Thursday, May 8, 2025

హైదరాబాద్ లోని ప్రధాన కూడళ్ళ వద్ద సివిల్ మాక్ డ్రిల్ ఇదో సన్నాహక చర్య- ఎవరూ భయపడవద్దు : సీవీ ఆనంద్

జమ్మూకశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రదాడితో భారత్ – పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తల నేపథ్యంలో హైదరాబాద్‌లో ”ఆపరేషన్ అభ్యాస్ ” పేరుతో అరగంట సేపు సివిల్ మాక్ డ్రిల్ నిర్వహించారు. బుధవారం సాయంత్రం 4 గంటలకు నగరంలోని ప్రధాన కూడళ్ళ వద్ద రెండు నిమిషాల పాటు సైరన్ మ్రోగించి మాక్ డ్రిల్స్ నిర్వహించారు. అనుకోని ప్రమాదాలు, ఉగ్రదాడులు, సహజ విపత్తులు వంటి సందర్భాల్లో ఎలా స్పందించాలి, ఎవరెవరు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశాలపట్ల ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ చర్యలను చేపట్టారు. హైదరాబాద్‌లోని నానల్ నగర్, కంచన్ బాగ్, సికింద్రాబాద్, ఈసీఐఎల్ ఎన్ఎఫ్ సి ప్రాంతాల్లో మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్, రెవెన్యూ, జీహెచ్‌ఎంసీ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పోలీస్, ఫైర్, విద్యుత్, ట్రాన్స్ పోర్టు సిబ్బంది మాక్ డ్రిల్‌లో పాల్గొన్నాయి. కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఉన్నతాధికారులు డ్రిల్‌ను పర్యవేక్షించారు. మాక్ డ్రిల్‌లో కొందరు సంఘవిద్రోహ శక్తులు కాల్పులు జరుపుతుండటం, ఒక భవనంలోకి వెళ్ళి కాల్పులు జరిపితే, అక్కడ ఉన్నవారిని సురక్షితంగా బయటకు తీసుకొస్తున్నట్లుగా సీన్ క్రియేట్ చేసి మాక్ డ్రిల్ ప్రదర్శించారు. అలాగే డీఆర్‌డీఏ కాలనీలోని 24 అంతస్థుల భవనంలో అత్యవసర పరిస్థితులు ఏర్పడితే ఎలా సురక్షితంగా బయటపడాలనే అంశాన్ని ప్రజలకు వివరించారు.

ఇదో సన్నాహక చర్య మాత్రమే – సీపీ సీవీ ఆనంద్

ప్రజల్లో అప్రమత్తత పెంచడానికి దోహదపడే విధంగా ఇదో సన్నాహక చర్య మాత్రమేనని, ఎవరు భయపడాల్సిన అవసరం లేదని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ వెల్లడించారు. హైదరాబాద్‌లో సివిల్ మాక్ డ్రిల్ పూర్తి అయిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పారిశ్రామిక సైరన్లు, పెట్రోల్ వాహనాల సైరన్లు, పోలీస్ సైరన్లు మోగించామని, సైరన్ మోగగానే ఎక్కడి వారు అక్కడే ఉండాలని సూచించామన్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి అన్ని రకాల సూచనలు ఇచ్చామన్నారు. నాలుగు ప్రాంతాల్లో వైమానిక దాడులు జరిగినట్టు సమాచారం అందించి, అన్ని శాఖల అధికారుల పనితీరు, స్పందన ఎలా ఉందో ఈ మాక్ డ్రిల్ ద్వారా గుర్తించామన్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్ఆర్ఎఫ్, రెవెన్యూ, జీహెచ్ఎంసీ, పురపాలక, పోలీస్, అగ్నిమాపక శాఖ, విద్యుత్, రవాణా, ఇతర శాఖల వారంతా ఆయా ప్రాంతాలకు తరలి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారన్నారు. క్షతగాత్రుల్ని ఆసుపత్రులకు తరలించడం, మంటల్ని అదుపుచేయడం వంటి చర్యలు చేపట్టారన్నారు. ఫైరింజన్లు, అంబులెన్సుల రాకపోకలకు ట్రాఫిక్ పోలీసులు క్లియరెన్స్ ఇచ్చారన్నారు. వైద్య సిబ్బంది ప్రథమ చికిత్స అందించారని, క్షతగాత్రులను కాపాడేందుకు ఆసుపత్రులకు స్ట్రెచర్లపై తరలించారని ఆయన తెలిపారు. ఇదంతా ప్రజల్లో అప్రమత్తత పెంచేందుకు సన్నాహక చర్య మాత్రమేనని తెలియజేస్తున్నామని అన్నారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వ శాఖలు ఏ విధంగా భాగస్వామ్యం అవుతాయో మాక్ డ్రిల్ ద్వారా చేశామని ఆయన పేర్కొన్నారు. తప్పుడు సమచారాన్ని నమ్మవద్దని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఏ సహాయం కావాలన్నా 112కు ఫోన్ చేయొచ్చని ఆయన సూచించారు.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com