కేవలం ఒక ఐడియాకు లక్ష రూపాయల బహుమతి
సీనియర్ ఐఏఎస్ అధికారి, తెలంగాణ ఫైనాన్స్ కమిషన్ మెంబర్ స్మితా సబర్వాల్ బంపర్ ఆఫర్ ప్రకటించారు. ఒక్క ఐడియా ఇచ్చి ఏకంగా లక్ష రూపాయలు గెలుచుకోండంటూ ట్విట్టర్-ఎక్స్ లో ఆసక్తికరమైన పోస్ట్ పెట్టారు. తెలంగాణ ప్రభుత్వ ఆదాయాన్ని పెంచే ఐడియా ఇవ్వాలంటూ ఈ ఆఫర్ ను ప్రకటించారు స్మితా సబర్వాల్. రాష్ట్రంలో పట్టణాలతో పాటు గ్రామాల నుంచి ఆదాయం సృష్టించే ఇన్నోవేషన్ ఐడియాలను ఆహ్వానించారు ఈ ఐఏఎస్ అధికారి. తెలంగాణ ఫైనాన్స్ కమిషన్ ఆధ్వర్యంలో ఐడియాథాన్ పేరుతో ఈ ప్రకటన చేశారు స్మితా సబర్వాల్.
సాధారణ పౌరుల నుంచి మొదలు సీనియర్ సిటిజన్లు, మాజీ అధికారులు ఇలా ఎవరైనా ప్రభుత్వానికి ఆదాయం సృష్టించే మార్గాల గురించి ఐడియా ఇవ్వాలని స్మితా సబర్వాల్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్రానికి ఆదాయం సృష్టించే ఐడియా ఇచ్చిన వారికి లక్ష రూపాయల రివార్డ్ ఇవ్వనున్నట్టు ప్రకటించారు. ఎవరైనా సర్కారు ఆదాయం పెంచే సలహా ఇవ్వదలుకుంటే.. తమ ఐడియాకు సంబందించిన పూర్తి వివరాలను ప్రభుత్వానికి వివరించాల్సి ఉంటుందట. ఈ ఐడియాల కోసం దరఖాస్తు చేయడానికి 2024 సెప్టెంబర్ 30 చివరి తేదీగా ప్రకటించారు స్మితా సబర్వాల్. ఇందుకు సంబంచింన పూర్తి వివరాల కోసం.. tgsfc2024@gmail.com ను కూడా సంప్రదించాలని పేర్కొన్నారు స్మితా సబర్వాల్.
ఓ వైపు అప్పుల భారం, మరోవైపు సంక్షేమ పథకాల అమలుతో తెలంగాణ ప్రభుత్వం ఆర్ధిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది. అందుకే పన్నులు, ఇతర మార్గాల్లో ప్రభుత్వ ఆదాయం భారీగా పెంచాలని రేవంత్ రెడ్డి అన్ని శాఖలను ఆదేశించారు. ఈ క్రమంలోనే ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ ఇలా ప్రభుత్వ ఆదాయం పెంచే ఐడియాలు చెప్పాలని వినూత్నంగా ప్రకటన చేశారని తెలుస్తోంది. మరి స్మితా సబర్వాల్ ఈ ఐడియాల ఆఫర్ పై సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందన్నదే ఆసక్తకరంగా మారింది.