హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల నుంచి సుమారు 26 మంది కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తే.. అందులో ఒకే ఒక వ్యక్తి తన సత్తా చాటి చెప్పాడు. ఉత్కంఠభరితంగా సాగిన పోరులో విజయం సాధించారు.అధికార కాంగ్రెస్ పార్టీలో ఈ మూడు జిల్లాల నుంచి ఆ ఒక్క వ్యక్తే ఎమ్మెల్యేగా గెలిచాడు. అయినప్పటికీ, ఆయనకి ఎందుకు మంత్రి పదవినివ్వలేదు? ఈ మూడు జిల్లాలకు చెంది ప్రజల్లో నెలకొన్న సందేహమిది! ఆయన గెలుపు ఒక గెలుపు కాదని కాంగ్రెస్ భావిస్తుందా? లేక మరే ఇతర కారణమేమైనా ఉందా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
ఖమ్మం కాంగ్రెస్‌లో తొమ్మిది మంది గెలిస్తే ముగ్గురికి మంత్రి పదవులిచ్చారు. నల్గొండ జిల్లాకు చెందినవారిలో ఇద్దరికిచ్చారు. అంతెందుకు వరంగల్‌లోనూ ఇద్దరికి అవకాశమిచ్చారు. మరి, మూడు జిల్లాల నుంచి పోటీ చేసినవారిలో మధుయాష్కీ, అజహరుద్దీన్ వంటి వారూ ఓటమిపాలయ్యారు. అయినప్పటికీ ఇబ్రహీంపట్నం నుంచి గెలిచిన మల్‌రెడ్డి రంగారెడ్డికి మంత్రి పదవిని ఇవ్వకపోవడం ఎంతో దారుణమైన విషయమని ప్రజలు భావిస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్‌కు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదనపిస్తుంది. ఏదీఏమైనా, రేవంత్ రెడ్డి ఈ పొరపాటును గుర్తించి మల్‌రెడ్డికి మంత్రి పదవినిస్తారని ఆశిద్దాం.