టాస్క్‌ఫోర్స్ తరహాలో అధికారాలు…
త్వరలో ఆర్డినెన్స్…అసెంబ్లీలో బిల్లు
కమిషనర్ రంగనాథ్ వెల్లడి
హైడ్రా చట్టబద్ధతపై కొందరు ప్రశ్నిస్తున్నారని, ఇది చట్టబద్ధమైనదేనని, జీవో 99 ద్వారా జులై 19న హైడ్రా ఏర్పాటు చేశారని కమిషనర్ రంగనాథ్ తెలిపారు. కార్యనిర్వాహక తీర్మానం ద్వారానే ఏర్పాటు చేశారని, దీనికి చట్టబద్ధత కల్పిస్తూ అక్టోబర్ నెల లోపు ఆర్డినెన్స్ రానుందని, విశేష అధికారాలు కూడా రాబోతున్నాయని, 6 వారాల తర్వాత అసెంబ్లీలో హైడ్రా బిల్లు వొస్తుందని, మున్సిపాలిటీలు, నీటిపారుదల, రెవెన్యూ శాఖలకు సహకారం అందిస్తామని, గ్రేహౌండ్స్, టాస్క్‌ఫోర్స్ తరహాలో హైడ్రా పనిచేస్తుందని రంగనాథ్ తెలిపారు. చాలా మంది హైడ్రాపై అనేక అనుమానాలు లేవనెత్తున్నారని, కొంతమంది కోర్టులను సైతం ఆశ్రయించారని.. అలాంటి వారికి త్వరలోనే సమాధానం దొరుకుతుందని రంగనాథ్ చెప్పుకొచ్చారు.
తెలంగాణ క్యాబినెట్ ఆమోదంతో హైడ్రాకు విశేషాధికారాలు కల్పిస్తూ ఆర్డినెన్స్ రాబోతున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన క్రేడాయ్ సమావేశంలో కమిషనర్ రంగనాథ్ ముఖ్య అతిథిగా హాజరయి మాట్లాడుతూ..‘తెలంగాణ ప్రభుత్వం జులై 19న జీవో 99 ద్వారా హైడ్రాను ఏర్పాటు చేసింది. హైడ్రాకు చట్టబద్ధత ఉందా, లేదా? అని ఇవాళ కొంతమంది ప్రశ్నిస్తున్నారు. దీనిపై కొంత మంది న్యాయస్థానాలకు సైతం వెళ్లారు. హైడ్రా చట్టబద్ధమైనదే. ఎగ్జిక్యూటివ్ రెజల్యుషన్ ద్వారా దీన్ని ఏర్పాటు చేశారు. ప్లానింగ్ కమిషన్, క్యాబినెట్ సెక్రటేరియెట్, లా కమిషన్, ఏసీబీ, విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వంటివి ఎన్నో ఎగ్జిక్యూటివ్ రెజల్యుషన్ ద్వారానే ఏర్పాటయ్యాయి.
అక్టోబర్ లోపు హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకురాబోతుంది. హైడ్రాను చట్టబద్ధం చేసేందుకు తెలంగాణ సర్కార్ పని చేస్తుంది. త్వరలో క్యాబినెట్ ఆమోదంతో దీనికి విశేషాధికారాలు రానున్నాయి. వాల్టా, మున్సిపల్, జీహెచ్‌ఎంసీ, నీటిపారుదల చట్టాల్లోని విశేషాధికారాలు సైతం హైడ్రాకు వస్తాయి. ఆరు వారాల తర్వాత తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో హైడ్రా బిల్లు తీసుకురాబోతుంది. మున్సిపాలిటీలు, నీటిపారుదల, రెవెన్యూ శాఖలకు హైడ్రా సహకారంగా ఉంటుంది. గ్రే హౌండ్స్, టాస్క్ ఫోర్స్ తరహాలోనే హైడ్రా పని చేస్తుంది’ అని చెప్పారు.