డ్రగ్స్ వినియోగదారులకు హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి హెచ్చరికలు జారీ చేశారు. డ్రగ్స్‌తో పట్టుబడితే వినియోగదారులపై కూడా కేసులు నమోదు చేస్తామన్నారు. ఇకపై డ్రగ్స్ వినియోగదారులపై ఉక్కుపాదం మోపుతామని తెలిపారు. డ్రింక్స్‌లో డ్రగ్స్ కలిపి అలవాటు చేస్తున్నారని.. డ్రగ్స్ అలవాటు చేసేవారిపై కూడా కేసులు పెడతామన్నారు. పిల్లల విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని.. వారి ప్రవర్తనను గమనించాలని తెలిపారు.
హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. 8.5 కేజీల మాదకద్రవ్యాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.8.5 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. డ్రగ్స్ విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న ముగ్గురిని అరెస్ట్ చేశారు. మాదకద్రవ్యాలను ఎక్కడి నుంచి తెచ్చారు? ఎవరికి విక్రయిస్తున్నారనే కోణంలో విచారణ జరుపుతున్నారు.
ఇక నడిరోడ్డుపై ప్రజలకు ఇబ్బంది కలిగేలా ఇష్టారీతిన రీల్స్ చేసే వారిపై పోలీసులు కఠిన చర్యలకు దిగుతున్నారు. సోషల్ మీడియాలో తనిఖీలు చేసి పాతవాటిపైనా కేసులు పెడుతున్నారు. ఇటీవల హైదరాబాద్ లో రోడ్డుపై నోట్లు వెదజల్లుతూ రీల్స్ చేసిన ఓ యువకుడిపై మూడు పోలీస్ స్టేషన్ లలో కేసులు పెట్టి అరెస్ట్ చేశారు. బైకులపై స్టంట్లు చేయడం, నోట్లు జల్లడం, అభ్యంతరకరంగా ఉండే వీడియోలు చేస్తే బాధ్యులను గుర్తించి కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు.