అప్రమత్తమైన రాష్ట్ర వైద్యారోగ్యశాఖ
చైనాలో హ్యూమన్ మెటాప్ న్యూమో వైరస్ (హెచ్ఎంపీవీ) వైరస్ విస్తరిస్తోన్న నేపథ్యంలో మన రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది. ఫ్లూ లక్షణాలు ఉన్నవారు మాస్క్ ధరించాలని రాష్ట్ర ప్రజలకు వైద్యారోగ్యశాఖ సూచించింది. హెచ్ఎంపీవీ వైరస్ కేసులు ఇప్పటి వరకు తెలంగాణలో నమోదు కాలేదని ప్రజలు భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని తెలిపింది. జలుబు, దగ్గు లక్షణాలు ఉన్నవారు ముందస్తు జాగ్రత్తలో భాగంగా జన సమూహాలకు దూరంగా ఉండాలని సూచించింది. ఇదిలావుండగా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో చేయాల్సిన పనులు, చేయకూడని పనులకు సంబంధించి మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది.
చేయాల్సిన పనులు:-
– దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు మీ నోటిని ముక్కును రుమాలు లేదా టిష్యూ పేపర్‌తో కవర్ చేసుకోవాలి.
– జ్వరం, దగ్గు, తుమ్ములు ఉంటే బహిరంగ ప్రదేశాలకు దూరంగా ఉండాలి.
-సబ్బు లేదా శానిటైజర్‌తో చేతులను తరచుగా శుభ్రం చేసుకోండి.
-ఫ్లూతో బాధపడుతున్న వ్యక్తులకు దూరం పాటించాలి.
-జన సాంద్రత ఎక్కువగా ఉండే ప్రదేశాలను వెళ్లరాదు.
-ఎక్కువగా నీళ్లు తాగాలి పౌష్టికాహారం తీసుకోవాలి.
-తగినంత నిద్ర, విశ్రాంతి తీసుకోవాలి.
చేయకూడని పనులు:-
-ఇతరులతో -కరచాలనం(షేక్ హ్యాండ్) చేయవద్దు.
-ఫ్లూ బారిన పడిన వారు ఉపయోగించిన టిష్యూ పేపర్, కర్చీఫ్‌లను ఇతరులు వాడరాదు.
-కళ్ళు, ముక్కు, నోటిని తరచుగా తాకవద్దు.
-ఫ్లూ లక్షణాలుంటే- వైద్యుని సంప్రదించకుండా సొంతంగా మెడిసిన్ వాడొద్దు.