- అగ్రనేత లచ్చన్నతో పాటు ఆరుగురు మావోయిస్టులు మృతి
- భారీగా ఆయుదాలు స్వాధీనం…మృతదేహాలు స్వాధీనం
- ఉలిక్కిపడ్డ పినపాక ఏజెన్సీ ప్రజలు
- సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ రోహిత్ రాజు
భదాద్రి కొత్తగూడెం జిల్లాలోని పినపాక నియోజకవర్గ పరిధిలోని కరకగూడెం ఏజెన్సీ మరోసారి తుపాకీ కాల్పుల మోతతో దద్దరిల్లింది. గత కొంతకాలంగా ప్రశాంతంగా ఉన్న కరకగూడెం ప్రాంతంలో మావోయిస్టుల సంచారం ఉందన్న సమాచారం మేరకు భదాద్రి కొత్తగూడెం పోలీసు బలగాలు గురువారం ఉదయం 06.45 నిమిషాల ప్రాంతంలో కరకగూడెం మండలంలోని మోతే గ్రామం అటవీప్రాంతంలో పెట్రోలింగ్ చేస్తుండగా, పోలీసు బలగాలకు, నిషేధిత సిపిఐ మావోయిస్టులకు ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఎదురు కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టుల మృతదేహాలను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.
ఈ ఎన్‌కౌంటర్‌లో భదాద్రి కొత్తగూడెం జిల్లాలోని అల్లూరి సీతారామరాజు డివిజన్ కమిటీకి చెందిన ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. మృతి చెందిన వారిలో లచ్చన్న దళానికి చెందిన కుంజా వీరయ్య అలియాస్ లచ్చన్న, పూనెం తులసి, కొవ్వాసి రాము, పోడియం సక్కురాం, దుర్గేష్, కోసి వెన్నెలలు ఉన్నట్లు సమాచారం. మృతుల్లో నలుగురు పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నారు. ఘటనా స్థలంలో పోలీసులకు ఏకే47 ఆయుధాలు 2, ఎస్ ఎల్ ఆర్ ఆయుధం 1, 303రైఫిల్ 1, ఫిస్టల్ 1 మరియు దాని మ్యాగ్జిన్‌తో పాటు లైవ్ రౌండ్లు, కిట్ బ్యాగులు, ఇతర సామాగ్రిని స్వాదీనపరుచుకున్నట్లు జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ తెలిపారు. ఘటనా స్థలాన్ని జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ పరిశీలించారు. ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన వారి కుటుంబాలకు సమాచారం అందించిన తర్వాత వారి నుంచి వివరాలు తెలుసుకుని మృతుల వివరాలు తెలియజేస్తామని తెలిపారు.
ఎన్‌కౌంటర్ నుండి తప్పించుకున్న మరో అగ్రనేత యాసయ్య … ?
కరకగూడెం అటవీ ప్రాంతంలో గురువారం జరిగిన ఎదురు కాల్పుల్లో మృతి చెందిన ఆరుగురు మావోయిస్టులలో అగ్రనేతగా ఉన్న లచ్చన్న మృతి చెందారు. కాగా వీరితో పాటు ఉన్న మరో అగ్రనేత యాసయ్య తప్పించుకున్నట్లు తెలుస్తుంది. యాసయ్య కోసం పోలీసు బలగాలు అటవీ ప్రాంతాన్ని జల్లెడపడుతున్నాయి. యాసయ్య లొంగిపోవాలని కూడా కోరుతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటి వరకు యాసయ్య నీలాద్రిపేట అటవీ ప్రాంతంలో తలదాచుకుంటునట్లు, ఇతనిపై పోలీసు బలగాలు ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తుంది.