- నెక్నాంపూర్ పెద్ద చెరువు ఆక్రమణల గుర్తింపు
- ఖరీదైన విల్లాలు నేలమట్టం
అక్రమ నిర్మాణాలపై కొరడా ఝుళిపిస్తున్న హైడ్రా మరోసారి పంజా విసిరింది. తాజాగా నగరంలోని మణికొండ నెక్నాంపూర్లో పెద్దచెరువు ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్‌లో అక్రమంగా 13 విల్లాల నిర్మాణం జరిగిందని హైడ్రాకు ఫిర్యాదులు అందాయి. ఇటీవల అక్కడ పరిశీలించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్.. శుక్రవారం ఉదయం నుంచి కూల్చివేతలకు ఆదేశాలిచ్చారు. దీంతో అక్కడ హైడ్రా సిబ్బంది ఇప్పటి వరకు విల్లాలను కూల్చివేశారు. నెక్నాంపూర్ చెరువును స్థానికులు కబ్జా చేసిన విషయం హైడ్రా దృష్టికి వచ్చింది. ఈ క్రమంలోనే హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశాలతో ఆ విభాగం అధికారులు చర్యలు చేపట్టారు. కూల్చివేతల సందర్బంగా పోలీసులతో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. మణికొండలో నెక్నాంపూర్ లేక్ వ్యూ విల్లాస్ లో అక్రమ నిర్మాణాలు ఉన్నట్లు గుర్తించారు. చెరువు కబ్జా చేసి.. అక్రమంగా నిర్మాణాల చేపట్టినట్లు హైడ్రా గుర్తించింది.
నెక్నాంపూర్ చెరువు కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు.. చేస్తున్నట్లు హైడ్రాకు స్థానికుల ఫిర్యాదు అందించారు. అయితే, గతంలో రెవెన్యూ, జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ ఆఫీసర్లు కూల్చివేశారు. మూడుసార్లు కూల్చివేసినా మళ్లీ అక్రమనిర్మాణాలు చేపట్టినట్లు గుర్తించారు. దీంతో గురువారం నాడు నెక్నాంపూర్ చెరువును హైడ్రా కమీషనర్ రంగనాథ్ ఓ సారి పరిశీలించారు. చెరువును పరిశీలించి ఎఫ్టీఎల్, బఫర్ జోన్లో నిర్మాణాలు చేపట్టినట్లు నిర్ధారించారు. దీంతో రంగనాథ్ అదేశాలతో కూల్చివేతలు చేపట్టారు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేతలు జరిగాయి.
ఒకదశలో సిటీ నలుమూలలా బుల్డోజర్లను పరుగులు పెట్టించిన హైడ్రా.. చెరువులను కబ్జా చేసి కట్టినవాటిపై కఠినంగానే ప్రవర్తించారు. ఇప్పుడు హైడ్రా ఫైలెట్ ప్రాజెక్ట్ గా హైదరాబాద్ లోని నాలుగు చెరువులను అభివృద్ది చేసేందుకు రెడీ అయ్యింది. ఇప్పటికే ఆయా చెరువుల డీపీఆర్ లు సైతం రెడీ చేసింది. కాగా, ఇక్కడ మొత్తం 13 విల్లాలను చెరువు కబ్జా చేసి నిర్మించారని గుర్తించగా.. అందులో రెండు విల్లాలపై కోర్టు స్టే ఉంది. ఆక్రమణలు తేల్చిన హైడ్రా.. ఈ రెండు విల్లాలపై కోర్టుకు సమాచారం ఇచ్చి కూల్చివేసింది. ఇక్కడ మొత్తం 13 విల్లాలు నిర్మించగా.. ఒక్కొక్కటి 400 గజాల విస్తీర్ణంలో ఒన్‌ప్లస్ టూగా నిర్మాణం చేశారు.