* నేను పోటీ చేయ
* చేవెళ్ళ ఎంపీ రంజిత్‌రెడ్డి డైలమా
* పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయం
టీఎస్ న్యూస్ :బీఆర్ ఎస్ సిట్టింగ్ ఎంపీ రంజిత్‌రెడ్డి ఈసారి చేవెళ్ళ ఎంపీగా పోటీ చేయడానికి వెనకాడుతున్నారు. చేవెళ్ళ పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితి బీఆర్‌ఎస్ గెలవదనే ఆందోళనలో ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ బీఆర్‌ఎస్ పార్టీ మూడవ స్థానంలో ఉన్నట్లు సర్వేల్లో స్పష్టమవుతున్నది. కాంగ్రెస్ పార్టీ ఇంకా ఈ నియోజకవర్గంలో అభ్యర్ధిని ప్రకటించకపోయినప్పటికీ సునితామహేందర్‌రెడ్డికి టికెట్ ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే బీజేపీ నుంచి కొండా మహేశ్వర్‌రెడ్డి బరిలో ఉన్నారు. ఇక ఇక్కడ కాంగ్రెస్ లేదంటే బీజేపీకి అవకాశాలున్నట్లు సర్వేలు చెపుతున్నాయి. ఈ సర్వేలు, ఓటర్ల మూడ్ నేపథ్యంలో బీఆర్‌ఎస్ మూడవ స్థానంలో ఉంటుందని అంచనా వేస్తున్నారు. దీంతో ఈ నియోజకవర్గం నుండి పోటీ చేస్తే లాభం లేదన్న అనుమానాల్లో ఊగిసలాడుతున్నారు.
ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ప్రచారాలు మొదలుపెట్టాయి. కానీ రంజిత్‌రెడ్డి మాత్రం ఇప్పటి వరకు ఎటువంటి ప్రచార పర్వాన్ని మొదలు పెట్టలేదు. గతంలో ఆయన ఆరోగ్య చేవెళ్ళతోటి ప్రచార రధాలు రూపంలో అంబులెన్స్‌లను తిప్పారు. ఇప్పుడు అవి కూడా బంద్ చేశారు. రాజకీయ ప్రచారాన్ని ఆయన దాదాపుగా తగ్గించేసినట్లు స్పష్టమవుతుంది. దీంతో ఆయన పోటీకి వెనకాడుతున్నట్లు తేలింది. దీంతో బీఆర్‌ఎస్ పార్టీ కొత్త అభ్యర్ధి కోసం వెతుకుతోంది. రంగారెడ్డి జిల్లా మాజీ జెడ్‌పీ ఛైర్మన్ కాసాని జ్ఞానేశ్వర కొడుకు వీరేశ్‌కు టికెట్‌ను ఇవ్వాలని భావిస్తున్నారు. ఇప్పటికే రంజిత్‌రెడ్డి కూడా బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ ను కలిసి తాను బరిలో నిలబడడం లేదనే స్పష్ఠత ఇచ్చినట్లు తెలుస్తుంది. దీంతో వీరేశ్‌కు టికెట్ ఇస్తారని స్పష్టమవుతున్నది. ఏది ఏమైనప్పటికీ చేవెళ్ళలో మొన్నటి వరకు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ పార్టీ ఇప్పుడు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నది.