* ఆ శాఖలో అవినీతికి అడ్డుకట్ట వేస్తున్న ప్రిన్సిపాల్ సెక్రటరీ
* టిఎస్‌ఎండిసిలో డిప్యూటేషన్‌పై పనిచేయడానికి పలు శాఖల ఉద్యోగుల ఉత్సాహం
* త్వరలో ఈ శాఖలో మరిన్ని సంస్కరణలు తీసుకొచ్చేలా ప్రణాళికలు
ఇప్పటికే ప్రభుత్వం అక్రమ ఇసుకదందాపై దృష్టి సారించగా కొందరు ఉద్యోగుల అవినీతిపై విచారణ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం మైన్స్ అండ్ జియాలజీ, పరిశ్రమల శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ ఉన్న ఐఏఎస్ అధికారి బెనహర్ మహేశ్ దత్ ఎక్కాకు (టిఎస్‌ఎండిసి ఎండిగా ఇన్‌చార్జీగా బాధ్యతలను) ప్రభుత్వం అప్పగించడంతో ఆయన ఈ సంస్థలోని లోపాలను, అవినీతిని అరికట్టడంలో తనవంతు పాత్రను పోషిస్తున్నారు. ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులపై కొరడా ఝుళిపించాలని ఆయన నిర్ణయించారు. దీంతోపాటు ఇసుకరీచ్‌ల వద్ద జరిగే అక్రమాలకు చెక్ పెట్టేలా ఆయన పలు విధానాలకు ఆయన శ్రీకారం చుట్టారు.
బిల్డర్లకు, లారీ యజమానులకు మేలు చేసేలా….
టిఎస్‌ఎండిసి (తెలంగాణ మినరల్ డెవలప్‌మెంట్)లో డిప్యూటేషన్‌పై పనిచేయడానికి వివిధ శాఖల అధికారులు ఉత్సాహం చూపుతున్నారు. ఇప్పటికే ఈ శాఖలో వివిధ శాఖల నుంచి వచ్చిన వారే ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ రెండు చేతుల సంపాదిస్తున్నారు. రోజుకు లక్షల్లో వీరి ఆదాయం ఉండడంతో చాలామంది వివిధ శాఖల అధికారులు ఈ శాఖలో తిష్టవేయడానికి ఫైరవీలను ప్రారంభించారు. మార్కెటింగ్ శాఖకు చెందిన చాలామంది ఉద్యోగులు ఈ శాఖలో పాగా వేయగా వేరే శాఖల ఉద్యోగులు సైతం తమవంతు ప్రయత్నాలను ప్రారంభించడం విశేషం. గత ప్రభుత్వ హయాంలో ఈ శాఖలో డిప్యూటేషన్ వచ్చిన వారే ప్రస్తుతం చక్రం తిప్పుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. లారీ యజమానులు, రియల్‌సంస్థల బిల్డర్‌లతో కుమ్మక్కై అక్రమంగా ఇసుకదంగా కొనసాగించడంతో పాటు ఇసుక డిమాండ్‌కు అనుగుణంగా మధ్యవర్తులను ఏర్పాటు చేసుకొని బిల్డర్‌లకు, లారీ యజమానులకు మేలు చేసేలా ప్రస్తుతం ఈ దందా కొనసాగుతున్నట్టుగా విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో చాలామందిని మార్చాలని ప్రభుత్వం భావిస్తున్నా డిప్యూటేషన్‌పై వచ్చిన ఉద్యోగులు, అధికారులు మాత్రం తమ మాతృ సంస్థకు వెళ్లేందుకు ఒప్పుకోవడం లేదని, ఇక్కడే మరికొంతకాలం ఉండేలా మంత్రులను కలుస్తూ వారితో ఫైరవీలు చేసుకుంటున్నట్టుగా విమర్శలు వినిపిస్తున్నాయి.
ఉమ్మడి జిల్లాలోనే దొంగ వే బిల్లులు
అయితే ఇసుక రీచ్‌ల టెండర్‌లలోనూ గత పది సంవత్సరాలుగా చాలామంది ఈ సంస్థలో పనిచేసే అధికారులు, ఉద్యోగులు కోట్లలో సంపాదించారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. టెండర్‌లలోనూ చాలా అవినీతి జరగడంతో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని వారు కొల్లగొట్టారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే టిఎస్‌ఎండిసిలో డిప్యూటేషన్‌పై వచ్చిన అధికారుల ఆస్తుల చిట్టాపై ప్రస్తుతం పెద్ద చర్చ నడుస్తోంది. దీంతోపాటు కొన్ని జిల్లాలో దొంగ వే బిల్లులను సృష్టించి ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టిన విషయం కూడా ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో అలా జరగకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని ప్రభుత్వం టిఎస్‌ఎండిసి ఎండిని ఆదేశించింది. ఉమ్మడి వరంగల్, కరీంనగర్, నల్లగొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్ జిల్లాలో ఈ దొంగ వే బిల్లుల దందా ఎక్కువగా జరగడంతో ఇక్కడి ఇసుక రీచ్‌లపై ప్రభుత్వం దృష్టి సారించింది.