Saturday, September 14, 2024

Cyber Crime Racket: ‘ఖాకీ’ సైబర్​ క్రైం థిల్లర్​

  • హైదరాబాద్​ పోలీసులా మజాకా
  • గుజరాత్​లో​ జల్లెడపట్టి రూ.వెయ్యికోట్లు కాజేసిన నిందితుల అరెస్టు

ఓ చోరీ కేసును ఛేదించేందుకు మద్రాస్ పోలీసులు రాజస్థాన్ భరత్ పూర్ వెళ్తారు. అక్కడ నిందితుల ఆచూకీ కోసం తీవ్రంగా గాలిస్తారు. నిద్రాహారాలు మాని రోజుల తరబడి తిష్ట వేసి చివరికి నిందితులను పట్టుకుంటారు. ఇదంతా కార్తీ నటించిన ఖాకీ సినిమా కథ. ఇదే తరహాలో సైబర్‌ నేరాల్లో దేశవ్యాప్తంగా రూ. వెయ్యికోట్లు కాజేసిన నేరగాళ్ల కోసం 40 మంది హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు గుజరాత్‌ను జల్లెడ పట్టారు. 36 మందిని అరెస్టు చేసి రాష్ట్రానికి తీసుకొచ్చారు. అక్కడి నేరగాళ్ల ఎత్తులు పోలీసులను విస్మయానికి గురిచేశాయి.

సైబర్‌ మాయగాళ్లు కాలర్‌ నలగకుండా కోట్లు రుపాయలు కొల్లగొడుతున్నారు. పోలీసులకు సవాల్‌ విసురుతున్నారు. మోసాలపై ప్రజల్లో అవగాహన పెరిగే కొద్దీ కొత్తదారులు వెతుకుతున్నారు. హైదరాబాద్‌ మహానగరంలోని మూడు పోలీసు కమిషనరేట్ పరిధిలో రోజుకు దాదాపు 50 నుంచి 60 ఫిర్యాదులు సైబర్‌ ఠాణాలకు వస్తున్నాయని సమాచారం. ప్రతి నెలా దాదాపు రూ. 120 కోట్లకుపైగా కొట్టేస్తున్నట్లు దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. కేసు నమోదుకాగానే అనుమానిత బ్యాంకు ఖాతాల లావాదేవీలను పోలీసులు స్తంభింపజేస్తున్నారు.

ఫోన్లు, ల్యాప్‌ట్యాప్‌ల ఐపీ అడ్రసు ద్వారా నేరగాళ్లను గుర్తించి వారి ఆటకట్టిస్తున్నారు. తాజాగా దేశవ్యాప్తంగా 1000 కోట్ల రుపాయలను మోసం చేసిన సైబర్ నేరగాళ్లను పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్‌లో నమోదైన 20 కేసుల ఆధారంగా గుజరాత్ వెళ్లిన పోలీసులు, 36 మంది నిందితుల్ని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కీలక ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేసిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచారు. గుజరాత్‌లో చాలామందికి షేర్‌మార్కెట్‌పై అవగాహన ఉంటుంది. వయోభేదం లేకుండా రోజూ ట్రేడింగ్‌ చేస్తుంటారు. తమ అనుభవాన్ని అస్త్రంగా మలచుకున్న కొందరు, సైబర్‌నేరాలను వృత్తిగా మలచుకున్నారని పోలీసులు గుర్తించారు.

టెలీకాలర్స్‌ ద్వారా మోసాలు : హరియాణా, దిల్లీ, రాజస్థాన్, యూపీ, మధ్యప్రదేశ్‌ తదితర ప్రాంతాల్లోని మాయగాళ్లు లక్షలపై గురిపెడితే గుజరాత్‌ బ్యాచ్‌లు కోట్లు కొల్లగొట్టేలా దందా సాగిస్తున్నారు. బ్యాంకు లావాదేవీలు, ఆదాయపన్ను, కస్టమ్స్, జీఎస్టీ తదితర అంశాల్లో వీరికున్న పరిజ్ఞానంతో తేలికగా బురిడీ కొట్టిస్తున్నారు. నకిలీ వెబ్‌సైట్లు, యాప్‌లను రూపొందించి టెలిగ్రామ్‌ యాప్‌ వేదికగా ఇన్వెస్ట్‌మెంట్, ఫెడెక్స్‌ పార్సిల్, షేర్‌ మార్కెట్‌లో లాభాల పేర్లతో నెలకు 500 కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నట్టు అంచనా వేశారు. గతంలో నకిలీ కాల్‌సెంటర్లు ఏర్పాటు చేసి టెలీకాలర్స్‌ ద్వారా మోసాలు సాగించే ముఠాలు తాజాగా రూటు మార్చారని పోలీసుల విచారణలో తేలింది.

పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు తమ నివాసాలకు దూరంగా ఉండే క్రీడామైదానాలు, పార్కులను వేదికగా మలచుకున్నారు. ఒక్కొక్కరు రెండు ఫోన్లు, ల్యాప్‌ట్యాప్‌లతో ఎంచుకున్న ప్రదేశానికి వెళ్తారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఫోన్లు, బ్యాంకు లావాదేవీలు పూర్తి చేస్తారు. అక్కడే ఫోన్లు స్విచ్చాఫ్‌ చేసి ఇంటికి చేరతారు. చిరునామా తెలియకుండా ఏమార్చేందుకు ఈ దొంగాట ఆడుతున్నట్టు పోలీసులు గుర్తించారు. దేశ, విదేశాల్లో ఏమూలకైనా ఎన్ని కోట్ల రూపాయల సొమ్మైనా చేర్చగల సత్తా గుజరాత్‌ హవాలా ముఠాలకు మాత్రమే ఉంటుంది. అంతర్జాతీయంగా వీరికున్న సంబంధాలతో కొట్టేసిన సొమ్మును తేలికగా దేశ సరిహద్దులు దాటిస్తున్నారు.

టెలీగ్రామ్‌ ద్వారా ఏజెంట్లను ఏర్పాటు : టెలీగ్రామ్‌ యాప్‌ ద్వారా ఏజెంట్లను ఏర్పాటు చేసుకొని కూలీలు, నిరుద్యోగులు, చిరువ్యాపారులకు కమీషన్‌ ఆశ చూపి షెల్‌ కంపెనీల పేర్లతో బ్యాంకు ఖాతాలు తెరిపిస్తున్నారు. డెబిట్‌కార్డు, సిమ్‌కార్డులను స్వాధీనం చేసుకుంటున్నారు. బాధితుల నుంచి సొమ్ము ఖాతాల్లో జమ కాగానే తమ వద్దనున్న డెబిట్‌కార్డు, చెక్‌బుక్‌లతో బ్యాంకుల నుంచి నగదు విత్‌డ్రా చేస్తున్నారు. ఆ సొమ్మును హవాలా ముఠాలకు అందజేసి క్రిప్టోగా మార్పించి చైనా, సింగపూర్, థాయ్‌లాండ్‌, సౌదీ అరేబియా తదితర దేశాలకు చేరవేస్తున్నారని అధికారులు గుర్తించారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం కుట్రే... ఇందులో జ‌గ‌న్ పాత్ర ఉంది అన్న వర్ల రామయ్య వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular