- ప్రజాపాలనలో గ్రేటర్ సిటీపై సిఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక దృష్టి
- పెరుగుతున్న జనాభా, నగర విస్తరణకు అనుగుణంగా
- మాస్టర్ ప్లాన్‌తో అవసరమైన ప్రణాళికలు
ప్రజాపాలనలో గ్రేటర్ సిటీపై సిఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. మహానగరంలో ట్రాఫిక్ రద్దీని తట్టుకునేలా ఎలివేటేడ్ కారిడార్లు, మెట్రో, రోడ్లు, రవాణా సదుపాయాల విస్తరణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నడుంబిగించారు. పెరుగుతున్న జనాభా, నగర విస్తరణకు అనుగుణంగా 2050 మాస్టర్ ప్లాన్‌తో గ్రేటర్ సిటీ అభివృద్ధికి అవసరమైన ప్రణాళికలను రూపొందించారు. సికింద్రాబాద్‌లోని అల్వాల్ సమీపంలో రాజీవ్ రహదారిపై రూ.2,232 కోట్లతో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం చేపట్టనున్నారు.
హైదరాబాద్ టు నాగ్‌పూర్ జాతీయ రహదారిపై రూ.1,580 కోట్లతో డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి భూమిపూజ చేశారు. వీటితో సిటీలో ట్రాఫిక్ రద్దీని క్రమబద్దీకరించే వీలుంది. ఈ కారిడార్ల నిర్మాణానికి, మెహిదీపట్నం స్కై వాక్ నిర్మాణాలకు ప్రధాన అడ్డంకిగా ఉన్న రక్షణ భూములను రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేసేందుకు ముఖ్యమంత్రి పలుమార్లు ఢిల్లీకి వెళ్లి కేంద్రంతో సంప్రదింపులు జరిపారు. గడిచిన పదేండ్లలో పెండింగ్‌లో ఉన్న ఈ భూముల స్వాధీన ప్రక్రియను కొత్త ప్రభుత్వం అధికారం చేపట్టిన మూడు నెలల్లోనే సాధించగలిగింది.
అంతర్జాతీయ స్థాయిలో గాంధీ ఐడియాలజీ సెంటర్
హైదరాబాద్‌లోని చెరువులు, కుంటలు, నాలాలు, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకు ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసింది. పోలీస్, ట్రాఫిక్, హెచ్‌ఎండిఏ, జీహెచ్‌ఎంసీ సమన్వయంతో ఈ వ్యవస్థను ఏర్పాటు చేసింది. హైదరాబాద్‌లో మురికినీటి కూపంగా మారిన మూసీనది పునరుజ్జీవంపై ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. నగరంలోని జంట జలాశయాలు హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్‌ను పునరుద్ధరించేలా ప్రతిపాదనలు తయారు చేసింది. మూసీనదిలోకి చేరుతున్న మురికినీటిని శుద్ధి చేసేందుకు 39 ఎస్టీపిలను ఏర్పాటు చేస్తోంది. ఎల్లంపల్లి నుంచి మరో 20 టిఎంసీల గోదావరి నీళ్లను హైదరాబాద్‌లో తాగునీటికి, మూసీలో స్వచ్ఛమైన నీటి ప్రవాహానికి వీలుగా బహుళ ప్రయోజనాలుండే ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది. ఇందులో భాగంగా బాపూఘాట్‌ను దేశంలో ఎక్కడా లేని విధంగా అద్భుతంగా తీర్చిదిద్దే ప్రణాళికలను సిద్ధం చేసింది. అంతర్జాతీయ స్థాయిలో గాంధీ ఐడియాలజీ సెంటర్‌ను ఇక్కడ నెలకొల్పనుంది.
మీర్‌అలం చెరువు సమీపంలో నాలుగులేన్‌ల వంతెన
మీర్‌అలం చెరువు సమీపంలో దాదాపు రూ. 360 కోట్ల అంచనా వ్యయంతో నాలుగులేన్‌ల వంతెన నిర్మాణం చేపడుతోంది. ఎల్‌బి నగర్ సమీపంలో బైరామాల్ గూడ ఫ్లైఓవర్‌ను ప్రారంభించింది. ఆరాంఘర్ నుంచి జూ పార్క్ వరకు ఫ్లైఓవర్‌ను త్వరలోనే ప్రభుత్వం ప్రారంభించనుంది. హైదరాబాద్‌లో రవాణా సేవలను విస్తరించేందుకు కొత్తగా ఆర్టీసి బస్సులు కొనుగోలు చేయటంతో పాటు మహాలక్ష్మి ద్వారా సిటీ బస్సుల్లో దాదాపు 50 లక్షల మంది మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించింది. రూ. 24,237 కోట్లతో మెట్రో రైలు రెండో దశ ప్రాజెక్టుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
ఇప్పుడున్న 69 కిలోమీటర్లకు అదనంగా ఫేజ్ 2లో పాతబస్తీ చుట్టివచ్చేలా ఎయిర్ పోర్టు వరకు 76.4 కిలోమీటర్ల మెట్రో విస్తరణ చేపట్టనుంది. నాగోల్ నుంచి శంషాబాద్, రాయదుర్గ్ నుంచి కోకాపేట్, ఎంజీబిఎస్ నుంచి చాంద్రాయణగుట్ట , మియాపూర్ నుంచి పటాన్‌చెరు వరకు, ఎల్బీనగర్ నుంచి హయత్‌నగర్ వరకు రెండో దశలో విస్తరిస్తారు. హైకోర్టు నూతన భవనానికి బుద్వేల్ లో 100 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. వీటితో పాటు ఉస్మానియా కొత్త ఆసుపత్రి భవనాన్ని గోషామహల్ సమీపంలో నిర్మించేందుకు స్థలాన్ని కేటాయించింది. హైదరాబాద్ సిటీ ఇన్నోవేషన్ అండ్ ట్రాన్స్‌ఫర్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (హెచ్‌సిఐటిఐ) ప్రాజెక్ట్ లో భాగంగా జీహెచ్‌ఎంసి పరిధిలో రహదారుల నిర్మాణానికి దాదాపు రూ. 8,996 కోట్లతో ప్రతిపాదనలు తయారు చేసింది. రూ.596.2 కోట్ల అంచనాలతో వరద నీటి కాలువల నిర్మాణం చేపట్టింది.
దాదాపు 30 వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ ఏర్పాటుకు
వాన పడితే నీళ్లు నిలిచి ట్రాఫిక్ స్తంభించిపోతున్న సమస్యను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవ చూపుతున్నారు. నీళ్లు నిల్వ చేరే ప్రధాన జంక్షన్‌లలో వాటర్ ఇన్ టేక్ వెల్స్ తవ్వించి అక్కడి నుంచి నీటిని డ్రైనేజీలకు, నాలాలకు తరలించే ప్రాజెక్టును చేపట్టారు. కెబిఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ రద్దీని అధిగమించేలా రూ.826 కోట్ల అంచనాలతో ఆరు జంక్షన్లను అభివృద్ధి చేసే ప్రాజెక్టుకు ప్రభుత్వం ఇటీవలే పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు జంక్షన్, కెబిఆర్ ఎంట్రెన్స్ జంక్షన్, రోడ్ నెంబర్ -45 జంక్షన్, ఫిలింనగర్, మహారాజా అగ్రసేన్, క్యాన్సర్ హాస్పిటల్ జంక్షన్‌లలో ఈ ప్రాజెక్టులో భాగంగా దీనిని అభివృద్ధి చేయనుంది.
నగర విస్తరణ, అభివృద్ధి లక్ష్యంగా దాదాపు రూ.18 వేల కోట్లతో రీజనల్ రింగ్‌రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్ దక్షిణ భాగం) నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపడుతోంది. ఉమ్మడి మెదక్ జిల్లాలోని సంగారెడ్డి నుంచి ప్రారంభమై రంగారెడ్డి జిల్లా చేవెళ్ల, శంకర్ పల్లి మీదుగా మహబూబ్ నగర్‌లోని ఆమనగల్లు, కందుకూరు, ఇబ్రహీంపట్నం నుంచి నల్గొండ జిల్లా చౌటుప్పల్ వరకు దాదాపు 189 కిలోమీటర్లు ఈ రహదారి నిర్మిస్తారు. హైదరాబాద్‌లో దాదాపు 30 వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమైంది. యంగ్‌ఇండియా స్కిల్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేసింది. త్వరలోనే స్పోర్ట్ యూనివర్సిటీ నెలకొల్పుతుంది. ఫార్మా సిటీతో పాటు ఏఐ సిటీ, సాఫ్ట్‌వేర్, లైఫ్ సైన్సెస్, హెల్త్ కేర్ టెక్నాలజీ పరిశ్రమల పవర్ హబ్‌గా దీనిని తీర్చిదిద్దుతోంది. రీజనల్ రింగ్ రోడ్డు నుంచి ఔటర్ రింగ్ రోడ్డు వరకు రేడియల్ రోడ్లతో పాటు ఫ్యూచర్ సిటీలో గ్రీన్ ఫీల్డ్ రహదారి నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది.