Wednesday, April 2, 2025

విద్యార్థుల భూ పోరాటం

రణరంగంగా హెచ్‌సీయూ

హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ విద్యార్థులు భూ పోరాటానికి దిగారు. అక్కడి 400 ఎకరాలను ప్రభుత్వం అమ్మకానికి పెట్టడంతో భూ వివాదం రాజుకున్నది. దీంతో విశ్వ విద్యాలయం రణరంగంగా మారింది. విద్యార్థుల నినాదాలు, ఆందోళనలు.. పోలీసుల లాఠీ దెబ్బలతో హెచ్‌సీయూ ప్రాంతం దద్దరిల్లింది. దీనిపై ఇటు విద్యార్థులు అటు ప్రభుత్వం వెనక్కి తగ్గకపోవడంతో యూనివర్సిటీ మొత్తం పోలీసుల వలయంలో చిక్కింది. తాజాగా విద్యార్థులపై లాఠీచార్జ్‌ చేయడంతో.. భూముల లొల్లి ముదిరిపోయింది. అటు విపక్షాలు సైతం విద్యార్థులకు అండగా నిలుస్తున్నారు. బీజేపీ ఎంపీలు కేంద్రానికి ఫిర్యాదు చేశారు. రాష్ట్ర మంత్రుల్లో కీలకమైన ఇద్దరు హెచ్‌సీయూ పూర్వ విద్యార్థులే కావడంతో.. వారిపై విద్యార్థుల డిమాండ్‌ పెరిగిపోయింది. మొత్తంగా సెంట్రల్‌ యూనివర్సిటీ భూ పోరాటాలతో హీటెక్కింది.

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 400 ఎకరాల భూమిపై వివాదం రాజుకుంటున్నది. విద్యార్థుల ఆందోళనలు, పోలీసుల లాఠీఛార్జ్‌తో విశ్వ విద్యాలయం రణరంగంగా మారింది. ఇప్పుడు యూనివర్సిటీ మొత్తం పోలీసులతో నిండిపోయింది. ఈ భూముల వ్యవహారంపై గత కొంత కాలంగా విద్యార్దులు ఆందోళనలు చేస్తున్నారు. యూనిర్సిటీ క్యాంపస్ లోపలే ప్రతీ రోజూ నిరసనలు తెలుపుతున్నారు. తాజాగా నిరసనలు తారాస్దాయికి చేరాయి. జేసిబిలు క్యాంపస్ లోపలికి రావడం, వివాదాస్పద భూముల్లో చెట్లను తొలగించేందుకు సిద్దమవ్వడంతో విద్యార్దులు అడ్డుకున్నారు. విద్యార్ది సంఘాల ఆధ్వర్యంలో భారీగా చేరుకున్న విద్యార్దులు జేసిబిలను వెనక్కు పంపే ప్రయత్నం చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. విద్యార్దులను బలవంతంగా అదుపులోకి తీసుకోగా.. ఈ వివాదంలో లాఠీఛార్జీ కూడా చేశారు. తాజాగా హెచ్‌సీయూ భూములపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఆ 400 ఎకరాలు ప్రభుత్వానిదేనని తేల్చిచెప్పింది. తాము తీసుకున్న ప్రాజెక్టులో హెచ్‌సీయూ భూమలు లేవని తెలిపింది. 21 ఏళ్ల క్రితం ప్రైవేటు సంస్థలకు కేటాయించిన భూమిని న్యాయపోరాటం ద్వారా దక్కించుకున్నట్లు వివరించింది. అనవసరంగా విద్యార్థులను తప్పుదోవ పట్టించొద్దని, వేలం, అభివృద్ధి పనులు అక్కడి రాళ్లను దెబ్బతీయవని హామీ ఇచ్చింది. అలాగే ఈ భూముల్లో చెరువు కూడా లేదని స్పష్టం చేసింది.

వివాదం ఇది
హెచ్‌సీయూ భూముల వేలాన్ని ఆపేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు గత కొన్ని రోజులుగా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆదివారం బుల్డోజర్లు వర్సిటీ ప్రాంతంలో భూమిని చదును చేస్తుండగా విద్యార్థులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు చెలరేగాయి. పోలీసులు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు బీఆర్‌ఎస్, బీజేపీ నాయకులు కూడా హెచ్‌సీయూ విద్యార్థులకు మద్దతుగా నిలుస్తున్నారు. ఎస్‌ఎఫ్‌ఐ కూడా విద్యార్థులను అరెస్టు చేయడాన్ని ఖండించింది. హెచ్‌సీయూలో వర్సిటీ భూములను ఏదో ఒక సాకుతో ప్రభుత్వం వెనక్కి లాక్కుంటోందని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. వర్సిటీ ఏర్పడ్డాక దాదాపు 50 ఏళ్లలో 500 ఎకరాల భూమిని లాక్కున్నట్లు విద్యార్థులు చెబుతున్నారు. 2300 ఎకరాల్లో హెచ్‌సీయూను ఏర్పాటు చేయగా.. ఇప్పడు యూజీసీ లెక్కల ప్రకారం 1800 ఎకరాలు మాత్రమే ఉందని ఆరోపణలు చేస్తున్నారు.

మళ్లీ ఇప్పుడు టీజీఐఐసీ ద్వారా 400 ఎకరాలను వేలం వేసేందుకు ప్రభుత్వం నిర్ణయించడంతో విద్యార్థి సంఘాలు, వర్కర్లు, టీచింగ్, నాన్‌టీచింగ్‌ సిబ్బంది ఆందోళనకు దిగారు. అయితే ఈ స్థలం హెచ్‌సీయూది కాదని.. కోర్టు ఇచ్చిన తీర్పు మేరకే 400 ఎకరాల భూమిని టీజీఐఐసీకి అప్పగించినట్లు ప్రభుత్వం చెప్పింది. ఇది పూర్తయితే హెచ్‌సీయూలో ఇక మిగిలేది 1400 ఎకరాలు మాత్రమే. హెచ్‌సీయూ పూర్వ విద్యార్థులైన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఐటీ మంత్రి శ్రీధర్‌ బాబు ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని, హెచ్‌సీయూ భూములు వర్సిటీకే చెందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. హెచ్‌సీయూ చుట్టూ ఐటీ కారిడర్ ఉండటం వల్ల ఈ భూములను విక్రయిస్తే భారీగా ఆదాయం వచ్చే ఛాన్స్ ఉందని, ఈ 400 ఎకరాలను విక్రయిస్తే దీని మార్కెట్‌ విలువ ప్రకారం రూ.10 వేల కోట్లు వస్తుందని ప్రభుత్వం అంచనా వేసినట్లు విద్యార్థులు ఆరోపిస్తున్నారు.

ప్రభుత్వం ఏం చెప్తున్నది..?
విద్యార్థుల ఆందోళన, విపక్షాల మద్దతుతో ఈ భూముల వ్యవహారం భగ్గుమంటున్నది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఆ 400 ఎక‌రాల భూమి ప్ర‌భుత్వానిదేనని, ప్రాజెక్టులో సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీ భూమి లేదని వివరణ ఇచ్చింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంప‌ల్లి మండ‌లం కంచె గ‌చ్చిబౌలిలోని 400 ఎక‌రాలపై యాజ‌మాన్యం త‌న‌దేన‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేస్తోంది. 2004లో నాటి ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని రాష్ట్ర ప్ర‌భుత్వం ఒక ప్రైవేటు సంస్థ‌కు ఈ భూమిని కేటాయించిందని, దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానం సుప్రీంకోర్టులోని కేసుల్లో చ‌ట్ట‌ప‌రంగా గెల‌వ‌డం ద్వారా తెలంగాణ‌లోని కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఆ భూమిపై యాజ‌మాన్యాన్ని ద‌క్కించుకుందని, ఆ భూమికి సంబంధించి సృష్టించే ఎటువంటి వివాద‌మైనా కోర్టు ధిక్క‌ర‌ణ కింద‌కు వ‌స్తుందని ప్రభుత్వం పేర్కొంది.

కోర్టు ఆదేశాలతో తాము చేసిన స‌ర్వేలో ఒక్క అంగుళం భూమి కూడా యూనివ‌ర్సిటీ ఆఫ్ హైద‌రాబాద్ (సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీ)ది కాద‌ని తేలిందని, ఈ భూమిలో ప్ర‌భుత్వం చేప‌ట్టే అభివృద్ధి ప్ర‌ణాళిక‌లో ఏ చెరువు (లేక్‌) లేదని, కొత్త‌గా చేప‌డుతున్న అభివృద్ధి ప్ర‌ణాళిక‌ అక్క‌డ ఉన్న రాళ్ల రూపాలను దెబ్బ‌తీయ‌దని స్పష్టత ఇచ్చింది. ప్ర‌భుత్వం చేప‌డుతున్న ప్ర‌తి ప్ర‌ణాళిక‌లో స్థానిక సుస్థిరాభివృద్ధి… ప‌ర్యావ‌ర‌ణ అవ‌స‌రాల‌కు అత్య‌ధిక ప్రాధాన్యం ఇస్తోందని, ప్ర‌స్తుత ప్రాజెక్ట్ ను వ్య‌తిరేకించే వారంతా కొంద‌రు రాజ‌కీయ నాయ‌కులు, స్థిరాస్తి వ్యాపారుల‌ (రియ‌ల్ ఎస్టేట్‌) ప్ర‌యోజ‌నాల‌కు అనుగుణంగా విద్యార్థుల‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.

ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందా..?
హైదరాబాద్ సెంట్రల్ యూనిర్సిటీ లో 400 ఎకరాల వివాదాస్పద భూములపై ప్రభుత్వం వాదన మరోలా ఉంది. ఈ భూములకు , సెంట్రల్ యూనివర్సిటీకి అస్సలు సంబంధంలేదంటున్నారు. కంచె గచ్చిబౌలిలోని సర్వేనెంబర్ 25లో ఉన్న 400 ఎకరాల భూములు 2003లోనే అప్పటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం ఐఎంజీ అకాడమీస్ ఏర్పాటుకు కేటాయించింది. ఆ భూముల్లో అప్పట్లో ప్రాజెక్టు ప్రారంభించపోగా, నిబంధనలు ఉల్లంఘించడంతో 2006లోని కాంగ్రెస్ ప్రభుత్వం ఐఏంజీకి కేటాయించిన జీవోను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జీవో రద్దుపై ఐఏంజీ భారత్ హైకోర్టును ఆశ్రయించగా 2024 మార్చి 7న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్దిస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. తిరిగి హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ ఐఏంజీ భారత్ సుప్రీం కొోర్టుకు వెళ్లింది. 2024 మే 3న ఐఏంజీ భారత్ పిటీషన్ ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. దీంతో ఎట్టకేలకు సెంట్రల్ యూనివర్సిటిలోని 400 ఎకరాలు భూములు తిరిగి రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి వచ్చాయని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నది. అంతేకాదు ఈ భూములకు అటవీశాఖకు అస్సలు సంబంధంలేదంటోంది.

వివాదాస్పద భూముల్లో ప్రభుత్వ ప్లాన్‌ ఏమిటీ
గత ఏడాది సుప్రీం కోర్టు తీర్పుతో భూములపై హక్కులు సొంతం చేసుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2024 జూన్ 26న టిజిఐఐసికి ఈ భూములు కేటాయిస్తూ రెవెన్యూశాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఈ భూముల్లో పికాక్ లేక్ , బఫెలో లేక్ వంటివి లేవని స్పష్టం చేసిన రాష్ట్ర ప్రభుత్వం, ఈ 400 ఎకరాల భూముల్లో ఐటీ కంపెనీల ఏర్పాటుతోపాటు ప్రపంచస్దాయి మౌళిక సదుపాయాలు కల్పించేందుకు సిద్దమైయ్యింది. ప్రతిపక్షాలు మాత్రం విద్యార్దుల ఆందోళనలకు మద్దతు తెలుపుతున్నాయి. కేంద్రం దృష్టికి సమస్యను తీసుకెళ్లడంతోపాటు విద్యార్దుల డిమాండ్ రాష్ట్రం ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలిని కోరుతున్నప్పటికీ ,రాష్ట్ర ప్రభుత్వం ఎవరెలా స్పందించినా మేము మాత్రం భూముల విషయంలో వెనక్కు తగ్గబోమంటూ తేల్చి చెప్పేస్తోంది.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com