హాస్టళ్లలో విద్యార్థినులకు అడుగడుగునా సమస్యలే ఎదురవుతున్నాయి. ఇప్పటికే హాస్టల్లోని వసతుల కోసం, కళాశాల గురువులు అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని ధర్నాలు చేస్తున్నారు. కొన్ని రోజుల క్రితం చదువు చెప్పాల్సిన గురువే తరగతి గదిలోని బాలికల పట్ల అసభ్యకరంగా ప్రవరిస్తూ వేధింపులకు గురి చేస్తున్నారని విద్యార్థినులు రోడ్డుపై కూర్చొని ధర్నా చేశారు. ఇంకో దగ్గర హాస్టల్లో వసతులు సరిగా లేవని ధర్నాకు దిగారు. తాజాగా మాజీ మంత్రి మల్లారెడ్డికి చెందిన సీఎంఆర్ ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థినులు రోడ్డెక్కారు. మేడ్చల్‌లోని కండ్లకోయ సీఎమ్మార్ ఐటీ మహిళా వసతి గృహంలోని బాత్రూంలో దృశ్యాలను చిత్రీకరించారని విద్యార్థినులు ధర్నాకు దిగారు. వారికి విద్యార్థి సంఘాలు బాసటగా నిలిచాయి. నిందితులపై చర్యలు తీసుకుంటామని కళాశాల యాజమాన్యం హమీ ఇచ్చేదాకా ఆందోళన విరమించేది లేదని బైఠాయించారు.
కొన్ని రోజులుగా కొంతమంది బాత్‌రూంలో విద్యార్థినుల వీడియోలు తీశారని యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారు. వెంటిలేటర్ నుంచి వీడియోలు తీశారని వార్డెన్‌కు తెలిపితే, విద్యార్థినులనే చులకన చేసి అసభ్యంగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ధర్నా చేపట్టినా ఎలాంటి భరోసా ఇవ్వలేదని పేర్కొంటూ విద్యార్థినులు ఆందోళన కొనసాగించారు. విద్యార్థి సంఘాల నేతలను లోనికి అనుమతించకపోవడంతో గేటు బయటే ధర్నా చేపట్టారు.
విద్యార్థి సంఘాల నాయకుల మద్దతు
సెక్యూరిటీ గది అద్దాలు ధ్వంసం చేశారు. పోలీసులు వసతి గృహం నిర్వాహకులతో మాట్లాడి అందులో పని చేసే సిబ్బందికి చెందిన 12 మొబైల్ ఫోన్లు, ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వస్తే ఎమ్మెల్యే మల్లారెడ్డి బాధ్యత వహించాలని విద్యార్థి సంఘాల నాయకులు హెచ్చరించారు. విద్యార్థినుల రక్షణ కోసం ప్రత్యేక గస్తీ ఏర్పాటు చేయాలని తెలిపారు.