Sunday, September 29, 2024

హైదరాబాద్ లో సామాన్యులకు షాక్ ఇస్తున్న విద్యుత్-వాటర్ బోర్టులు

అకారణంగా డబ్బులు కట్టాలంటూ నోటీసులు

సాధారణంగా ప్రభుత్వాలు మారినప్పుడు పన్నులు, నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతాయనో, తగ్గుతాయనో అనుకుంటాం. ఇదిగో ఇలా బీఆర్ఎస్ అరాచక పాలన అంతమొందించి ప్రజా పాలన తీసుకువస్తామని ఎన్నికల సమయంలో చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పగ్గాలు చేపట్టాక ప్రజా పాలన సంగతేమో గాని ప్రజలను పీల్చి పిప్పి చేస్తుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకు తాజాగా మియాపూర్‌లోని ఓ అపార్ట్ మెంట్ విషయంలో విద్యుత్ శాఖ, హైదరాబాద్ మెట్రో వాటర్ బోర్డ్ వ్యవహరిస్తున్న‌ తీరే ఇందుకు దర్శనమని చెప్పవచ్చు.

మొన్నటి వరకు తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలో ఉండి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నంత వ‌ర‌కూ రాష్ట్ర వ్యాప్తంగా మంచినీరు ఉచితంగా వ‌చ్చేది. ఇదిగో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కదా త్రాగునీటిపై పన్ను మీద పన్ను విధిస్తున్నారు. ఇందుకు మియాపూర్‌లోని ప‌లు గేటెడ్ కమ్యునిటీ వ్యవహారాన్ని ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

గ‌త నెల‌లో వాట‌ర్ బోర్డు మియాపూర్‌లోని ప‌లు అపార్టుమెంట్ల‌కు బిల్లుల్ని పంపించింది. గ‌త మూడు నాలుగు నెల‌లు సాధారణం కంటే అదనంగా నీళ్లు వాడుకున్నందుకు గాను ఏకంగా 5 ల‌క్ష‌ల‌ రూపాయలకు పైగా ఫైన్ క‌ట్ట‌మ‌ని నోటీసు సర్వ్ చేసింది హైదరాబాద్ వాటర్ బోర్ట్. మ‌రో క‌మ్యూనిటీకి రెండున్న‌ర ల‌క్ష‌ల‌కు పైగా బిల్లు పంపించింది. దీంతో ఆ అపార్ట్ మెంట్ వాసులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. నిజంగానే ఆపార్ట్ మెంట్ వాసులు అధికంగా నీళ్లు వాడుకున్నట్ల‌యితే ఏ నెలాకానెల బిల్లు పంపించాలి. కాని నిన్నటి వరకు నీటి బిల్లులే వ‌సూలు చేయ‌కుండా.. ఇప్పుడు అకారణంగా హఠాత్తుగా ఎక్కువ నీళ్లు వాడుకున్నారని లక్షల బిల్లుల‌ను పంపించ‌డం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుండగా.. అపార్ట్ మెంట్ వాసులను మాత్రం షాక్ కు గురి చేసింది.

ప్రభుత్వ లీలలు ఇంతటితో ఆగలేదు. కూకట్ పల్లి ప‌రిధిలోని ఓ గేటెట్ కమ్యునిటీకి విద్యుత్ సరఫరా సంస్థ మరో షాక్ ఇచ్చింది. సదరు అపార్ట్ మెంట్ లోని ఒక బ్లాకులో ఫేజ్ మిస్ అయినందుకు మీట‌ర్ రీడింగ్ తక్కువగా విద్యుత్తు వినియోగం అయ్యింద‌న్న కారణం చెప్పి.. అందుకు గాను ఏకంగా యాభై వేల‌కు పైగా జ‌రిమానా క‌ట్టాల‌ని నోటీసుల్ని జారీ చేసింది. వారం రోజుల్లో కనీసం స‌గం సొమ్ము అయినా క‌ట్ట‌మ‌ని ఆర్డర్స్ పాస్ చేశారు. ప్రతి నెల విద్యుత్తు శాఖ వారు నమోదు చేసిన మేరకు బిల్లులు కడుతున్న ఆ అపార్టుమెంట్ వాసులు అదనంగా డబ్బులు కట్టాలని నోటీసులు పంపడంతో అవాక్కవ్వడంతో పాటు తీవ్ర ఆవేద‌న చెందుతున్నారు.

బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం కోల్పోయాక.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చాక‌.. ఈ వాట‌ర్ బోర్డు సంస్థ‌కు, విద్యుత్ సంస్థ‌కు ఏమైందో అర్థం కావడం లేదని ఆ ఆపార్ట్ మెంట్ వాసులే కాదు ఈ విషయం తెలిసిన వారంతా అయోమయంలో పడ్డారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఆదాయం పెంచుకోవ‌డానికి ఇలా అకారణంగా అపార్టుమెంట్ల మీద ప‌డ్డార‌ని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఒక్క కూకట్ పల్లి అపార్ట్ మెంట్ వాసులకే కాదు హైదరాబాద్ లో చాలా చోట్ల ఇలాగే కేవలం డబ్బులు వసూళ్లు చేయడానికి మాత్రమే అదనపు బిల్లుల పేరుతో వాటర్ బోర్టు, విద్యుత్ శాఖ నోటీసులు జారీ చేస్తోందన్న చర్చ జరుగుతోంది. మరి ప్రజా పాలన అంటే ఇలా జనాలను అకారణంగా ఇబ్బందులకు గురిచేసి డబ్బులు వసూలు చేయడమేనా అన్న ప్రశ్న సామాన్యుల నుంచి తలెత్తుతోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం కుట్రే... ఇందులో జ‌గ‌న్ పాత్ర ఉంది అన్న వర్ల రామయ్య వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular