నష్టపోతారంటూ ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో భూముల వేలాన్ని అడ్డుకోవాలని పిలుపునిచ్చిన స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావును పోలీసులు హౌస్‌ అరెస్ట్ ‌చేశారు. హౌసింగ్‌ ‌స్థలాల వేలంలో భాగంగా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. ఎమ్మెల్యే నివాసం వద్ద పోలీసులు మోహరించారు. పోలీసుల తీరుపై ఎమ్మెల్యే అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
 భూముల వేలాన్ని అడ్డుకుని తీరుతామని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు స్పష్టం చేశారు. దీంతో ముందస్తు చర్యల్లో భాగంగా ఎమ్మెల్యేను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. కాగా.. కేపీహెచ్‌బీలో భూముల వేలాన్ని జనసేన నేతలు కూడా అడ్డుకునేందుకు యత్నించారు. వేలం ప్రాంగణానికి వొచ్చిన జనసేన నేతలను పోలీసులు అడ్డుకుని అరెస్ట్ ‌చేశారు. దీంతో పోలీసులకు, జనసేన నేతలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కాగా.. కూకట్‌పల్లి హౌసింగ్‌ ‌బోర్డు కాలనీ పరిధిలో మిగిలిన ప్లాట్లను వేలం వేయనున్నట్లు గృహ నిర్మాణ శాఖ కమిషనర్‌, ‌బోర్డు వైస్‌ ‌చైర్మన్‌ ‌వి.పి.గౌతమ్‌ ఓ ‌ప్రకటనలో తెలిపారు. గృహ నిర్మాణ పథకాల అమలుకు వీలు కాని చిన్నచిన్న విస్తీర్ణం కలిగిన ప్లాట్లను, గృహాల మధ్య అక్కడక్కడా మిగిలిపోయిన ప్లాట్లనే వేలం వేస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అలాగే హౌసింగ్‌ ‌బోర్డు పరిధిలో ఉన్న 700 ఎకరాల భూములు అన్యాక్రాంతం కాకుండా తగిన చర్యలు తీసుకున్నామని గౌతమ్‌ ఈ ‌సందర్భంగా వెల్లడించారు.

ప్ర‌దాన వార్త‌లు

గోటితో పోయే దాన్ని గోడ్డ‌లి వ‌ర‌కు తెచ్చారు... బ‌న్నీ అరెస్ట్‌ వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com