Wednesday, November 27, 2024

త్వరలోనే హైదరాబాద్ మెట్రో రెండో దశ పనులు ప్రారంభం

  • పిపిపి మోడల్‌లో విజయవంతంగా హైదరాబాద్ మేట్రో
  • నాడు వద్దన్న వారే నేడు కావాలంటున్నారు: మెట్రోరైల్ ఎండి ఎన్‌విఎస్ రెడ్డి

హైదరాబాద్ మెట్రో రైల్ రెండో దశ విస్తరణ పనులు త్వరలోనే ప్రారంభించబోతున్నట్లు మెట్రోరైల్ ఎండి ఎన్‌విఎస్ రెడ్డి తెలిపారు. మంగళవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రపంచంలో ప్రప్రథమంగా పిపిపి మోడల్ లో విజయవంతంగా హైదరాబాద్ మెట్రో మొదటి దశ చేయగలిగామన్నారు. ప్రపంచంలో చాలా దేశాలతో పాటు మన దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఈ విధానం ఉన్నప్పటికీ పూర్తి స్థాయిలో విజవంతం కాలేకపోయిందని ఆయన తెలిపారు. ఇక, మొదటి దశలో 69 కిలో మీటర్లలో 57 స్టేషన్లు ఉన్నాయని, మియాపూర్ నుంచి ఎల్‌బి నగర్ మధ్య 29 కిలోమీటర్లు, జెబిఎస్ నుంచి ఎంజిబిఎస్ మధ్య 11 కి.మీటర్లు, నాగోల్ నుంచి రాయదుర్గం మధ్య 29 కిలోమీటర్లు మొదటి దశలో ఉందన్నారు.

ఒకప్పుడు మెట్రో వద్దని నగరంలో అనేక ఆందోళనలు జరిగాయని, తన దిష్టిబొమ్మలు దగ్ధం చేశారని కానీ ఇప్పుడు వారే మెట్రో కావాలని అడుగుతున్నారని దిష్టి బొమ్మలు కాల్చిన వారు.. ఈరోజు సన్మానాలు చేస్తున్నారని తన పుస్తకంలో రాశానని మెట్రో రైల్ ఎండి ఎన్‌విఎస్ రెడ్డి పేర్కొన్నారు. గతంలో ఢిల్లీ తర్వాత హైదరాబాద్ మెట్రో రెండవ స్థానంలో ఉండేదని, దురదృష్టవశాత్తు మనం గత కొన్నేళ్లుగా రెండో దశ పనులు ప్రారంభించుకోలేక పోయామని, దీంతో మనం మూడవ స్థానికి పడిపోయామని తెలిపారు. బెంగుళూరు, ఇతర నగారాల్లో చాలా వేగంగా దశలవారిగా పనులు జరుగుతున్నాయని తెలిపారు. ఈ విషయాన్ని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించానని, రెండవ దశ పనులు ప్రారంభం చేయకపోతే మరింత వెనక్కు పోతామని తెలిపినట్లు పేర్కొన్నారు. ముఖ్యమంత్రితో సహకారంతో పకడ్బందీ ప్రణాళికతో ముందుకు వెళ్దామన్నారని తెలిపారు. సామాన్య ప్రజలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో మెట్రో అభివృద్ధి చేయాలని సిఎం సూచించారని, అభివృద్ధి అంటే కేవలం పశ్చిమ దిక్కు మాత్రమే కాదు నగరం మొత్తం ఉండాలని సిఎం చెప్పారన్నారు.

మెట్రో రెండో దశలో 76.4 కిలో మీటర్లు 5 కారిడార్లలో చేపట్టడానికి ప్రతిపాదనలు సిద్దం చేసి కేంద్ర ఆమోదం కోసం పంపించినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం 90 శాతం ఆర్‌ఓడబ్లు ఉంటేనే ఆ ప్రతిపాదనలు స్వీకరిస్తుందని చెప్పారు. ఒక్కో చోట ఫ్లై ఓవర్ కొన్ని చోట్ల ఫ్లై ఓవర్ పై నుంచి మెట్రో రైల్ ను ఏర్పాటు చేసేలా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు ఎండి ఎన్‌విఎస్ రెడ్డి తెలిపారు. నాగోల్ నుండి శంషాబాద్ 36.8 కిలో మీటర్లు, రాయదుర్గం నుండి కోకపేట్ 11. 6 కిలోమీటర్లు, ఎంజిబిఎస్ నుండి – చాంద్రాయణగుట్ట 7.5 కి.మీ.. మియాపూర్ నుంచి పటాన్ చెరువు 13.4 కిలోమీటర్లు, ఎల్‌బినగర్ నుంచి హయత్ నగర్ 7.1 కిలోమీటర్లు , చంద్రాయణగుట్ట వద్ద జంక్షన్ ఏర్పాటు చేసే అవాకాశం ఉందని తెలిపారు. హైదరాబాద్ రోజురోజుకి విస్తరిస్తోందని, హయత్ నగర్ నుంచి పఠాన్ చెరువు మధ్య 50 కిలో మీటర్ల దూరం ఉంటుందన్నారు. ఇదంతా ఒకే కారిడార్ కిందకు రాబోతుందని తెలిపారు. దీంతో మెట్రో ట్రాఫిక్ విపరీతంగా పెరుగుతుంది ఎన్‌విఎస్ రెడ్డి తెలిపారు.

జనరల్ ట్రాఫిక్ చాలా వరకు తగ్గుతుందని తెలిపారు. సమయం కూడా తగ్గుతుందన్నారు. ఎయిర్ పోర్ట్ కారిడార్, నాగోల్ నుండి శంషాబాద్ విమానాశ్రయం యావరేజ్ స్పీడ్ 35 కిలోమీటర్లు ఉంటుందని వెల్లడించారు. మొత్తం 24 స్టేషన్లు ఉంటాయన్నారు. రాయదుర్గం నుంచి కోకపేట్ మధ్య 11.6 కిలో మీటర్ల మేర దూరం ఉండనుంది. ఇందులో 8 స్టేషన్లు ఉంటాయని, ఎంజిబిఎస్ నుంచి చంద్రాయణ్ గుట్ట మధ్య 7.5 కిలో మీటర్ల దూరానికి 6 స్టేషన్లు ఉండనున్నాయని వెల్లడించారు. శాలిబండ పేరు పైన కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేశారని షా అలి బండ అని పెట్టామన్నారని తెలిపారు. ప్రజల నుంచి అభిప్రాయాల సేకరణ చేస్తున్నామన్నారు. అందరి అభిప్రాయాలతో ఏదీ బాగుంటే అదే పేరు పెడుదామన్నారు. మియాపూర్ నుంచి పఠాన్ చెరువు మధ్య 10 స్టేషన్లతో 13.4 కిలో మీటర్ల దూరం ఉంటుందని, ఇక్కడ డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్ రానుందని ఎండి తెలిపారు.

కేవలం 1.6 కి.మీ వరకు ప్లాన్ చేస్తున్నామన్నారు. ఎల్‌బి నగర్ నుంచి హయత్ నగర్ 7.1 కిలో మీటర్లకు 6 స్టేషన్లు ఉండనున్నాయని, దీంతో పాటు ఎయిర్ పోర్ట్ ప్రాంతంలో 1.6 కిలోమీటర్ అండర్ గ్రౌండ్ మెట్రో రానుందని ఎంవిఎస్ రెడ్డి తెలిపారు. పాతబస్తీ మెట్రో ప్రభుత్వమే చేపడుతోందన్నారు. మెట్రో దిగటానికి ఎక్కడానికి కూడా ఇంకా ఎక్కువ వెసులుబాటు సౌకర్యాలు కల్పించబోతున్నామని, ఎయిర్ పోర్ట్ కారిడార్ 3లక్షల 70 వేల మంది ప్రయాణం చేసే అవకాశం ఉందని తెలిపారు. మియాపూర్ నుంచి పఠాన్ చెరువు రూట్ లో 1.70 లక్షల వరకు ప్రయాణం చేసే అవకాశాలు ఉన్నాయన్నారు. మెడ్చల్ వైపు మెట్రో విస్తరణకు డిమాండ్ ఉందని తెలిపారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బోనస్ ఇచ్చి ధాన్యం కొంటున్నట్టు రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో గప్పాలు కొట్టాడు అన్న హరీశ్ రావు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular