– అవసరమైతే జైలుకు కూడా వెళతా
– ఇప్పటికే తనపై 173 కేసులు ఉన్నాయన్న దానం నాగేందర్
ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హైడ్రా ఆపరేషన్ విషయంలో దానం నాగేందర్ అసహనం వ్యక్తం చేశారు. పేదల ఇళ్లను కూల్చివేస్తామంటే చూస్తూ ఊరుకునేది లేదని దాన్ని పూర్తిగా ఖండిస్తున్నట్లు తెలిపారు. హైడ్రా అధికారుల విషయంలోనూ వెనక్కి తగ్గేది లేదని ఆయన స్పష్టం చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలోనే తాను అధికారుల విషయంలో రాజీ పడలేదని అన్నారు. అవసరమైతే జైలుకు కూడా వెళ్తానని, ఇప్పటికే తనపై 173 కేసులు ఉన్నాయని ఆయన తెలిపారు.
తన ఇంట్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కేసీఆర్ ఫొటోలు ఉన్నాయని, వారి ఫొటోలు ఉంటే తప్పేమిటని ప్రశ్నించారు. నాయకుల విషయంలో ఎవరి అభిప్రాయం వారికి ఉంటుందన్నారు. పటాన్‌చెరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కేసీఆర్ ఫొటో ఉండటంపై కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు అసెంబ్లీ కార్యదర్శి నోటీసులు పంపించిన విషయాన్ని మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా, ఇప్పటి వరకు తనకు ఎలాంటి నోటీసులు రాలేదని ఆయన అన్నారు.