ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ బాలికల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. బజార్ హత్నూర్ మండలంలోని మోర్‌కండి గ్రామానికి చెందిన రాజేశ్వర్ కూతురు లాలిత్య చక్రం 9వ తరగతి చదువుతున్నది. ఆదివారం రాత్రి తోటి విద్యార్థులతో కలిసి భోజనం చేసి నిద్రపోయింది. ఉదయం విద్యార్థులంతా నిద్రలేచినప్పటికీ ఆమె.. మేల్కొనకపోవడంతో ఉపాధ్యాయులకు సమాచారం అందించారు. దీంతో విగతజీవిగా మారిన లాలిత్యను చూసిన ఉపాధ్యాయులు పోలీసులు, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న సీఐ భీమేష్ వివరాలు సేకరించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని బోథ్ దవాఖానకు తరలించారు. కాగా, లాలిత్య కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారని ఉపాధ్యాయులు తెలిపారు. అయితే అనారోగ్యంపై పాఠశాల సిబ్బంది తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.