Thursday, December 26, 2024

తుక్కుగూడ సభలో భారీగా చేరికలు

ఎమ్మెల్యేలు, మాజీలు, వారి అనుచరగణం చేరే అవకాశం
ఇప్పటికే సిఎం రేవంత్‌తో టచ్‌లోకి వెళ్లిన పలువురు ఎమ్మెల్యేలు…

పార్లమెంట్ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. అందులో భాగంగా ఈ నెల 6వ తేదీన తుక్కుగూడలో జనజాతర సభ ద్వారా ఎన్నికల శంఖారావాన్ని పూరించబోతుంది. ఈ నేపథ్యంలోనే ఆపరేషన్ ఆకర్శ్‌ను కూడా విజయవంతంగా కొనసాగిస్తోంది. అందులో భాగంగా తుక్కుగూడ సభలోగా వివిధ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలను, మాజీలను, వారి అనుచరగణాన్ని కూడా కాంగ్రెస్‌లో చేర్చుకోవాలని ఆ పార్టీ వ్యూహాలను పన్నుతోంది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలతో పాటు మాజీలతో కాంగ్రెస్ పార్టీ టచ్‌లోకి వెళ్లినట్టుగా తెలిసింది. ఈ నేపథ్యంలోనే వారు పార్టీలో కి వస్తే వారికి సరైన గుర్తింపు ఇవ్వడంతో పాటు హోదాను కల్పిస్తామని భరోసా కల్పిస్తున్నట్టుగా సమాచారం. దీంతో ఎమ్మెల్యేలు చాలామంది తుక్కుగూడ సభలోగా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధమయినట్టుగా తెలిసింది. ఇప్పటికే బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి కాంగ్రెలో చేరగా మరికొందరు వివిధ పార్టీలకు చెందిన వారు కాంగ్రెస్‌లో చేరేందుకు సుముఖత వ్యక్తం చేసినట్టుగా కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి.

ఏఐసిసి పెద్దల సమక్షంలో చేరికలు…
తుక్కుగూడ సభ ద్వారా భారీగా జనాన్ని సమీకరించి తమ సత్తా చాటాలని నిర్ణయించిన కాంగ్రెస్ పార్టీ ఈ సభకోసం 10 లక్షల మంది సేకరించాలని నిర్ణయించింది. ఆ దిశగా ఇప్పటికే సీనియర్ నాయకులకు ఈ బాధ్యతలను అప్పగించినట్టుగా తెలిసింది. దీంతోపాటు కాంగ్రెస్ జాతీయ మేనిఫెస్టోను కూడా ఇక్కడే విడుదల చేస్తుండడంతో జనసమీకరణ భారీగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించినట్టుగా సమాచారం. వీలును బట్టి ఏఐసిసి పెద్దల సమక్షంలో లేదా సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరబోతున్నట్టుగా తెలుస్తోంది.

ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు సిఎం రేవంత్‌రెడ్డితో భేటీ అయినట్టుగా తెలిసింది. అయితే వారు పైకి తాము పార్టీ మారడం లేదని ప్రకటనలు ఇస్తున్నా, సాధ్యసాధ్యాలను బట్టి ఈ రెండు రోజుల్లో కండువా మార్చడం ఖాయమని తెలుస్తోంది. పార్టీ మారాలన్న ఆలోచన ఉన్న ఎమ్మెల్యేలు సైతం తాము కండువా మార్చేందుకు ఇదే సరైన సమయం అని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. పార్టీ మారుతున్న సమయంలో తమతో పాటు తమ అనుచరగణాన్ని వెంట తీసుకువెళ్లడానికి సమాయత్తం కావడం విశేషం.

ప్ర‌దాన వార్త‌లు

అల్లు అర్జున్ పట్ల రేవంత్ రెడ్డి దారుణంగా వ్యవహరిస్తున్నారన్న డీకే అరుణ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com