20 మీటర్ల లోతుకు పడిపోయిన భూగర్భ జలాలు
హైదరాబాద్‌లో భూగర్భజలాలు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. ఏటికేడు పాతాళానికి పడిపోతున్న జలాలు ఈ జనవరి నుంచి మార్చి నెలాఖరులోపే చాలా ప్రాంతాల్లో 20 మీటర్ల కంటే ఎక్కువ లోతుకు చేరాయి. మే నాటికి మరింత పడిపోయే ప్రమాదం ఉందని భూగర్భజల శాఖ అంచనా వేస్తోంది. నగరంలో సాధారణం కన్నా అధికంగా వర్షపాతం నమోదైనా కాంక్రీట్ కట్టడాలతో ఆ వరద భూమిలోకి ఇంకే పరిస్థితి లేకపోవడం, విచ్చలవిడిగా బోర్ల తవ్వకం, చెరువులు, కుంటలు అన్యక్రాంతం కావడమే కారణమని భూగర్భజల శాఖ చెబుతోంది. వృథాగా పోతున్న 40 శాతం నీటిని ఒడిసిపడితే నీటిమట్టాలు పెరిగే అవకాశం ఉందని చెబుతోంది. రాష్ట్ర రాజధానిలో భూగర్భ జలాలు వేగంగా పడిపోతున్నాయి. పెరుగుతున్న ఉష్టోగ్రతలకి తోడువర్షపు నీటి సంరక్షణలో నిర్లక్ష్యం వల్ల గ్రేటర్ వ్యాప్తంగా భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. నగరంలో సగటు భూగర్భజల నీటిమట్టం 11.94 మీటర్లు కాగా గతేడాది మార్చి చివరి నాటికి 10.89 మీటర్ల లోతుకి చేరాయి. ఈసారి ఏకంగా 20 మీటర్లకు పడిపోయాయి. గ్రేటర్ పరిధిలో ఓఆర్ఆర్ వరకు ఉన్న 46 మండలాల్లో 57 ఫిజో మీటర్ల ద్వారా మార్చి నెలాఖరు నాటికి పరిస్థితిని రాష్ట్ర భూగర్భ జల శాఖ విశ్లేషించింది. ఈ పరిశీలనలో ఏటికేడు నగరంలో నీటిమట్టాలు గణనీయంగా పడిపోతున్నట్లు గుర్తించింది.
ఇక్కడ ప్రమాదకరం
కూకట్‌పల్లి, మల్కాజ్ గిరి, ఎల్బీనగర్ పరిధిలోని ప్రాంతాల్లో గతేడాది కంటే బాగా నీటి మట్టాలు తగ్గాయి. ఎస్సార్ నగర్, ఎర్రగడ్డ, చాంద్రయణగుట్ట, మారేడుపల్లి, డబీర్‌పురా, గండిపేట, మేడిపల్లి, చంగిచర్ల, హస్మత్‌పేట, గాజులరామారం, జీడిమెట్ల, కుత్బుల్లాపూర్, ఉప్పల్, రాజేంద్రనగర్, పటాన్‌చెరు, దూలపల్లి ప్రాంతాల్లో భూగర్భ జలమట్టాలు ప్రమాదకర స్థాయిలో పడిపోయాయి. ఒక నెలలోనే రెండు మీటర్లు అంతకంటే ఎక్కువగా పడిపోయిన ప్రాంతాలున్నాయి. కూకట్‌పల్లి జోన్‌లోని కైతలాపూర్‌లో భూగర్భజలాల పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. గతేడాది 11.34 మీటర్లు ఉండగా ఈ సారి ఏకంగా 27.89 మీటర్లకు పడిపోవడం శోచనీయం. ఈ ప్రాంతంలో అనేక భారీ నిర్మాణాలకు తోడు ప్రైవేట్ వ్యక్తులు అత్యంత లోతుకి బోర్లువేసి నీటిదందా చేస్తుండటంతో భూగర్భ జలాలు వేగంగా పడిపోతున్నాయి. మే వరకు ఇక్కడ పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉండే అవకాశం ఉందని భూగర్భజల శాఖ అంచనా వేస్తోంది.
బోర్లు వేయడంతోనే ఇదంతా
జీహెచ్‌ఎంసీ పరిధిలో సాధారణ వర్షపాతం 765 మిల్లీమీటర్లు కాగా మార్చి 31 నాటికి 873 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. 14 శాతం అధికంగా వర్షం కురిసినా చుక్కనీరు భూమిలోకి ఇంకడంలేదు. కురిసిన నీరంతా వరద కాలువల ద్వారా మూసీలోకి చేరి అక్కడి నుంచి నదుల్లో కలుస్తుంది. కాంక్రీట్ జంగిల్‌గా మారిన నగరంలో నివాస స్థలాలు సహా బహిరంగ ప్రదేశాలన్నింటిని కాంక్రీట్‌తో కప్పేయడం వల్ల వర్షపు నీరు భూగర్భ జలంగా మారడం లేదు. 120 అడుగులకు మించి బోరుబావులు తవ్వొద్దని వాల్టా చట్టం నిబంధన ఉన్నా బేఖాతరు చేస్తూ విచ్చలవిడిగా 400 నుంచి 2 వేల అడుగులలోతున బోర్లు వేస్తున్నారు. ఫలితంగా నీటి మట్టాలు గరిష్ఠ స్థాయిలో పడిపోతున్నాయని భూగర్భజలశాఖ అధికారులు చెబుతున్నారు. కూకట్‌పల్లి జోన్‌లో భారీ భవనాల నిర్మాణం వల్ల నీటి లభ్యత తగ్గిపోతుందని స్థానికులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. చెరువులు, కుంటలు కబ్జాలకు గురికావడం వల్ల వాననీరు నిలిచే పరిస్థితులు లేవని వాపోతున్నారు. ప్రతీ వేసవిలో బోర్లు ఎండిపోతుండటం వల్ల నీటి కోసం జనం వేలాది రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి. కోట్లు ఖర్చుచేసి నగరానికి జలమండలి నీళ్లు తెప్పిస్తున్నా ప్రజల అవసరాలు పూర్తిస్థాయిలో తీరటం లేదు. భూగర్భజలాల పెంపు కోసం ఇంకుడు గుంతలు, ఇంజక్షన్ బోర్ వెల్స్, రూప్ వాటర్ హార్వెస్టింగ్ లాంటి వాననీటి సంరక్షణ పద్దతుల పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.