- 9,164 కిలోమీటర్ల మేర రోడ్ల క్లీనింగ్ , 6,135 కిలోమీటర్ల మేర మురుగు నీటి కాలువలు శుభ్రం
మొదటి రోజు (సోమవారం) ప్రారంభమైన ‘స్వచ్ఛదనం పచ్చదనం’ కార్యక్రమం విజయవంతం అయ్యింది. లక్షల సంఖ్యలో ప్రజలు ‘స్వచ్ఛదనం- పచ్చదనం’ కార్యక్రమంలో పాల్గొని లక్షల మొక్కలను నాటారు. వేల కిలోమీటర్ల మేర రహదారులను, మురుగునీటి కాలువలను శుభ్రపరిచారు. రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా -9,164 కిలోమీటర్ల మేర రోడ్ల క్లీనింగ్ -6,135 కిలోమీటర్ల మేర మురుగు నీటి కాలువలను శుభ్రం చేసి 8,02,008 మొక్కలను నాటారు. 10,844 గ్రామపంచాయతీల్లో 14,016 పాఠశాలల్లో వ్యాసరచన ఉపన్యాస పోటీలను నిర్వహించడంతో పాటు 20,359 ప్రభుత్వ స్థలాలు, కార్యాలయాల్లో క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశారు.
ప్రతి గ్రామంలో ఒక ఉత్సవంలా ఈ స్పెషల్ డ్రైవ్‌ను చేపట్టారు. మరుగుదొడ్లు లేని 40,888 గృహాలను అధికారులు ఈ సందర్భంగా గుర్తించారు. ములుగు నియోజకవర్గంలో ‘స్వచ్ఛదనం- పచ్చదనం’ కార్యక్రమాన్ని మంత్రి సీతక్క లాంఛనంగా ప్రారంభించగా పలు జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజా ప్రతినిధులు, కలెక్టర్లు, ఉన్నతాధికారులు ఈ స్పెషల్ డ్రైవ్‌లో పాలుపంచుకున్నారు.
పారిశుద్ధ్య నిర్వహణ, పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా ‘స్వచ్ఛదనం-పచ్చదనం’ సోమవారం ప్రారంభమైంది. మొత్తం ఐదు రోజుల పాటు సాగే ఈ కార్యక్రమంలో మొదటి రోజు పచ్చదనం, పరిశుభ్రత పెరిగేలా గ్రామగ్రామాన పలు కార్యక్రమాలను చేపట్టారు.