Saturday, April 19, 2025

మహోగ్రనదులు

జలాశయాలకు పోటెత్తుతోన్న వరదలు
భారీగా వచ్చి చేరుతోన్న నీరు
121 ఏండ్ల రికార్డు బ్రేక్ చేసిన క‌ృష్ణమ్మ
ఉగ్రరూపం దాల్చి ప్రవాహం
ఆందోళన పెంచుతోన్న గోదారి వరదలు
నీటమునిగిన సమ్మక్క ఆలయం
ఇరిగేషన్ అధికారులు అప్రమత్తం
ముంపు ప్రాంతాల్లో పహారా

వాయుగుండం ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురవడంతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. గోదావరి, కృష్ణా పరివాహకంలోని ప్రాజెక్టులు అన్నీ నిండుకుండను తలపిస్తున్నాయి. ఎస్​ఆర్​ఎస్పీ పూర్తిగా నిండటంతో ఉత్తర తెలంగాణ రైతుల్లో సంతోషం వ్యక్తం అవుతోంది. నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద ఉద్ధృతి కొనసాగుతోంది. ప్రాజెక్టు నుంచి 40 గేట్ల ద్వారా లక్షన్నర క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి దాదాపు రెండు లక్షల క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టులో 1088.8 అడుగుల వరద నీరు ఉంది. భారీ వర్షాల కారణంగా గోదావరి తీరం వైపు, ప్రాజెక్టు వైపు ప్రజలు ఎవరు రావద్దని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. నిర్మల్ జిల్లా కడెం జలాశయానికి వరద ఉద్ధృతి పెరిగింది.

ఆదివారం అర్ధరాత్రి 12 గంటల తర్వాత లక్షకు పైగా క్యూసెక్కుల వరద నీరు వస్తుండటంతో ఆ మేర దిగువకు నీటిని విడుదల చేశారు. భైంసాలోని గడ్డెన్నవాగు ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. మూడు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కుబీర్​లో విటలేశ్వరుని ఆలయంలో భారీగా వర్షపు నీరు వచ్చి చేరుతోంది. కడెం, గడ్డెన్న వాగు నుంచి వరద రావడంతో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు జలకళను సంతరించుకుంది. ప్రాజెక్టు సామర్థ్యం 20 టీఎంసీలు కాగా 18 టీఎంసీలకు నీటిమట్టం చేరింది. నాగార్జున సాగర్ జలాశయానికి భారీగా వరద చేరుతుండటంతో 26 క్రస్ట్ గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం నుంచి 5 లక్షల క్యూసెక్కులకుపైగా నీరు వస్తుండగా గేట్లను ఎత్తి స్పిల్ వే ద్వారా 5 లక్షల పైచిలుకు క్యూసెక్కుల వరద దిగువకు వదులుతున్నారు.

కృష్ణమ్మ ఉగ్రరూపం..
కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులకు ఈ ఏడాది పూర్తి జలకళ వచ్చింది. తాజా వర్షాలతో వరద మరింతగా పెరిగింది. ఆల్మట్టి, నారాయణపూర్, ఉజ్జయిని జలశయాలు నిండడంతో జూరాలకు మూడు లక్షల క్యూసెక్కులకు పైగా వరద వస్తోంది. దాదాపుగా అంతే మొత్తాన్ని దిగువకు వదులుతున్నారు. తుంగభద్ర ప్రాజెక్టు కూడా పూర్తి సామర్థ్యానికి దగ్గర పడుతుండడంతో అక్కడి నుంచి ఔట్ ఫ్లో కొనసాగుతోంది. దీంతో రాష్ట్రంలో కృష్ణానది ఉగ్రరూపం దాల్చింది. ఆ నదిపై ఉన్న ప్రాజెక్టుల్లో వరద నీరు భారీగా వచ్చి చేరుతుండడంతో అధికారులు నీటిని దిగువ ప్రాంతాలకు విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్ జలాశయం మొత్తం నీటిమట్టం 590 అడుగులు ఉండగా ప్రస్తుతం 587.10 అడుగులుగా ఉంది. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో ప్రాజెక్టులకు వరద కొనసాగుతుంది. ఆదివారం కురిసిన వర్షానికి శంకర సముద్రం, సరళ సాగర్ రామన్‌పాడు, కోయిల్ సాగర్ జలాశయాలకు ఎగువ ప్రాంతాల నుంచి భారీ ఎత్తున వరద నీరు పోటెత్తడంతో రెండో రోజు కూడా ప్రాజెక్టు నుంచి నీటి విడుదల కొనసాగింది. దేవరకద్ర మండలం కోయిల్‌ సాగర్ జలాశయం నుంచి నాలుగు గేట్ల ద్వారా 12 వేల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు.ప్రాజెక్టులను సందర్శించేందుకు పర్యాటకులు ఆసక్తి చూపడంతో ఆయా ప్రాజెక్టుల వద్ద సందడి నెలకొంది.

ఎగువ నుంచి భారీగా వరద ప్రవాహం రావడంతో పులిచింతల జలాశయానికి 5 లక్షల 40 వేలకుపైనే క్యూసెక్కుల వరద వస్తుండగా అంతే మొత్తం నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇక ప్రకాశం బ్యారేజీకి 11 లక్షల 40 వేల క్యూసెక్కులకు మించి వరద వస్తుండగా మొత్తం 70 గేట్లు ఎత్తి అంతే మొత్తం నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణానది ప్రమాదకరంగా ఉరకలు వేస్తుండగా బ్యారేజీ పైనుంచి రాకపోకలను నిలిపేశారు. ఇదీలావుంటే.. 121 ఏళ్లలో ఈ స్థాయిలో వరదలు కృష్ణా నదిలో రాలేదని అధికారులు చెబుతున్నారు. 11,33,076 క్యూసెక్కుల వరద నీరు ఈ సారి కృష్ణా నదికి వచ్చి చేరిందని అధికారులు వివరించారు. 1903లో 10 లక్షల 80 వేల క్యూసెక్కుల వరద నమోదు కాగా, 2009 అక్టోబర్ లో వచ్చిన వరదలప్పుడు 11.10 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చింది.

ఈ సారి అదనంగా 23 వేల క్యూసెక్కుల వరద నీరు ప్రవహిస్తుండడంతో 121 ఏళ్లలో అత్యధిక రికార్డును బ్రేక్ చేసినట్టయింది. 2009లో వచ్చిన వరదల వల్ల ఏపీలోని కర్నూలు, గుంటూరు, కృష్ణ, తెలంగాణాలోని మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలు వరద బీభత్సం సృష్టించింది. అప్పుడు కర్నూలు నగరంలో మూడు రోజుల పాటు 3 మీటర్ల మేర వరద నీరు నిలిచిపోయింది. అప్పుడు నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఎగువ ప్రాంతం మీదుగా వరద నీరు పోటెత్తగా ఈ సారి దిగువ ప్రాంతం నుండి ఎక్కువగా వరద నీరు వచ్చింది. దీంతో తెలంగాణలోని నల్గొండ హైవే, ఏపీలోని నందిగామ రహదారులు నీట మునిగిపోయాయి. కృష్ణ నది వరద ఉధృతి కారణంగా మున్నేరు, బుడమేరు నదుల నుండి వెల్తున్న నీరు ఒత్తిడికి గురవుతోంది. దీంతో కృష్ణా నదిలో కలవాల్సిన ఈ రెండు నదుల నీరు అంతా వెనక్కి వచ్చి సమీప ప్రాంతాలను ముంచెత్తుతున్నాయి.

కడెం ఉగ్రరూపం..
నిర్మల్ జిల్లా కడెం జలాశయంలో వరద నీరు భారీగా వచ్చి చేరుతున్న‌ది. కడెం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 700అడుగులు కాగా ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో జలాశయంలో ఒక లక్ష 31వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వరద నీరు వచ్చి చేరింది.. దీంతో ప్రాజెక్ట్ నీటిమట్టం 700 అడుగులకు దాటింది.. దీంతో నీటిపారుదల శాఖ అధికారులు అప్రమత్తమై సోమవారం తెల్లవారుజాము న ప్రాజెక్టుకు చెందిన 18 వరద గేట్ లు ఎత్తివేసి రెండు లక్షల 19 వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదిలారు. సోమవారం సాయంత్రం వరకు కడం ప్రాజెక్ట్ జలాశయంలో 51వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వరద నీరు వచ్చి చేరుతుందని ప్రాజెక్ట్ నీటిమట్టం 691.500 అడుగులకు ఉందని కడెం ప్రాజెక్టు ఈ ఈ రాథోడ్ విట్టల్ పేర్కొన్నారు.

కాగా నేటి ఉద‌యం కడెం జలాశయంలో ఇన్ ఫ్లో వరద నీరు రావడం కొద్ది మేర తగ్గడంతో ఎత్తిన 18 వరద గేట్లలో 8 వరద గేట్లు మూసివేసి మరో 10 గేట్ల వరదగేట్ల ద్వారా 84 వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల కావడం జరుగుతుందన్నారు . ప్రాజెక్టు పరిహవాక గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు రైతులు అప్రమత్తంగా ఉండాలని రాథోడ్ విట్టల్ కోరారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. ఎస్సారెస్పీ ప్రాజెక్టుకు వరద నీరు భారీగా వచ్చి చేరుతుండటంతో అధికారులు ప్రాజెక్టు 40 గేట్లు ఎత్తి వరద నీటిని దిగువకు వదులుతున్నారు. ఎగువన మహారాష్ట్ర నుంచి భారీగా వరద ప్రవాహం వస్తుండటంతో ఆందోళన నెలకొంది. నిజామాబాద్, నిర్మల్ జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలకు ఇప్పటికే భారీగా వరద ప్రవాహం వచ్చి చేరుతోంది.

అలాగే.. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలం అంబట్‌పల్లి గ్రామంలో ఉన్న మేడిగడ్డ బరాజ్‌కు వరద భారీగా పెరుగుతున్నది. ఎగువన ఉన్న మహారాష్ట్రతో పాటు స్థానికంగా కురుస్తున్న వర్షాల కారణంతో ప్రాణహిత, గోదావరి నదులు పొంగుతుం డడంతో సోమవారం బరాజ్‌ వద్ద ఇన్‌ఫ్లో 6,79,900 క్యూసెక్కులకు చేరుకోగా మొత్తం 85 గేట్లు ఎత్తి అంతే మొత్తంలో నీటిని దిగువకు వదులుతున్నారు.అలాగే బరాజ్‌కు మానేరు, ఇతర చిన్న కాల్వల ద్వారా 6,42,237 క్యూసెక్కుల వరద వస్తుండగా, మొత్తం 66 గేట్లు ఎత్తి అంతే మొత్తంలో నీటిని దిగువకు వదులుతున్నారు.

కాగా, కాళేశ్వరం వద్ద గోదావరి ఉధృతి భారీగా పెరిగింది. ఉదయం మూడు లక్షల క్యూసెక్కుల వరద ఉండగా,సాయంత్రానికి అది 7 లక్షలకు చేరుకుంది. గోదావరి గంట గంటకు పెరుగుతుండడంతో అధికారులు అక్కడే ఉంటూ గస్తీ కాస్తున్నారు. మరోవైపు.. ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తిగా నిండగా గేట్లు ఎత్తివేయడంతో నీటి ప్రవాహం భారీగా గోదావరి నదిలో చేరింది. దీంతో గోదావరి ఉగ్రరూపం దాల్చి జనగామ సమీపంలోని సమ్మక్క సారలమ్మ జాతర దేవాలయం నీట మునిగింది. దీంతో రామగుండం తాసిల్దార్, కార్పొరేషన్ అధికారులు గోదావరి పరివాహక పరిసర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. రామగుండం కార్పొరేషన్ లో హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు చేశారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com