Thursday, May 8, 2025

రవాణా శాఖ జెసిపై దాడి అమానుషం

  • తీవ్రంగా ఖండించిన రవాణా శాఖ మంత్రి పొన్నం
  • నిందితుడిని వెంటనే అరెస్టు చేయాలి: ఉద్యోగ సంఘాల డిమాండ్

రవాణా శాఖ హైదరాబాద్ జాయింట్ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ రమేష్‌పై జరిగిన దాడిని రాష్ట్ర రవాణా, బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా ఖండించారు. ఏమైనా ఇబ్బంది ఉంటే ఫిర్యాదులు చేసుకోవాలి కానీ, ఇలా అధికారుల మీద దాడులు సరైంది కాదని మంత్రి అన్నారు. ఉద్యోగులపై దాడులు చేయడం సమస్యకు పరిష్కారం కాదని, రవాణా శాఖ మంత్రిగా తాను ఉద్యోగులకు అండగా ఉంటానని ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. ఈ దాడి గురించి పోలీసులను మంత్రి అడిగి తెలుసుకున్నారు.

దాడి చేసిన వ్యక్తిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. కాగా, దాడి చేసిన వ్యక్తిపై ఇప్పటికే కేసు నమోదు చేసినట్లు పోలీసులు మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకొచ్చారు. భవిష్యత్‌లో అధికారులపై దాడి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని మంత్రి ఆదేశించారు. ఉద్యోగులు అధైర్యపడవద్దని తాము అండగా ఉంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు.

తీవ్రంగా ఖండించిన గ్రూప్ 1 అధికారుల సంఘం
రవాణా శాఖ హైదరాబాద్ జాయింట్ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ రమేష్‌పై భౌతిక దాడి చేసిన ఆటో రిక్షా యూనియన్ నాయకుడు అమానుల్లా ఖాన్‌ను వెంటనే అరెస్ట్ చేసి కఠినచర్యలు తీసుకోవాలని తెలంగాణ గ్రూప్ 1 ఆఫీసర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఈ పాశవిక దాడిని అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది. తెలంగాణ గ్రూప్ 1 ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మామిండ్ల చంద్ర శేఖర్ గౌడ్, హన్మంత్ నాయక్‌లు మాట్లాడుతూ నిందితుడు అమానుల్లాఖాన్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా, ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులపై దాడులు చేసిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

ఖండించిన టిఎన్జీఓల సంఘం
రవాణా శాఖ హైదరాబాద్ జాయింట్ కమిషనర్ రమేష్‌పై జరిగిన దాడిని టిజిఓ అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాస్ రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, టిఎన్జీఓ అధ్యక్షుడు జగదీశ్వర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముజీబ్ హుస్సేనీలు తీవ్రంగా ఖండించారు. నిందితుడిని తక్షణమే అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

నేడు అన్ని కార్యాలయాల్లో పెన్‌డౌన్
హైదరాబాద్ జాయింట్ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ రమేష్‌పై ఆటో రిక్షా యూనియన్ నాయకుడు అమానుల్లా ఖాన్ జరిపిన భౌతిక దాడిపై రవాణా శాఖ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మధ్యాహ్నం జాయింట్ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ రమేష్ చాంబర్‌లోకి చొరబడి రమేష్‌పై భౌతిక డాడి చేసిన అమానుల్లా ఖాన్ ను వెంటనే అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని రవాణా శాఖ ఉద్యోగ సంఘాల నాయకులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ దాడి ని తీవ్రంగా ఖండిస్తున్నామని, దాడికి నిరసనగా నేడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కార్యాలయాల రవాణా శాఖ సిబ్బంది పెన్‌డౌన్ నిర్వహిస్తున్నామని రవాణా శాఖ ఉద్యోగ సంఘాల నాయకులు పి.రవీందర్ కుమార్, చంద్ర శేఖర్ గౌడ్, శ్రీనివాస రెడ్డి, రామకృష్ణ, అరుణేంద్ర ప్రసాద్, ఎంజులా రెడ్డి, శ్రీనివాస్, తదితరులు తెలిపారు.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com