Saturday, April 5, 2025

Hyderabad Metro: ప్రతిపాదిత 70 కిలోమీటర్లకు అదనంగా….

  • మెట్రో రైలు రెండో దశ విస్తరణలో మరో 8 కిలోమీటర్లు పొడిగింపు
  • తాజా బడ్జెట్‌లో అవసరమైన నిధులను కేటాయించిన ప్రభుత్వం
  • రెండోదశ డిపిఆర్‌ల సవరణకు మెట్రో సిద్ధం

మహానగరంలో మెట్రో రైలు రెండో దశ విస్తరణను రాష్ట్ర ప్రభుత్వం మరో 8 కిలోమీటర్లు పొడిగించింది. ప్రతిపాదిత 70 కిలోమీటర్లకు అదనంగా మరో 8 కిలోమీటర్లు పొడిగిస్తున్నట్లు తాజాగా బడ్జెట్‌లో పేర్కొంది. ఈ మేరకు తాజా బడ్జెట్‌లో అందుకు అవసరమైన నిధులను భారీగా కేటాయించడంతో పాటు అంచనా వ్యయాన్ని కూడా సవరించింది. ప్రభుత్వం సూచనల మేరకు రెండో దశ విస్తరణ డిపిఆర్‌లకు సంబంధించి హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ చేర్పులు మార్పులు చేస్తోంది.

నగరంలో ట్రాఫిక్ సమస్యను తీర్చడంతోపాటు ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా ఇప్పటికే మొదటి దశలో అందుబాటులో ఉన్న మెట్రో రైలు ద్వారా ట్రాఫిక్ సమస్య కొంత మెరుగవ్వగా రెండో దశ విస్తరణపై కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. మెట్రో మొదటి దశలో ఎదురైన అనుభవాలను దృష్టిలో పెట్టుకొని రెండో దశ ప్రతిపాదనలను సమీక్షించి ప్రభుత్వం వాటిని సవరించింది. అంతేకాకుండా కొత్త మార్గంలో 70 కిలో మీటర్ల వరకు రెండో దశ విస్తరణ చేయాలని తొలుత నిర్ణయించింది.

రెండోదశ ప్రతిపాదనల్లో మెట్రోరైలు….
నగరంలోని అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చెందాలన్న లక్ష్యంతో 78.4 కిలోమీటర్ల పొడవునా 5 కారిడార్లలో మెట్రో రైలు విస్తరణ జరుగుతుందని ప్రభుత్వం తెలిపింది. రెండోదశ ప్రతిపాదనల్లో మరో 8 కిలోమీటర్లు మెట్రోరైలును విస్తరిస్తున్నట్లు తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ప్రభుత్వం ప్రకటించింది. అంతేకాకుండా అంచనా వ్యయం కూడా భారీగా పెరిగింది. రూ.24 వేల 42 కోట్లతో మెట్రో రైలు రెండో దశ విస్తరణ ఉంటుంది.

రాయదుర్గం నుంచి విప్రో కూడలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్‌లోని యూఎస్ కాన్సులేట్ వరకు 8 కిలోమీటర్ల మార్గాన్ని తొలుత ప్రతిపాదిం చారు. దానిని కోకాపేటలోని నియోపోలీస్ వరకు విస్తరించాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. హైదరాబాద్ మెట్రోకు రూ.1,100 కోట్లు కాగా ఇక్కడ 3 కిలో మీటర్లుకు పైగా దూరం పెరగడంతో కారిడార్ పొడవు 11.3 కిలోమీటర్లు అయ్యింది. అలాగే నాగోల్, ఎల్బీనగర్, చాంద్రాయణగుట్ట, మైలార్‌దేవర్‌పల్లి కూడలి నుంచి జల్‌పల్లి మీదుగా శంషాబాద్ విమానాశ్రయం వరకు తొలుత 29 కిలోమీటర్లుగా ఎయిర్ పోర్టు మెట్రోను అంచనా వేయగా అది కాస్త ఇప్పుడు 33.1 కిలోమీటర్లకు పెరిగింది.

మైలార్‌దేవ్‌పల్లి నుంచి అరాంఘర్, కొత్త హైకోర్టు వరకు 5 కిలోమీటర్లు….
మైలార్‌దేవ్‌పల్లి నుంచి అరాంఘర్, కొత్త హైకోర్టు వరకు 5 కిలోమీటర్లు పైగా మెట్రో మార్గం కూడా రెండో దశలో ప్రతిపాదించారు. అందులో పెద్దగా ఎలాంటి మార్పులు చేయలేదు. ఎల్బీనగర్- టు హయత్ నగర్, మియాపూర్ నుంచి పటాన్‌చెరు, ఫలక్‌నుమా నుంచి చాంద్రాయణగుట్ట వరకు మెట్రో మార్గం యధావిధిగా కొనసాగనున్నాయి. దీంతోపాటు నాగోల్, ఎల్బీనగర్, చాంద్రాయణగుట్టలో మెట్రో ఇంటర్‌ఛేంజ్ స్టేషన్‌లుగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

అంతేకాకుండా హైదరాబాద్ మెట్రోకు బడ్జెట్‌లో రూ.1,100 కోట్లను ప్రతిపాదించారు. ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్‌తో పోలిస్తే ఈసారి బాగా పెరిగింది. అలాగే పాతబస్తీ మెట్రో రైలు పనులు మొదలుపెట్టేందుకు రూ.500 కోట్లను ప్రతిపాదించారు. హైదరాబాద్ మెట్రో రైలు సంస్థకు మరో రూ. 500 కోట్లను బడ్జెట్‌లో కేటాయించారు. విమానాశ్రయం మెట్రో కారిడార్‌కు రూ. 100 కోట్లను వేర్వేరు పద్దుల్లో ప్రతిపాదించారు. మొత్తం ప్రతిపాదిత రూ. 1,100 కోట్ల బడ్జెట్‌లో రూ. 500 కోట్లు రుణంగా, రూ.600 కోట్లను గ్రాంట్లుగా ఇవ్వనున్నట్లు ఈ బడ్జెట్ పద్దులో ప్రభుత్వం వెల్లడించింది. మరోవైపు రెండో దశ విస్తరణ 8 కిలో మీటర్లు పెరగడంతో మెట్రో రైలు సంస్థ సిద్ధం చేసిన డిపిఆర్‌లో మార్పులు, చేర్పులు చేస్తోంది.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com