కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ నగరంలోకి అడుగుపెట్టిన వెంటనే కార్యచరణలోకి దిగాడు. అసెంబ్లీకి పోటీ చేసిన అభ్యర్థులందర్ని హుటాహుటీన హైదరాబాద్ రప్పిస్తున్నారు. ఎందుకంటే, రేపు కౌంటింగ్ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ అభ్యర్థుల్ని ప్రలోభాలకు గురి చేసే అవకాశముందని గ్రహించి ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. ఈసారి కాంగ్రెస్ పార్టీ ఎలాంటి పొరపాట్లు చేయకుండా జాగ్రత్తగా వ్యవహరించడానికి ఏఐసీసీ డీకే శివకుమార్‌ను నియమించిన విషయం తెలిసిందే. అందుకే, ఈసారి కేసీఆర్‌కు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా అన్ని దారుల్ని మూసివేసి.. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అడుగులు ముందుకేస్తున్నారు. మరోవైపు ప్రజాస్వామ్యబద్ధంగా ఒక పార్టీ నుంచి ఎన్నకైన ఎమ్మెల్యేలను డబ్బు మరియు ఇతర ప్రలోభాలకు లొంగకుండా ఏం చేద్దాం అంటూ జర్నలిస్టు ఫోరం నాయకులైన సతీష్ కమాల్, అమర్ తదితరులు మేధావులు, జర్నలిస్టులతో సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. పార్టీ మారాలనే నాయకుల ఇంటి వద్ద ధర్నాలు, ఇతర మార్గాల ద్వారా కట్టడి చేసి ప్రజాస్వామ్యం అభాసుపాలు కాకుండా ఉండాలని చర్చించినట్లు తెలిసింది.