దక్షిణాది అగ్ర కథానాయికల్లో సమంత ఒకరు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ.. ఇలా భాషతో సంబంధం లేకుండా అన్ని రకాల చిత్రాల్లో నటించి మెప్పించింది. కెరీర్ మొదట్లో మోడలింగ్ చేసిన సామ్.. 2010లో ఏ మాయ చేశావే చిత్రంతో తెలుగులో ఆరంగేట్రం చేసింది. తొలి సినిమాతోనే అందర్నీ మాయ చేసింది. ఆ తర్వాత వరుసగా ఆఫర్స్ ఆమెకు క్యూ కట్టాయి. బృందావనం, దూకుడు (2011), ఈగ (2012), ఎటో వెళ్లి పోయింది మనసు (2012), సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు (2013), అత్తారింటికి దారేది (2013).. తదితర చిత్రాలతో అతి తక్కువ సమయంలోనే తెలుగు నాట టాప్ హీరోయిన్ గా మారింది. నాగ చైతన్యతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. అలా అక్టోబర్ 6, 7 2017లో సమంత, నాగ చైతన్యల పెళ్లి జరిగింది. గోవాలో హిందూ, క్రిస్టియన్ సాంప్రదాయాల ప్రకారం వీరి వివాహం ఘనంగా జరిగింది. పెళ్లి తర్వాత ఇద్దరూ టాలీవుడ్ స్టార్ కపుల్స్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ ఇరువురి వ్యక్తిగత కారణాల వల్ల 2 అక్టోబరు, 2021న విడిపోతున్నట్టు సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ఆ తర్వాత నాగచైతన్య.. నటి శోభిత ధూళిపాళ్లను 2024లో వివాహం చేసుకున్నాడు. ఇక సమంత మాత్రం సినిమాలతో బిజీగా ఉంది. అయితే ఈ మధ్య బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో ఆమె ప్రేమలో ఉన్నట్లు కథనాలు వచ్చాయి. సమంత ఇప్పటికే ‘ది ఫ్యామిలీ మ్యాన్’, ‘సిటాడెల్ హనీ బన్నీ’ వంటి చిత్రాలలో రాజ్ నిడిమోరుతో కలిసి పనిచేసింది. దీంతో వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఇక తాజాగా సమంత ప్రొడ్యూసర్ అవతారం ఎత్తింది. శుభం అనే సినిమాను నిర్మించింది. ఈ సినిమాతో విజయం సాధించింది. ఇక ఈ సినిమా సక్సెస్ జోష్ లో ఉన్న సమంత తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని సెలబ్రిటీగా ఓసారి అత్యంత కష్టంగా అనిపించింది అని తెలిపింది. “సెలబ్రిటీగా ఉండడం అంత సులభం కాదు. చెన్నైలో ఒకసారి మా నాన్న అంత్యక్రియలకు హాజరయ్యేందుకు వెళ్తున్నప్పుడు కొంతమంది అభిమానులు ఫోటో తీయడానికి నా దగ్గరకు వచ్చారు. అయినా నేను వారికి నో చెప్పలేదు. నవ్వుతూ ఫొటోలకు పోజులిచ్చా. ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. నాన్న చనిపోయిన విషయంలో కుంగిపోతున్నా నేను ఒక సెలబ్రిటీని అనే విషయాన్ని గుర్తుంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది” అని సమంత ఎమోషనల్ అయింది.