- నిషేధిత జాబితాలో ఉన్న భూముల్లో నిర్మాణాలు
- ఫ్రీలాంచ్ చేసినా పట్టించుకోని రెరా అథారిటీ
- కోర్టు కేసులున్నా అనుమతులు ఇచ్చిన హెచ్‌ఎండిఏ అధికారులు
- పటాన్‌చెరు, సంగారెడ్డి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఆ భూమిపై
- నిషేధం ఉన్నా డెవలప్‌మెంట్ అగ్రిమెంట్, మార్టిగేజ్ చేసిన సబ్ రిజిస్ట్రార్‌లు
కోర్టు కేసులుండగానే హెచ్‌ఎండిఏ, రెరా అథారిటీ అనుమతులు ఇవ్వడం, నిషేధిత జాబితాలో ఉన్న భూమికి సబ్ రిజిస్ట్రార్ డెవలప్‌మెంట్ అగ్రిమెంట్, మార్టిగేజ్ చేయడంతో కొనుగోలు దారులు ఇబ్బందులు పడే పరిస్థితి నెలకొంది. దీంతోపాటు హెచ్‌ఎండిఏకు, రెరా అథారిటీకి స్థానికుల ఫిర్యాదులు చేసినా పట్టించుకోకుండా అనుమతులు ఇవ్వడం వెనుక అవినీతి భారీగా జరిగిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే…. ఆర్‌ఎస్ పసురా, శిల్పా రియల్ ఎస్టేట్, హ్యాపీ మొబైల్స్‌లకు సంబంధించిన భూమిని అన్విత హై 9 అనే రియల్ సంస్థ కొల్లూరులోని 137, 138 సర్వే నెంబర్‌లలోని 24.14 ఎకరాల స్థలంలో నిర్మాణాలను చేపట్టడానికి హెచ్‌ఎండిఏకు అనుమతి కోసం దరఖాస్తు చేసుకుంది.
ఇందులో నుంచి 15.26 ఎకరాల స్థలంలో అపార్టుమెంట్లను కట్టేందుకు అనుమతి (0023225/బిపి/హెచ్‌ఎండిఏ/0468/ఎస్కేపీ 2023) అన్విత హై 9 సంస్థ తీసుకుంది. పది శాతం బిల్టప్ ఏరియాను బిల్డర్ హెచ్‌ఎండిఏకు మార్టిగేజ్ (18125/2023) చేశారు. ఇది సంగారెడ్డి రిజిస్ట్రేషన్ కార్యాలయంలో రిజిస్ట్రర్ అయ్యింది. అయితే, ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే కొల్లూరు గ్రామంలోని సర్వే నెంబర్ 138/ఏఏ (138 సర్వే నెంబర్ సబ్ డివిజన్)కు సంబంధించి సంగారెడ్డి కోర్టులో కేసు (ఓఎస్ 182/2016, 28.12.2016) ఉంది. అంతే కాకుండా, తెలంగాణ స్టాంప్స్, రిజిస్ట్రేషన్స్ శాఖ ఈ భూమిని నిషేధిత ప్రాపర్టీగా రూరల్ ప్రొహిబిటెడ్ రిజిస్ట్రర్‌లో నమోదు చేయడంతో దీనిని సబ్ రిజిస్ట్రార్ పోర్టల్‌లో నిషేధిత భూమిగా పేర్కొన్నారు.
తూతూమంత్రంగా రెరా అథారిటీ నోటీసులు….
అన్విత హై 9 ప్రాజెక్టుకు అనుమతులకు సంబంధించి నిషేధిత భూమిలో నిర్మాణం చేపట్టడానికి హెచ్‌ఎండిఏకు ఆ సంస్థ దరఖాస్తు చేసుకుంది. దీనికి హెచ్‌ఎండిఏ అధికారులు వెనకాముందు ఆలోచించకుండా అనుమతులను జారీ చేశారు. అనంతరం దీనికి రెరా అథారిటీ సైతం అనుమతులు ఇవ్వడంతో కొనుగోలుదారుల పరిస్థితి ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారింది. రానున్న రోజుల్లో ఇందులో ప్లాట్‌ను కొనుగోలు చేస్తే వారు కోర్టు చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని స్థానికులు పేర్కొంటున్నారు. నిషేధిత జాబితాలో ఉందంటూ సదరు సర్వే నెంబర్లన్నీ అన్ని రికార్డుల్లో చూపిస్తున్నా హెచ్‌ఎండిఏ, రెరా అధికారులు అనుమతులను జారీ చేయడంపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి.
వాటిపై వివాదం నడుస్తుండగానే సదరు బిల్డర్ మాత్రం వాటిని ప్రీలాంచ్ ఆఫర్లతో అమ్మేస్తుండడం విశేషం. రెరా అధికారులను మేనేజ్ చేసి యథేచ్చగా ఈ ఫ్లాట్లను విక్రయిస్తున్నట్టుగా తెలిసింది. ఇప్పటికే దుండిగల్‌లోని అర్బన్రైజ్ ప్రాజెక్టుకు కూడా ఇలాగే అనుమతులు ఇచ్చి ఆతర్వాత బయ్యర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టుగా వినికిడి. ఈ మధ్య రెరా అథారిటీలో పనిచేసే కొందరు అధికారులు ఫ్రీలాంచ్‌కు పాల్పడే వారికి నోటీసులు ఇచ్చి వారితో ములాఖత్ అయిన అనంతరం వారిని విడిచిపెడుతున్నారని, దీంతో వారు మళ్లీ ఈ దందాను కొనసాగిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
డెవలప్‌మెంట్ అగ్రిమెంట్, మార్టిగేజ్ ఎలా చేశారు..?
ఈ రెండు కీలకమైన అంశాల్ని పరిశీలించకుండా హెచ్‌ఎండిఏ బిల్డింగ్ అనుమతి ఎలా ఇచ్చిందన్నది అంతుచిక్కని ప్రశ్నగా మారింది. దీంతోపాటు స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ ఈ ఆస్తిని నిషేధిత జాబితాలో పెట్టినప్పటికీ, ఆ విషయాన్ని పట్టించుకోకుండా పటాన్‌చెరు, సంగారెడ్డి రిజిస్ట్రేషన్ కార్యాలయంలో డెవలప్‌మెంట్ అగ్రిమెంట్‌ను,మార్టిగేజ్ ఎలా రిజిస్ట్రర్ చేశారన్నది అంతుచిక్కని ప్రశ్నగా మారింది. దీనినే ఆసరాగా తీసుకుని సదరు బిల్డర్ రెరా అనుమతి తీసుకోక ముందు ప్రీలాంచ్ ఆఫర్లు అంటూ ఫ్లాట్లను విక్రయించారు. ఇలా ఫ్రీలాంచ్‌లో ప్లాట్లను విక్రయిస్తుండగా కొందరు ఈ సంస్థపై రెరాకు ఫిర్యాదు చేశారు. దీంతో రెరా అధికారులను మచ్చిక చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకొని ఈ ప్లాట్లను యథేచ్ఛగా ఆ సంస్థ ప్రజలకు విక్రయిస్తుండడం విశేషం.
పటాన్‌చెరు, సంగారెడ్డి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో….
అనుమతులు ఇచ్చిన హెచ్‌ఎండిఏ, రెరాలపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోర్టులో పెండింగ్ కేసులో ఉండడంతో ఆ భూమిపై స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ నిషేధిత ఆస్తిగా అధికారికంగా నమోదు కావడంతో ఆ స్థలంలో బహుళ అంతస్తుల భవనాన్ని నిర్మించుకునేందుకు హెచ్‌ఎండిఏ అనుమతిని మంజూరు చేసింది. ఈ అంశంలో పటాన్‌చెరు, సంగారెడ్డికి చెందిన సబ్ రిజిస్ట్రార్ అధికారులు కూడా నిబంధనలను తుంగలో తొక్కారు. ఆ తర్వాత ఎలాంటి కాగితాలు చూడకుండానే హెచ్‌ఎండిఏ అనుమతులు ఇస్తే దాని ఆధారంగా రెరా కూడా ఒకే చెప్పడంతో బిల్డర్ నుంచి అఫిడవిట్ తీసుకొని ఆ ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయడం గమనార్హం.