హాస్పిటల్ లో పరామర్శించిన సిపి సివి ఆనంద్
సంధ్య థియేటర్ లైసెన్స్ రద్దు దిశగా చర్యలు
ఆర్టీసీ క్రాస్ రోడ్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడిన బాలుడు శ్రీతేజ్‌కు కిమ్స్ హాస్పిటల్లో చికిత్స కొనసాగుతోంది. మంగళవారం కిమ్స్ హాస్పిటల్‌కి వొచ్చిన హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్.. వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి క్రిస్టినాతో కలిసి బాలుడు శ్రీతేజ్‌ను పరామర్శించారు.
‘13 రోజులుగా బాలుడికి చికిత్స కొనసాగుతోంది. ప్రస్తుతం వెంటిలేటర్ సాయంతో చికిత్స అందిస్తున్నారు. డిసెంబరు 4న జరిగిన తొక్కిసలాట ఘటనలో శ్రీతేజ్‌కు ఆక్సిజన్ అందక బ్రెయిన్ డ్యామేజ్ అయింది. వెంటిలేటర్ సాయంతో ఆక్సిజన్ అందిస్తున్నారు. పూర్తిగా కోలుకునేందుకు సమయం పడుతుందని వైద్యులు చెబుతున్నారు. బాలుడి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు బులిటెన్ విడుదల చేస్తారని సీపీ తెలిపారు. ప్రభుత్వ పరంగా బాధిత కుటుంబానికి అండగా ఉంటామని, బాలుడు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
థియేటర్ కు షోకాజ్ నోటీసులు
ఇదిలావుంటే ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లోని సంధ్య థియేటర్‌కు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఈనెల 4న రాత్రి పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల జరిగిన ఘటనపై లైసెన్స్ ఎందుకు రద్దు చేయకూడదో తెలపాలంటూ నోటీసులు జారీ చేశారు. దీనిపై పది రోజుల్లో వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు. థియేటర్‌కు ఇరువైపులా రెస్టారెంట్లు ఉన్నాయని, నటులొస్తే భద్రత కల్పించలేమని చిక్కడపల్లి పోలీసులు ముందుగానే హెచ్చరించినట్టు ఓ రిపోర్టు సామాజిక మాధ్యమాల్లో ఇప్పటికే వైరల్ అయింది. సంధ్య 70ఎంఎం, 35ఎంఎం రెండు థియేటర్లు ఒకేచోట ఉండగా, వీటిలో దాదాపు 2,520 సీటింగ్ కెపాసిటీ ఉంది.
మహిళలు థియేటర్లోకి వెళ్లేందుకు ప్రత్యేకంగా ఎంట్రీ, డిస్ప్లే బోర్డులు ఎక్కడా ఏర్పాటు చేయలేదు. ప్రేక్షకులు థియేటర్లోకి వెళ్లేందుకు ఒకటే మార్గం ఉంది. ఎక్కువ మంది ప్రేక్షకులు థియేటర్‌కు వొచ్చే విధంగా ప్రోత్సహిస్తోన్న యాజమాన్యం.. రద్దీని నియంత్రిచేందుకు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదని పోలీసుల దర్యాప్తులో తేలింది. అల్లు అర్జున్ సంధ్య థియేటర్‌కు వొచ్చిన సమయంలో జరిగిన తొక్కిసలాటలో మహిళ మృతి చెందడం, బాలుడు తీవ్రంగా గాయపడిన ఘటనను పోలీసులు తీవ్రంగా పరిగణించారు. ఈ కేసులో ఇప్పటికే అల్లు అర్జున్ను అరెస్టు చేసిన పోలీసులు.. తాజాగా సంధ్య థియేటర్ లైసెన్స్ ఎందుకు రద్దు చేయకూడదో వివరణ ఇవ్వాలని షోకాజ్ నోటీసు ఇచ్చారు.