Monday, July 8, 2024

ఒక పోస్టు కోసం ఇద్దరు పోటీ ..!

  • హెచ్‌ఎండిఏలో సీఈ పోస్టు కోసం భారీగా ఫైరవీలు…?
  • ఇంజనీరింగ్ విభాగంపై భారీగా ఆరోపణలు…

ఒక పోస్టు కోసం ఇద్దరు పోటీ పడుతున్నారు. హెచ్‌ఎండిఏలో సీఈ పోస్టు కోసం భారీగా ఫైరవీలు జరుగుతున్నాయి. ప్రస్తుతం హెచ్‌ఎండిఏలో ఇన్‌చార్జీ సీఈగా ఉన్న ఒక అధికారి ఈ పోస్టు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టుగా తెలిసింది. గతంలో సీఈగా పనిచేసిన ఓ అధికారి కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే స్వచ్ఛందంగా ఆ పదవి నుంచి తప్పుకోవడంతో ఆయన స్థానంలో ప్రస్తుత ఇన్‌చార్జీ సీఈగా ఒక అధికారికి బాధ్యతలను అప్పగించారు. ఈ ఇన్‌చార్జీ సీఈ పోస్టు కోసం ఆ అధికారి భారీగా ఫైరవీలు చేసినట్టు హెచ్‌ఎండిఏ ఉద్యోగులు పేర్కొంటున్నారు.

ప్రస్తుతం పూర్తిస్థాయి సీఈ పోస్టు కోసం ఆ అధికారి ప్రస్తుతం పావులు కదుపుతున్నట్టుగా తెలిసింది. దాదాపు 20 ఏళ్లుగా హెచ్‌ఎండిఏలో వివిధ బాధ్యతలు నిర్వహించిన ఈ అధికారిపై ప్రస్తుతం భారీగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. హెచ్‌ఎండిఏ తరపున చేసిన పలు అభివృద్ధి పనులకు సంబంధించి కాంట్రాక్ట్‌ల్లో తనకు సంబంధించిన వారికే ఇప్పించుకుంటారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అందులో భాగంగా హెచ్‌ఎండిఏ చేపట్టే ప్రతి అభివృద్ధి పనుల్లో తన మనుషులే ఉంటారని హెచ్‌ఎండిఏ ఉద్యోగులు పేర్కొంటున్నారు. కొన్ని పార్కుల అభివృద్ధిలోనూ ఆ అధికారిపై అవినీతి ఆరోపణలు రావడం విశేషం. ఇలా ఇంజనీరింగ్ విభాగంలో ఆ అధికారి చెప్పిందే వేదమని ఆ అధికారి హెచ్‌ఎండిఏను శాసిస్తుందని పలువురు ఉద్యోగులు పేర్కొంటున్నారు.

సీనియార్టీ జాబితాలో హెచ్‌జిసిఎల్‌లో పనిచేసే అధికారికే మొదటి
ప్రస్తుతం హెచ్‌ఎండిఏ సీఈ పోస్టు కోసం ప్రస్తుత ఇన్‌చార్జీగా అధికారితో పాటు హెచ్‌జిసిఎల్‌లో సిజిఎంగా పనిచేస్తున్న మరో సీనియర్ అధికారి పోటీపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ పోస్టు తనకే దక్కేలా ప్రస్తుతం హెచ్‌ఎండిఏలో ఇన్‌చార్జీ సీఈగా పనిచేస్తున్న అధికారి పావులు కదుపుతున్నట్టుగా తెలిసింది. అందులో భాగంగా హెచ్‌జిసిఎల్‌లో మరో సీఈ పోస్టు ఖాళీగా ఉందని, ఈ రెండు పోస్టులకు కలిపి డిపిసి నిర్వహించాలని ప్రస్తుత ఇన్‌చార్జీ సీఈ ఉన్నతాధికారుల వద్ద ప్రస్తావించినట్టుగా తెలిసింది. దీంతో ఉన్నతాధికారులు ఈ రెండు పోస్టుల గురించి ఆరా తీయగా హెచ్‌ఎండిఏలో ఉన్న ఒక్క సీఈ పోస్టు మాత్రమే ఖాళీగా ఉందని, హెచ్‌జిసిఎల్‌లో ఉన్న పోస్టుకు 2006 సంవత్సరంలో (ఆ ఒక్క సంవత్సరానికి) అప్పటి అవసరం నిమిత్తం అప్పటి ప్రభుత్వం జిఓ ఇచ్చిందని తేలింది.

దీంతోపాటు ఈ పోస్టులో ఆర్ అండ్ బి నుంచి డిప్యూటేషన్ తీసుకోవాలని ఆ జిఓలో ఉన్నట్టుగా తేలింది. ఈ నేపథ్యంలోనే హెచ్‌ఎండిఏ ఉన్నతాధికారులు ప్రస్తుతం హెచ్‌ఎండిఏలో ఖాళీగా ఉన్న సీఈ పోస్టును మాత్రమే భర్తీ చేయాలని నిర్ణయించినట్టుగా తెలిసింది. దీనికోసం త్వరలోనే డిపిసిని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టుగా తెలిసింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఇన్‌చార్జీ సీఈగా ఉన్న అధికారి సీనియార్టీలో రెండోస్థానంలో ఉండడం, మొదటిస్థానంలో హెచ్‌జిసిఎల్ సిజిఎంగా పనిచేస్తున్న ఎస్‌ఈ మొదటిస్థానంలో ఉండడంతో ఆయనకే హెచ్‌ఎండిఏ సీఈ పదవి దక్కే అవకాశాలున్నాయని హెచ్‌ఎండిఏ ఉద్యోగులు పేర్కొంటున్నారు. అయితే ఈ అధికారి తనకు ఈ పదవి దక్కుతుందో లేదో అన్న అనుమానంతో భారీ ఎత్తున ఫైరవీలు చేస్తున్నట్టుగా తెలిసింది. ఇప్పటికే హెచ్‌ఎండిఏకు సంబంధించి ఇంజనీరింగ్ సిబ్బంది, అధికారులపై పలువురు ప్రభుత్వానికి ఫిర్యాదులు చేస్తున్న నేపథ్యంలో అసలు సీఈ పదవి ఈ అధికారికి వస్తుందా లేదా అన్నది త్వరలోనే తేలనుందని ఉద్యోగులు పేర్కొంటున్నారు. దీంతోపాటు హెచ్‌ఎండిఏలోని ఇంజనీరింగ్ విభాగంపై భారీగా ఆరోపణలు వస్తుండడంతో ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు చేపడుతారో వేచి చూడాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రస్తుత పరిస్థితుల్లో జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీ లో అడుగు పెట్టె సాహసం చేస్తాడా?
- Advertisment -

Most Popular