తెలంగాణలో భారీ పంప్డ్ స్టోరేజీ పవర్, సోలార్ పవర్ ప్రాజెక్టు
దావోస్ వేదికగా తెలంగాణతో అతిపెద్ద డీల్..
‘ట్రిలియన్ ట్రీ ఉద్యమంలో భాగస్వాములమవుతాం..
ప్రతిజ్ఞ చేసిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు
ప్రతి అంశంలోనూ నెట్ జీరో విధానాలు పాటిస్తున్నామని ప్రకటన
దావోస్ వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సులో తెలంగాణ ప్రభుత్వం మరో భారీ పెట్టుబడిని సాధించింది. సన్ పెట్రో కెమికల్స్ సంస్థ రాష్ట్రంలో రూ.45,500 కోట్ల పెట్టుబడుల ఒప్పందంపై సంతకం చేసింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో భారీ పంప్డ్ స్టోరేజ్ జల విద్యుత్, సౌర విద్యుత్ ప్రాజెక్టులను ఈ సంస్థ ఏర్పాటు చేయనుంది ఈ ఒప్పందంతో దాదాపు 7,000 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. నాగర్ కర్నూల్, మంచిర్యాల, ములుగు ప్రాంతాల్లో ఈ ప్రాజెక్టులు నెలకొల్పనుంది. ఇప్పటి వరకు దావోస్ వేదికగా తెలంగాణ ప్రభుత్వం చేసుకున్న భారీ ఒప్పందం ఇదే కావడం గమనార్హం.
దావోస్ వేదికగా జెఎస్ డబ్ల్యు డిఫెన్స్ అనుబంధ సంస్థ అయిన జేఎస్ డబ్ల్యూ యూఏవీ లిమిటెడ్ తో రాష్ట్రప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా రూ.800 కోట్లతో రాష్ట్రంలో అధునాతన అన్‌మాన్డ్ ఏరియల్ సిస్టమ్స్ తయారీ యూనిట్ ఏర్పాటు చేయనున్నట్లు జేఎస్‌డబ్ల్యూ సంస్థ ప్రకటించింది.ఈ ప్రాజెక్టుతో డ్రోన్ టెక్నాలజీకి తెలంగాణ ప్రధాన కేంద్రంగా మారే అవకాశముంది.
ఒక ట్రిలియన్ మొక్కలు నాటి భూమిని హరితవనంగా మార్చే ‘ట్రిలియన్ ట్రీ ఉద్యమం ‘ లో భాగమవుతానని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ప్రమాణం చేశారు. పర్యావరణాన్ని పరిరక్షిస్తూ, భవిష్యత్ తరాల మనుగడను సురక్షితంగా మార్చే ప్రయత్నంలో పాలుపంచుకుంటానని ప్రతిజ్ఞ చేశారు. దావోస్ లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో భాగంగా వన్ ట్రిలియన్ ట్రీ ఆర్గనైజేషన్ నిర్వాహకులు తెలంగాణ పెవిలియన్‌ను సందర్శించి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబును కలిసి పర్యావరణ ప్రమాణాన్ని చేయించారు.