Saturday, December 28, 2024

రాజకీయ నిర్ణయాలకు, ఏకపక్ష నిర్ణయాలకు బలికావొద్దు

స్వతంత్రంగా పని చేద్దాం…. ఐఏఎస్‌లంతా ఐక్యంగా ఉండాలి
ఎవరైనా ఫైల్‌పై సంతకం చేయాలని ఒత్తిళ్లు తీసుకొస్తే ఫైల్‌ను పక్కన పెడదాం
సీనియర్ ఐఏఎస్‌ల ఆధ్వర్యంలో రహస్య సమావేశం
కొందరు ఐఏఎస్‌ల డుమ్మా, మరికొందరు ఐఏఎస్‌ల గైర్హాజరు

వికారాబాద్ జిల్లా కలెక్టర్‌పై జరిగిన దాడిపై రాష్ట్ర ఐఏఎస్‌ల సంఘం అంతర్మథనంలో పడింది. తమపై ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేవని, రానున్న రోజుల్లో తమపై ఎలాంటి ఒత్తిడిలు తీసుకురాకుండా చూడాలని ప్రభుత్వానికి ఐఏఎస్‌లు సూచిస్తున్నారు. ఈ విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని, పేదల కోసం పనిచేయడమే తమ విధి అని, ఆ దిశగానే తామంతా రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామం అయ్యామని, ఈ విషయాన్ని అన్ని రాజకీయ పార్టీల నాయకులు, ప్రజలు గమనించాలని ఐఏఎస్‌లు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పటికే వికారాబాద్ జిల్లా కలెక్టర్‌పై జరిగిన దాడిని రాష్ట్ర ఐఏఎస్‌ల సంఘం ఖండించగా రానున్న రోజుల్లో పాలనపై రాజకీయ ఒత్తిళ్లు లేకుండా తీసుకోవాల్సిన చర్యల గురించి పలువురు ఐఏఎస్‌లు సమావేశమై చర్చించినట్టుగా తెలిసింది. ఈ రహస్య సమావేశంలో భాగంగా తమకు వివిధ రాజకీయ నాయకుల నుంచి వస్తున్న ఒత్తిళ్లు, ప్రభుత్వం నుంచి వస్తున్న ఇబ్బందులను ఎలా అధిగమించాలి, తమ పాలనపై ఎలాంటి రాజకీయ నాయకుల ప్రభావం లేదన్న విషయాన్ని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలన్న దానిపై ఈ సమావేశంలో ఐఏఎస్‌లు చర్చించినట్టుగా తెలిసింది.

ఆత్మగౌరవంతో పని చేద్దాం
గత శనివారం నోవాటెల్‌లో బ్యూరోక్రాట్స్‌లకు సంబంధించి రహస్య సమావేశం జరిగినట్టుగా సమాచారం. దీనికి ఓ సీనియర్ ఐఏఎస్ అధ్యక్షత వహించారని ఐఏఎస్‌లపై జరిగిన దాడులు, కేసులకు సంబంధించి వారంతా సీరియస్ చర్చించినట్టుగా తెలిసింది. రానున్న రోజుల్లో ఏ రాజకీయ నాయకుల నిర్ణయాలకు, ఒత్తిళ్లకు తలొగ్గద్దని, ఏ పార్టీకి, ఏ నాయకుడికి వంత పాడొద్దని, నిబంధనల మేరకు పనిచేయాలని ఈ సమావేశంలో పాల్గొన్న ఐఏఎస్‌లు తీర్మానించినట్టుగా తెలిసింది. రాజకీయ నిర్ణయాలకు, ఏకపక్ష నిర్ణయాలు బలికావొద్దని, స్వతంత్రంగా పని చేద్దామని, ఐఏఎస్‌లంతా ఐక్యంగా ఉండాలని సీనియర్ ఐఏఎస్‌లు సూచించినట్టుగా తెలిసింది. ఎవరైనా ఫైల్‌పై సంతకం చేయాలని ఒత్తిళ్లు తీసుకొస్తే ఫైల్‌ను పక్కన పెట్టాలని కూడా వారు ఈ సమావేశంలో నిర్ణయించినట్టుగా సమాచారం.

రానున్న రోజుల్లో కలెక్టర్లను ఎవరు కించపర్చినా సహించేది లేదని, ఆత్మగౌరవంతో పని చేద్దామని, పేద ప్రజలకు న్యాయం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగాలని వారంతా నిర్ణయించినట్టుగా తెలిసింది. దీంతోపాటు కొందరు జూనియర్ ఐఏఎస్‌ల పనితీరు, వారి వివాదస్పద నిర్ణయాల వల్ల కూడా ప్రజల్లో పలుచన అవుతున్నామని, రానున్న రోజుల్లో ఆలోచించి సీనియర్ సలహాలతో ముందుకెళ్లాలని సీనియర్ ఐఏఎస్‌లు సూచించినట్టుగా తెలిసింది. అయితే ఈ ఐఏఎస్‌ల సమావేశంలో కొంతమంది ఐఏఎస్‌లు మాత్రమే పాల్గొన్నారని మరికొందరు సీనియర్ ఐఏఎస్‌లు ఈ సమావేశానికి డుమ్మా కొట్టారని, మరికొందరిని కావాలనే ఈ సమావేశానికి పిలవలేదన్న గుసగుగసలు వినిపిస్తున్నాయి. ఏదీ ఏమైనా వికారాబాద్ కలెక్టర్‌పై జరిగిన దాడి, అమోయ్‌కుమార్‌ను ఈడీ విచారణకు పిలిపించడం లాంటి పరిస్థితుల నేపథ్యంలో ఐఏఎస్‌లు ఈ రహస్య సమావేశం నిర్వహించడం ప్రస్తుతం హాట్‌టాఫిక్‌గా మారింది.

ప్ర‌దాన వార్త‌లు

అల్లు అర్జున్ పట్ల రేవంత్ రెడ్డి దారుణంగా వ్యవహరిస్తున్నారన్న డీకే అరుణ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com