హైడ్రాకు సంబంధించిన డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ విభాగంలో కొత్తగా 357 సిబ్బందిని నియమించారు. పోలీస్ నియామక పరీక్షల్లో కొద్ది మార్కులతో ఉద్యోగం కోల్పోయిన వారిని మెరిట్ ఆధారంగా ఈ పోస్టులకు ఎంపిక చేశారు. ఇప్పటికే అక్రమ నిర్మాణాలు అంటూ కూల్చివేతలు మొదలుపెట్టిన హైడ్రా.. ఈ టీం మొత్తాన్ని కూల్చివేతల కోసమే నియామకం చేసుకుంది. దీంతో డీఆర్ఎఫ్ లోకి ఔట్ సోర్సింగ్ విధానంలో కొత్తగా 357 మంది వచ్చి చేరారు. ఈశిక్షణ ప్రారంభోత్సవంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా హైడ్రా పనితీరును వివరించారు.
ఈ సందర్భంగా రంగనాథ్ మాట్లాడుతూ.. హైడ్రాలో డీఆర్ఎఫ్ పాత్ర కీలకమన్నారు. ప్రజల అంచనాలకు అనుగుణంగా పనిచేద్దామని, హైడ్రా నిర్వహిస్తున్న విధులన్నిటిలో డీఆర్ఎఫ్ బృందాల పాత్ర చాలా ముఖ్యమన్నారు. ప్రభుత్వ లక్ష్యాలు, ప్రజల అంచనాల మేరకు హైడ్రా పని చేయాల్సినవసరం ఉందని, ఈ విషయంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అంబర్‌పేట్ పోలీసు శిక్షణా కేంద్రంలో వారం రోజుల పాటు ట్రైనింగ్ ఉంటుందన్నారు. ఈ సమాజంలోనూ.. ప్రభుత్వ పరంగా హైడ్రా ప్రధానమైన భూమిక పోషిస్తున్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని సూచించారు. ఇందుకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రజల ప్రాణాలతో పాటు.. ఆస్తి నష్టాన్ని తగ్గించడంలో డీఆర్ఎఫ్ పాత్ర చాలా కీలకమైనదన్నారు. ఇప్పుడు హైడ్రా విధులు కూడా తోడయ్యాయన్నారు. మన మీద ఉన్న నమ్మకంతో ప్రభుత్వం పలు బాధ్యతలు అప్పగిస్తోందన్నారు. తాజాగా ఇసుక అక్రమ రవాణాను నియంత్రించే పనిని కూడా హైడ్రాకు కేటాయించిందన్నారు. వీటన్నిటినీ ఎంతో శ్రద్ధగా, బాధ్యతగా చేయాల్సిన అవసరం ఉందన్నారు.