హైడ్రా గ్రీవెన్స్ డే
అక్రమార్కులను వణికిస్తున్న హైడ్రా.. కీలక నిర్ణయం తీసుకున్నది. కబ్జాదారులకు కూడా ఓ అవకాశం ఇచ్చేందుకు సిద్ధమైంది. హైడ్రా.. ఈ పేరు వింటే చాలు హైదరాబాద్ నగరంలోని ఆక్రమణదారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అక్రమ నిర్మాణాల కూల్చివేతల్లో తమవంతు ఎప్పుడొస్తుందోనంటూ బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. అయితే ఇన్నాళ్లూ ఫిర్యాదుల స్వీకరణ విషయంలో పరిమితంగా వ్యవహరించిన హైడ్రా త్వరలోనే నేరుగా సామాన్య ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించాలని నిర్ణయించింది.
ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ దిశగా ఈ మేరకు అడుగులు వేస్తోంది. నూతన సంవత్సరం 2025 ప్రారంభం నుంచి ప్రతి సోమవారం అర్జీలు స్వీకరించాలని నిర్ణయించింది. బుద్ధభవన్‌లోని హైడ్రా కార్యాలయంలో జనాల నుంచి ఫిర్యాదులు తీసుకోనుంది. ఇందుకోసం గ్రీవెన్స్ డే ఏర్పాటు చేసి సీనియర్ అధికారులు అందుబాటులో ఉండేలా చూస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు. చెరువులు, నాలాలు, కుంటలు, ప్రభుత్వ స్థలాలు, పార్కుల ఆక్రమణలపై ప్రజల నుంచి నేరుగా అర్జీలు స్వీకరిస్తామని ఆయన వెల్లడించారు.
పెరగనున్న ఫిర్యాదుల సంఖ్య!
సామాన్య జనాలే నేరుగా ఫిర్యాదులు చేసే అవకాశాన్ని హైడ్రా కల్పించడంతో ఆక్రమణలకు సంబంధించిన ఫిర్యాదుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. అంతేకాకుండా వెలుగులోకి వచ్చే ఆక్రమణలు కూడా పెరిగే ఛాన్స్ ఉంది. ఇంతకాలం జీహెచ్ఎంసీ, ఇతర ప్రభుత్వ విభాగాలు గుర్తించిన ఆక్రమణలు, అలాగే వాట్సప్, ఫోన్‌కాల్స్ ద్వారా హైడ్రా ఫిర్యాదులు స్వీకరించింది. పలుచోట్ల స్థానిక ప్రజలు కలిసికట్టుగా కూడా ఫిర్యాదులు చేశారు.
అయితే ప్రజల నుంచి వస్తున్న విశేష స్పందన నేపథ్యంలో నేరుగా సామాన్యుల నుంచే ఫిర్యాదులు స్వీకరించాలని హైడా నిర్ణయించింది. కాగా ఇప్పటివరకు వాట్సప్, ఫోన్ కాల్స్ ద్వారా హైడ్రాకు వేలాది ఫిర్యాదులు అందాయి. వాటన్నింటిని జాగ్రత్తగా పరిశీలిస్తూ ఆక్రమణలు తొలగిస్తోంది. స్థలాలను స్వాధీనం చేసుకొని ప్రభుత్వానికి అప్పగిస్తోంది. ప్రజల ఫిర్యాదులు కూడా ప్రారంభమైతే 2025లో హైడ్రా దూకుడు మరింత పెరగడం ఖాయంగా కనిపిస్తోంది