Saturday, January 4, 2025

వారానికి రూ. 200 కిస్తీ కట్టలేక భార్యాభర్తల ఆత్మహత్య

అనాథలుగా మిగిలిన ఇద్దరు పిల్లలు

నిరుపేద కుటుంబం. శిథిలమైన పెంకుటిల్లు తప్ప మరే ఆధారం లేదు. రోజూ దంపతులిద్దరూ కూలికి వెళ్తూ జీవనం సాగిస్తున్నారు. వారు కష్టం చేసిన డబ్బులతో ఇద్దరు పిల్లలను చదివించుకుంటున్నారు. అయితే వారు చేసిన కొద్దిపాటి అప్పు, దానికి ప్రతి వారం చెల్లించాల్సిన రూ. 200 కిస్తీ భారంగా మారాయి. అనారోగ్యాలు, ఖర్చులకుతోడు అప్పు ఇచ్చిన వారి వేధింపులు ఎక్కువ కావడంతో ఆ భార్యాభర్తలు బలవన్మరణాలకు పాల్పడి ఇద్దరు పిల్లల్ని అనాథలుగా మిగిల్చారు.  ఈ విషాద ఘటన భూపాలపల్లి జిల్లాలో జరిగింది.

పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం:భూపాలపల్లి జిల్లాలోని కమలాపూర్‌ గ్రామానికి చెందిన బానోత్‌ దేవేందర్‌ (37), చందన (32) దంపతులు వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. గ్రామాల్లో కొంతమంది మహిళలను గ్రూపుగా ఏర్పరచి ప్రైవేటు ఫైనాన్స్‌ వ్యాపారులు రుణాలిస్తుంటారు. కొన్ని నెలల క్రితం చందన సభ్యురాలిగా ఉన్న సంఘంలోని సభ్యులంతా కలిసి రూ.2.50 లక్షల అప్పు తీసుకున్నారు.

ఈ రుణానికి ప్రతి వారం రూ. 200 కిస్తీ కట్టాలి. కొన్నాళ్లు సక్రమంగానే చెల్లించారు. కానీ భర్త, పిల్లలు అనారోగ్యాల బారిన పడడంతో చందన కొన్ని నెలలుగా కిస్తీ కట్టలేకపోతుంది. దీనిపై ఫైనాన్స్‌ యజమాని ఒత్తిడి చేయడంతో భార్యాభర్తలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.దీంతో చందన డిసెంబరు 6న గడ్డి మందు తాగగా ఇరుగు పొరుగు వారు ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితిపై ఆందోళనతో దేవేందర్‌ అదే నెల 20న ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చందన మంగళవారం మృతి చెందగా, పది రోజుల వ్యవధిలో తల్లితండ్రులను కోల్పోయిన ఇద్దరు పిల్లలు ఒంటరిగా మిగిలిపోయారు. వారిని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్థులు కోరారు. ఈ ఘటనలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు భూపాలపల్లి సీఐ నరేష్‌కుమార్‌ తెలిపారు.

ప్ర‌దాన వార్త‌లు

గోటితో పోయే దాన్ని గోడ్డ‌లి వ‌ర‌కు తెచ్చారు... బ‌న్నీ అరెస్ట్‌ వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com