\నగరంలో ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ, విపత్తుల నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన హైడ్రాకు వచ్చే నెలలో ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకురాబోతుందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. మంత్రివర్గ ఆమోదంతో విశేష ఆధికారాలతో హైడ్రా ఉండబోతుందని పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని ఓ హోటల్లో క్రెడాయ్ నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రంగనాథ్ హైడ్రా వల్ల స్థిరాస్తి రంగంపై ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండబోతుందని వివరించారు. జీవో 99 ద్వారా జులై 19న హైడ్రా ఏర్పాటు చేశారని కమిషనర్ రంగనాథ్ తెలిపారు. హైడ్రా చట్టబద్దతను ప్రశ్నిస్తూ కొంతమంది న్యాయస్థానాలను ఆశ్రయించారని పేర్కొన్నారు.
ప్లానింగ్ కమిషన్, క్యాబినెట్ సెక్రటేరియెట్, లా కమిషన్, ఏసీబీ, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ తరహాలోనే ఎగ్జిక్యూటివ్ రిజల్యూషన్‌తో హైడ్రాను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. అయితే ఆర్డినెన్స్ వచ్చాక ఆరు వారాల్లో ప్రభుత్వ అసెంబ్లీలో హైడ్రా బిల్లు ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయని రంగనాథ్ వెల్లడించారు. ఈ క్రమంలో హైడ్రా ఎవరికి నోటీసులు ఇవ్వడం లేదని పునరుద్ఘాటించిన ఆయన టాస్క్ ఫోర్స్, గ్రే హౌండ్స్ తరహాలో హైడ్రా పనిచేస్తుందని తెలిపారు. మున్సిపాల్టీలు, నీటిపారుదల, రెవెన్యూ శాఖలకు హైడ్రా సహకారంగా ఉంటుందని తెలిపారు.
త్వరలోనే హైడ్రా పరిధి మరింత విస్తరించేలా
ఎఫ్టీఎల్, బఫర్‌జోన్‌ల పైన ప్రజలు అవగాహన తెచ్చుకుంటున్నారన్న హైడ్రా కమిషనర్, వాటి పరిధిలోని భూములను కొనుగోలు చేయకుండా అప్రమత్తమవుతారని తెలిపారు. ఎఫ్టీఎల్ పరిధిలోని అక్రమ నిర్మాణాలు కూల్చేందుకు నోటీసులు అవసరం లేదని పలు సందర్భాల్లో కోర్టులు చెప్పాయన్న రంగనాథ్, అందుకు చట్టాలు సైతం ఉన్నాయన్నారు. కొంతమంది పలుకుబడి ఉపయోగించి అనుమతుల ముసుగు తొడిగిన అక్రమ నిర్మాణాలను సైతం వదిలిపెట్టబోమని హెచ్చరించారు.