ప్రభుత్వ ఉత్తర్వుల వెబ్‌సైట్‌నే బ్లాక్ చేసినందుకు తెలంగాణ ప్రభుత్వంపై దాసోజు శ్రవణ్ గతంలో 2019లో హైకోర్టులో కేసు వేశారని.. ఇప్పుడు ఆయన గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా అధికార పార్టీ నామినేట్ చేశారని.. మరి, దుర్భరమైన మీ సమాచార హక్కు పనితీరుపై మిమ్మల్ని ప్రశ్నించిన వారికి ఆదాయ హక్కు (రైట్ టు ఇన్ కం) ను తెలంగాణ ప్రభుత్వం కల్పించిందా అని సామాజికవేత్త డాక్టర్ లుబ్నా సర్వత్ ప్రశ్నించారు. తెలంగాణ అసెంబ్లీలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. రైట్ టు ఇన్ఫర్మేషన్ కాస్త రైట్ టు ఇన్‌కంగా మారిందని చేసిన వ్యాఖ్యలపై ఆమె మండిపడ్డారు. దీనికి ఆమె ప్రతిస్పందనగా మాట్లాడుతూ.. జీవోలను ప్రభుత్వ వెబ్‌సైటులో ఉంచకపోవడం ఎంతవరకూ కరెక్టు అంటూ నిలదీశారు. హైకోర్టులో కోర్టు ఆదేశాలు 24 గంటల్లోనే వారి వెబ్‌సైటులో అప్ లోడ్ చేస్తున్నప్పుడు.. తెలంగాణ ప్రభుత్వ శాఖలు జీవోలను ఎందుకు అప్‌లోడ్ చేయడం లేదని సాక్షాత్తు హై కోర్టు ప్రశ్నించిన మాట వాస్తవం కాదా? అంటూ ప్రశ్నించారు.
* 2022 ఏప్రిల్ 12న ట్రిపుల్ వన్ జీవోలని 3 పేరాని తొలగించిన 69వ జీవో కూడా ప్రభుత్వ వెబ్‌సైటులో అందుబాటులో లేదు.. ఇదే విధంగా ప్రతి సంవత్సరం సర్వసాధారణమైన వందలాది జీవోలు లేనే లేవు. ఇది కోర్టుకు వ్యతిరేకం కదా? నిబంధనలకు విరుద్ధంగా పని చేస్తున్నట్లు కాదా? నిబంధనల్ని అనుసరించాల్సిన ప్రభుత్వం సరైన మార్గం చూపని తరుణంలో ప్రజలు నియమాల్ని పాటించాలని ఎలా ఆశిస్తారని ఆమె మంత్రి కేటీఆర్‌ను సూటిగా ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన సమాచార కమిషనర్ లేకుండా మరియు రాష్ట్ర సమాచార కమిషనర్లు లేకుండా సమాచార కమిషన్ నిస్తేజంగా ఉందనే అంశం నిజం కాదా? ఇతర రాష్ట్రాల్లోసమాచార హక్కు కమిషనర్లు ఉండగా.. తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు నియమించలేదని ప్రశ్నించారు.