కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి నేతలు పెరుగుతున్నారు. మంత్రుల మీద ఎమ్మెల్యేలు ఆగ్రహంతో ఉంటే.. సీఎం మీద మంత్రులు మండిపడుతున్నారు. తమకు తామే ఏరికోరి విమర్శలు తెచ్చుకుంటున్నామంటూ సీఎం రేవంత్‌రెడ్డిపై ఫైర్ అవుతున్నారు. దీంతో మంత్రులు హస్తినలో మకాం వేశారు. మరోవైపు ఇప్పటికే 16 మంది ఎమ్మెల్యేలు ఓ మంత్రిపై తిరుగుబాటు చేస్తుండటంతో.. వారందరినీ హైదరాబాద్‌కు పిలిచి మాట్లాడుతున్నారు. దీంతో కాంగ్రెస్‌లో రాజకీయ పరిస్థితి ఆగమాగంగా మారింది. ఇప్పటికే ఓ మంత్రి నేరుగా బెంగళూరు వెళ్లి.. అక్కడ డీకే శివ కుమార్‌తో భేటీ అయి.. అటు నుంచి ఢిల్లీకి వెళ్లారు. అక్కడ ఏఐసీసీ చీఫ్ ఖర్గేతో సమావేశమై.. సీఎంపై ఫిర్యాదు చేశారు. దీంతో సీఎం కూడా హస్తినకు పయనమయ్యారు. రాష్ట్ర రాజకీయాలు ఇప్పుడు ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నాయి.
అధికార పార్టీలో సెగలు చల్లారడం లేదు. ఈ అసమ్మతి సెగలు బెంగళూరు నుంచి ఢిల్లీ వరకు చేరుకున్నాయి. సీఎం రేవంత్ కి వ్యతిరేకంగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను మంత్రి జూపల్లి, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కలిసినట్లుగా తెలుస్తోంది. బుధవారం రాత్రి బెంగుళూరులో కృష్ణ, తుంగభద్రకు నీటి విడుదల విషయమై వీరంతా అక్కడికి వెళ్లి ఖర్గేను కలిశారు. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేను తీసుకొస్తే కనీసం తనకు ప్రాధాన్యం కూడా ఇవ్వడం లేదని కనీసం తనకు సహకరించడం లేదంటూ ఖర్గే వద్ద మంత్రి జూపల్లి వాపోయారని సమాచారం. నిజానికి, గురువారం మద్యాహ్నం పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సీఎం రేవంత్ రెడ్డి, దీపాదాస్ మున్షీ మీటింగ్ ఉండగా.. కొందరు ఎమ్మెల్యేలతో బెంగళూరు వెళ్లిన జూపల్లి.. అటు నుంచి ఢిల్లీకి వెళ్లి ఖర్గేను కలిసి గోడు వెళ్లబోసుకున్నారు. మరోవైపు గద్వాల నియోజకవర్గంలో తనకు ప్రాధన్యత ఇవ్వకుండా సరితా తిరుపతయ్యకు ప్రాధాన్యం ఇస్తున్నారని ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి ఖర్గే వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. తన నియోజకరవర్గంలో ఉప ఎన్నికలు వస్తే తన పరిస్థితి ఏంటని ఎమ్మెల్యే అయోమయం వ్యక్తం చేశారు. జూపల్లి వెంట ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్ రెడ్డితో సహా ఎమ్మెల్యేలు వాకిటి శ్రీహరి, గవినోళ్ల మధుసూదన్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ వెళ్లారు.
ఇక్కడ సీఎం మీటింగ్
గ్రెస్ శాసనసభాపక్షం గురువారం సమావేశమైంది. హైదరాబాద్ లోని మర్రి చెన్నారెడ్డి మానవవనరుల కేంద్రంలో సీఎం రేవంత్ అధ్యక్షతన ఈ భేటీ జరిగింది. ఎమ్మెల్సీ ఎలక్షన్స్, స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు, కులగణన, ఎస్సీ వర్గీకరణను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై ప్రధానంగా ఈ భేటీలో చర్చించినట్లు చెప్పుతున్నారు. ఇటీవల అసంతృప్త ఎమ్మెల్యేల భేటీ అంశాన్ని కూడా ఈ మీటింగ్ లో ప్రస్తావించారు. రాష్ట్ర ఇంఛార్జి దీపాదాస్ మున్షీ, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఈ సమావేశంలో ఉన్నారు.
ఢిల్లీకి సీఎం
గురువారం సాయంత్రం సీఎం రేవంత్ ఢిల్లీకి వెళ్తున్నారు. రెండు రోజుల పాటు హస్తినలో ఉండనున్నారు. సీఎంతోపాటు మరి కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఢిల్లీకి వెళ్తున్నారు. ఈసారి కచ్చితంగా కేబినెట్ విస్తరణ ఖాయమనే ప్రచారం ఆ పార్టీ నేతల్లో బలంగా ఉంది. అందుకే ఈసారి ఎమ్మెల్యేలు అటు వైపు ఫోకస్ చేశారు. ఓవైపు ఈ ప్రచారం జరుగుతుండగా.. మరోవైపు అసంతృప్తి నేతల ఫిర్యాదుల మేరకు ఆయన ఢిల్లీకి వెళ్తున్నారని అంటున్నారు. అయితే, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు శనివారం వెల్లడికానున్నాయి. ఈ క్రమంలో పార్టీ హైకమాండ్ నుంచి సీఎం రేవంత్‌రెడ్డికి పిలుపు వచ్చింది. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌తో కలిసి హస్తినకు సీఎం వెళ్తున్నారు. శుక్ర, శనివారాల్లో అక్కడే ఉండనున్నారు. గురువారం రాత్రికి పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో భేటీ కానున్నారు. ఈ సమావేశానికి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్, ఇన్‌ఛార్జ్ దీపాదాస్ మున్షీ పాల్గొంటారు. అసెంబ్లీ తీర్మానం చేసిన బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ అంశాలపై పార్టీ పెద్దలతో కలిసి చర్చించనున్నారు. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి షమీమ్ అక్తర్ కమిటీ రిపోర్టు తెలంగాణ ప్రభుత్వానికి అందజేసింది. దాన్ని ప్రభుత్వం ఆమోదించింది. దీనిపై అధిష్ఠానానికి వివరాలు వెల్లడించనున్నారు. రిపోర్టు నేపథ్యంలో ఏ విధంగా ముందుకెళ్లాలని అనేదానిపై పార్టీ పెద్దలతో చర్చించనున్నారు.
శుక్రవారం ఉదయం అగ్రనేత రాహుల్‌గాంధీ, సోనియాగాంధీలతో సమావేశం కానున్నారు. తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి గురించి అధిష్టానానికి వివరించనున్నారు. వారిచ్చిన సలహాలు, సూచనల మేరకు తదుపరి అడుగులు వేయనున్నారు. అదే సమయంలో పెండింగ్‌లో ఉన్న కేబినెట్ విస్తరణ, పార్టీ పదవులపై చర్చించే అవకాశమున్నట్లు గాంధీభవన్ వర్గాల మాట. తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడి 14 నెలలు గడుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీకి వెళ్లిన ప్రతీసారి విస్తరణ జరగడం ఖాయమని చాలామంది నేతలు ఆశలు పెట్టుకున్నారు. ఈసారి కొలిక్కి రావడం ఖాయమని అంటున్నారు. ప్రస్తుతం నేతలంతా ఢిల్లీలో ఉండడమే దీనికి కారణంగా చెబుతున్నారు.