- ఖైరతాబాద్ రవాణా కార్యాలయంలో వేసిన వేలానికి
- ఒక్కరోజే సుమారు రూ. 44 లక్షల ఆదాయం
రాష్ట్రంలో వాహనాల రిజిస్ట్రేషన్ టిఎస్ నుంచి టిజికి మార్చే ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో ఫ్యాన్సీ నెంబర్‌లకు డిమాండ్ పెరుగుతోంది. సోమవారం ఒక్కరోజే ఫ్యాన్సీ నెంబర్లకు ఖైరతాబాద్ రవాణా కార్యాలయంలో సుమారు రూ. 44 లక్షలు వచ్చిందని అధికారులు తెలిపారు. అందులో టిజి 09 9999 నంబర్‌కు రూ.25 లక్షలకు పైగా వచ్చిందని అధికారులు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో ఫ్యాన్సీ నంబర్ల కోసం రవాణా శాఖ అధికారులు సోమవారం వేలం ప్రారంభించారు. దీంతో వాహనదారులు అధిక మొత్తంలో వాటిని పాడుకున్నారు. ఖైరతాబాద్‌లోని ఆర్టీఏ ప్రధాన కార్యాలయంలోని జరిగిన కార్యక్రమంలో ఒక్కరోజే ఏకంగా సూమారు రూ.44 లక్షల ఆదాయం సమకూరింది.
ప్యాన్సీ నంబర్‌కు వచ్చిన ధరల వివరాలు ఇలా…
ఈ నెంబర్‌కు టిజి 09 9999 రూ.25,50,002 పలకగా, టిజి 09 ఏ 0006కు, రూ.2,76,000 లక్షలు పలికింది. టిజి 09 ఏ 0005కు రూ.1,80,200లు, టిజి 09 ఏ 0019కు రూ.1,20,019లు, టిజి 09 9799కు రూ.1,16,111లు, టిజి 09 ఏ 0009కు రూ.1,10,009ల ధర పలికింది.
ఆదిలాబాద్‌కు టిజి 01
ఈ ఫ్యాన్సీ నంబర్లతో పాటు ఇతర నంబర్లకు వేలం ద్వారా మొత్తం రూ.43,70,284లు ఆదాయం వచ్చిందని రవాణా శాఖ అధికారి రమేష్ తెలిపారు. కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నా వారికి టిజి నంబర్ ప్లేట్ లభిస్తోందని పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాకి కోడ్‌ను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. టిజి 01 ఆదిలాబాద్‌కు ఇవ్వగా, టిజి 38ను నారాయణ పేట జిల్లాకు కేటాయించింది.
పోలీసు శాఖ వాహనాలకు 09 పితో మొదలవుతాయని తెలిపింది. జిల్లాల కోడ్ల తర్వాత రవాణా వెహికల్స్, ఆర్టీసి బస్సుల సిరీస్ నిర్దేశిత అక్షరాలతో ప్రారంభమవుతుందని రవాణా శాఖ వెల్లడించింది. ఆర్టీసి బస్సులకు ఎప్పటిలాగే ‘జెడ్’ సిరీస్‌తో ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు. ట్రాన్స్‌ఫోర్ట్ వాహనాలకు టి, యూ, వి, డబ్ల్యూ, ఎక్స్, వై సిరీస్ ఉంటాయని రవాణా శాఖ పేర్కొంది.