-
నేను లోకల్.. కేసులు నాకు కొత్త కాదు
-
ఏవీ రంగనాథ్ కాదు కదా ఎవడు నన్నేం చేయలేడు
-
ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు
పోలీసు కేసులు నాకు కొత్త కాదని, హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ కాదు కదా..ఎవడు నన్నేం చేయలేడని ఖైరతాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో తనపై నమోదైన కేసు విషయమై ఆయన మీడియాతో మాట్లాడారు. జీహెచ్‌ఎంసీ ఎన్‌ఫోర్స్‌మెంట్, విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ కమిషనర్ ఏవీ రంగనాథ్‌కు కొత్తగా వచ్చిన పదవీ ఇష్టం లేనట్లు ఉందని, అందుకే నాపైన కేసు పెట్టాడని సెటైర్ వేశారు. అధికారులు వస్తుంటారు పోతుంటారు, కానీ నేను లోకల్ అని నన్ను ఎవడు ఏం చేయలేడని నాగేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. నందగిరిహిల్స్ హుడా లే ఔట్‌లో ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని నేను అక్కడకి వెళ్లానని, హైదరాబాద్ నగరం కాస్మోపాలిటన్ సిటీ అని, అన్నివర్గాల ప్రజలకు సౌకర్యాలు, సమస్యలు నెరవేర్చడం ప్రజాప్రతినిధిగా నా బాధ్యత అన్నారు. కేసు పెట్టిన అధికారులకు ప్రివిలేజీషన్ నోటీసులు ఇస్తానని, వారిపై సీఎం రేవంత్‌రెడ్డికి ఫిర్యాదు చేస్తానన్నారు.
ప్రజాప్రతినిధిగా నాకు ఎక్కడికైనా వెళ్లే హక్కు ఉందని, నన్ను అడ్డుకునే అధికారం ఏ అధికారికి లేదన్నారు. అంతకుముందు దానం నాగేందర్ సహా అతని అనుచరులపై జూబ్లీహిల్స్ నందగిరి హిల్స్, గురు బ్రహ్మ నగర్లో జీహెచ్ఎంసీ పార్కులో కట్టిన కాంపౌండ్ గోడను కూల్చారని ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల ఫిర్యాద మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ విషయంపై సీఎం రేవంత్ రెడ్డికి కూడా ఫిర్యాదు చేస్తామని దానం నాగేందర్ అన్నారు. హైడ్రా అధికారులు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నందగిరి హిల్స్ గురుబ్రహ్మ నగర్‌లో పేదల గుడిసెలు కూల్చివేసే అధికారం వారికి ఎవరిచ్చారని ప్రశ్నించారు. పార్క్ స్థలం అని చెప్పి ఈవీడీఎం వాళ్లు పెద్ద ప్రహరీ గోడ కడుతున్నారని.. బస్తీ వాసులకు దారి లేకుండా ప్రహరీ గోడ ఎలా కడతారు? అని ప్రశ్నించారు. గోడ కట్టొద్దన్నందుకే ఈవీడీఎం అధికారులు తనపై కేసు పెట్టారని దానం తెలిపారు. హైదరాబాద్‌ను హైడ్రా అధికారులకేమీ రాసివ్వలేదని.. ప్రజా సమస్యలపై తన పోరాటం కొనసాగుతుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. తనపై 190 కేసులు ఉన్నాయని.. కేసులకు భయపడే ప్రసక్తే లేదని ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పష్టం చేశారు.
గ్రేటర్‌లో ఆపరేషన్ హైడ్రా
గ్రేటర్‌లో ఆపరేషన్ హైడ్రా కొనసాగుతోంది. మంగళవారం నాడు జీహెచ్ఎంసీలో చెరువులను హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఉప్పల్ నల్లచెరువులో కబ్జాలకు పాల్పడితే సహించేది లేదని హైడ్రా కమిషనర్ హెచ్చరించారు. చెరువు పర్యవేక్షణకు ప్రత్యేక ప్రణాళికను రూపొందించనున్నట్లు తెలిపారు. ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి సోమవారం కమిషనర్ రంగనాథ్‌ను కలసి ఉప్పల్ నల్ల చెరువులో జరుగుతున్న కబ్జాల గురించి వివరించిన విషయం తెలిసిందే. దీంతో రంగనాథ్ మంగళవారం ఉప్పల్లోని ఎమ్మెల్సీ తీన్ మార్ మల్లన్న, పరమేశ్వర్ రెడ్డి వజ్రేష్ యాదవ్, ఉప్పల్ కార్పొరేటర్ రజిత పరమేశ్వర్ రెడ్డితో కలిసి నల్లచెరువును పరిశీలించారు. నల్ల చెరువులో కబ్జాలను, ఆక్రమణలు పూర్తిగా తొలగించడంతో పాటు చెరువు పరిరక్షణ కోసం హైడ్రా పనిచేస్తుందని తెలిపారు. చెరువులను, నాలాలను, ఇతర ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి కబ్జాలకు పాల్పడితే చర్యలు కఠినంగా ఉంటాయని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు.