మొన్న మియాపూర్‌లో 342.. ఇప్పుడు సనత్ నగర్ లో 431.. హైదరాబాద్ నగరంలో వాయు కాలుష్యం కాస్త ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే ఢిల్లీలో వాయుకాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకోగా.. అక్కడ ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పుడు తెలంగాణ రాజధాని అయిన హైదరాబాద్ నగరంలోనూ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ వాల్యుస్ ఆందోళన కలిగిస్తున్నాయి. ఉదయం నుంచి రాత్రి సమయం వరకు వాయు కాలుష్యం విపరీతంగా పెరుగుతున్నది. ఇటీవల కొన్ని నిర్మాణాలతో మియాపూర్‌లో ఎయిర్ క్వాలిటీ 342గా సూచించగా.. ఇప్పుడు సనత్‌నగర్‌లో ఏకంగా 431 ఏక్యూఐ నమోదు కావటం ఆందోళనకరంగా మారింది.
హైదరాబాద్ డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీలో వాయుకాలుష్యంతో.. పరిస్థితి ఆందోళనకరంగా మారగా.. ఇప్పుడు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలోనూ ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా.. సనత్ నగర్‌లో పరిస్థితులు మరీ దారుణంగా మారాయి. సనత్‌నగర్‌లోని ఎయిర్ క్వాలిటీ ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ఏకంగా 431 ఏక్యూఐ (Air Quality Index) నమోదుకాగా.. క్రమంగా ఈ లెవెల్స్ తగ్గుతూ వచ్చినట్టు టీటీపీసీబీ తెలిపారు.
మరోవైపు.. నగరంలో సగటున 108 ఏక్యూఐ నమోదైనట్టు అధికారులు తెలిపారు. మరోవైపు.. జూపార్క్‌లో 135, పటాన్ చెరువులో 112 తప్ప గ్రేటర్లో గాలి నాణ్యతను సూచించే 14 స్టేషన్లలో ఎక్కడా 100 ఏక్యూఐ దాటలేదని అధికారులు స్పష్టం చేశారు. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్లో గాలి నాణ్యత 0 నుంచి 50లోపు నమోదైతే ఆ గాలి స్వచ్ఛంగా ఉన్నట్టని.. అదే 51 నుంచి 100 వరకు ఉంటే గాలి నాణ్యత సంతృప్తికర స్థాయిలో ఉందని తెలిపిన అధికారులు.. 101 నుంచి 200 మధ్య ఉంటే కాస్త అనారోగ్యకరమని, 200 నుంచి 300 వరకు ఉంటే పూర్ క్వాలిటీ అని, 301 నుంచి 400 వరకు ఉంటే వెరీ పూర్ క్వాలిటీ అని పేర్కొన్నారు. ఇక.. 401 నుంచి 500 వరకు ఉంటే మాత్రం అది అత్యంత ప్రమాదకర స్థాయి అని చెప్పుకొచ్చారు.
గతేడాది.. నవంబర్ 25వ తేదీన సనత్నగర్లో 298, డిసెంబర్లో 229, జనవరిలో 171 ఏక్యూఐ నమోదైంది. అయితే.. సనత్ నగర్ ఇండస్ట్రియల్ ప్రాంతం కావడంతో అక్కడ సాధారణంగానే అసాధారణ వ్యాల్యూస్ నమోదవుతుంటాయని అధికారులు తెలిపారు. అయితే.. ఎప్పుడూ లేనంతగా ప్రమాదకర స్థాయిలో వ్యాల్యూస్ నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది.
మియాపూర్‌లో తగ్గని ఎయిర్ క్వాలిటీ
ఇటు మియాపూర్‌లోనూ ఎయిర్ క్వాలిటీ తగ్గడం లేదు. ఇక్కడ రెండు నిర్మాణ సంస్థల కారణంగా ఏక్యూఐ విపరీతంగా పెరుగుతుంది. దీనిపై పీసీబీ అధికారులు కూడా ఇంకా నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారు.